Tollywood Actor Paruchuri Gopala Krsihna Review On Masooda Movie - Sakshi
Sakshi News home page

Paruchuri Gopala Krishna: కేవలం దాని కోసమే ఆ సినిమా చూడొచ్చు: పరుచూరి

Published Sat, Jan 7 2023 1:14 PM | Last Updated on Sat, Jan 7 2023 1:33 PM

Tollywood Actor Paruchuri Gopala Krsihna Review On Masooda Movie - Sakshi

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన చిత్రం 'మసూద'. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమాతో సాయికిరణ్‌ దర్శకుడిగా పరిచయమయ్యాడు. నవంబర్‌ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మసూద బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్  అందుకుంది. ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో సంగీత, తిరువీర్‌, కావ్య కల్యాణ్‌ రామ్‌, శుభలేఖ సుధాకర్‌ కీలక పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే.  

(ఇది చదవండి: Masooda Review: ‘మసూద’ మూవీ రివ్యూ)

తాజాగా ఈ సినిమాపై ప్రముఖ రచయిత గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమాని తెరకెక్కించిన విధానం బాగుందని కొనియాడారు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందన్నారు. చిన్న కథను దర్శకుడు సాయి కిరణ్ ఎంతో నేర్పుతో తెరకెక్కించారని మెచ్చుకున్నారు. తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి ప్రతిభ చూపారని ప్రశంసించారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'మసూద సినిమా ఓ చిన్న కథ. అద్భుతంగా నడిచిన సస్పెన్స్ థ్రిల్లర్ ఈ మూవీ. ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయా అనే కోణంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా చూస్తే ఆత్మలు ఉన్నాయనే నమ్మకం ప్రేక్షకులకు కచ్చితంగా వస్తుంది. ఈ కథలో ఓ తల్లీ, బిడ్డ ఆధారంగా తెరకెక్కించారు. నాజియా అనే అమ్మాయిని మసూద ఆత్మ ఆవహిస్తే ఏం జరిగిందనేదే కథ. సాయి కిరణ్ ఓ వైపు మంచి ప్రేమకథను చూపించారు. కాసేపటికే కథను మలుపులు తిప్పారు. కథను మలిచిన విధానం చాలా బాగుంది. ఇలాంటి కథలకు బ్యాక్‌ గ్రౌండ్ ముఖ్యం. కాంతారలాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులను వణికించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.' అని అన్నారు.  

(ఇది చదవండి: ఏ టైటిల్‌ పెట్టాలో తెలియ​క 'మసూద' అని పెట్టాం : నిర్మాత

అయితే ఈ సినిమా విషయంలో ఆయన కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. మసూద బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీ సినిమా ఆరంభంలోనూ.. మళ్లీ మధ్యలోనూ చూపించారు. అలా కాకుండా ఒకేసారి మధ్యలో ఆ కథ చెప్పి ఉంటే బాగుండేదన్నారు. సినిమా క్లైమాక్స్‌లోనూ మసూద ఆత్మను బయటకు  పంపించేటప్పుడు హీరోపై ఎటాక్‌ చేస్తున్నట్లు చూపించారు. అదే సమయంలో నజియాలో ఆత్మ.. చుట్టూ ఉన్న వాళ్లపై దాడి చేసినట్లు చూపారు. కానీ ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో ఆత్మ ఎలా ఉంటుంది అనే సందేహం వచ్చిందన్నారు. సినిమా కల్పన కాబట్టి వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిత్రాలను ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం మాత్రమే చూడొచ్చని పరుచూరి వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement