Singer Antara Nandy Makes Playback Debut With Ponniyin Selvan Song - Sakshi
Sakshi News home page

బాల్కనీ నుంచి ఏఆర్‌ రెహమాన్‌ స్టుడియో వరకూ

Published Mon, Sep 26 2022 7:27 PM | Last Updated on Mon, Sep 26 2022 7:45 PM

Singer Antara Nandy Makes Playback Debut with Ponniyin Selvan Song - Sakshi

అంతరా నందికి పాడటం ఇష్టం. లాక్‌డౌన్‌లో ఇంటి బాల్కనీలో నిలబడి కచ్చేరీలు ఇచ్చి వాటిని రీల్స్‌ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేది. విపరీతంగా అభిమానులు ఏర్పడ్డారు. ఈ సంగతి రెహమాన్‌ వరకూ వెళ్లింది. రెహమాన్‌ ఆమెతో కొన్ని జింగిల్స్‌ పాడించాడు. కాని ఆ గుర్తింపు కాదు ఆమె కోరుకున్నది. ఆఖరుకు అసలైన పిలుపు వచ్చింది. మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో పాటలు రికార్డు చేయడం ద్వారా ఆమెకు అతి పెద్ద బ్రేక్‌ ఇచ్చాడు రెహమాన్‌. కళ పట్ల నిజమైన తపన ఉంటే చేరవలసిన గమ్యానికి చేరతామని అంటోంది అంతరా.


‘జల సఖినై నేనే నిలిచా నెలరాజా ఏలే ఏలేలో’... పొన్నియన్‌ సెల్వన్‌ – 1 (పి.ఎస్‌.1)లో ఈ పాట యూ ట్యూబ్‌లో వినండి ఆ గొంతులో స్వచ్ఛమైన నీటి ధార ఉన్నట్టుంటుంది. అంతరా నంది స్వరం అది. ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతంలో పాడాలని ప్రతి గాయనికి ఉంటుంది. అందరికీ ఆ అవకాశం రాదు. మణిరత్నం సినిమాకు పాడాలని ప్రతి గాయనికి ఉంటుంది. అందరికీ ఆ అవకాశం రాదు. మణిరత్నం సినిమా కోసం ఏ.ఆర్‌. రెహమాన్‌ చేసిన పాటను పాడే అవకాశం రావడం? నిజంగా అదృష్టమే. అదృష్టం కంటే కూడా ప్రతిభకు ఒక పతకాన్ని ఇవ్వడం. ఆ పతకంతో ఇక లోకాన ఎక్కడైనా పాడొచ్చు. కాని ఇక్కడ వరకూ రావడానికి 23 ఏళ్ల అంతరా నందీ ఎవరినీ నమ్ముకోలేదు. తనను తాను తప్ప.


పాటను కనిపెట్టి

నాలుగేళ్ల వయసులోనే పాడటం మొదలెట్టింది అంతరా. వాళ్లది అస్సామ్‌. తల్లిదండ్రులిద్దరూ ఇంజనీర్లు. కోలకటా షిఫ్ట్‌ అయ్యారు. ఇప్పుడు పూణెలో ఉన్నారు. కోల్‌కటాలో సంగీతంలో శిక్షణ ఇప్పించారు అంతరాకు. దాంతో 9 ఏళ్ల వయసులో ‘స రి గ మ ప... లిటిల్‌ చాంప్స్‌’లో పాడి టాప్‌ 3 స్థాయికి వచ్చింది. దాంతో పేరు వచ్చింది. సెలబ్రిటీ హోదా వచ్చింది. ఇక తనకు తిరుగులేదనుకుంది.


టీనేజ్‌ సమస్య

టీనేజ్‌ వచ్చేసరికి గొంతులో మార్పులొచ్చాయి. అంతరా పాడుతుంటే అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. పాట ఏ మాత్రం శ్రావ్యంగా ఉండేది కాదు. స్నేహితులు ఆమెతో ‘ఇక ఎప్పటికీ పాడకు... మీ అమ్మా నాన్నల్లా ఇంజనీరువికా’ అని కూడా చెప్పేశారు. కాని అంతరా వినలేదు. పట్టుదలగా మళ్లీ సాధన చేసింది. గొంతును అదుపులోకి తెచ్చుకుంది. తన పాట కోకిల పాట అని నిరూపించుకుంది.


సోషల్‌ మీడియాతో

మన దగ్గర ప్రతిభ ఉన్నంత మాత్రాన మన దగ్గరకు అవకాశం రావాలని లేదు. అంతరా దగ్గర మంచి గొంతు ఉన్నా అది లోకానికి తెలిసేది ఎలా? నాకు నేను చెప్పుకుంటాను అనుకుంది అంతరా. తన చెల్లెలు అంకితాతో కలిసి ‘నంది సిస్టర్స్‌’ పేరుతో రీల్స్‌ మొదలెట్టింది. ఇద్దరూ కలిసి మంచి మంచి సినిమా పాటలు పాడుతూ ఇన్‌స్టా ద్వారా లక్షలాది అభిమానులను పొందారు. కేవలం సోషల్‌ మీడియా ద్వారానే అంతరా ప్రతిభ ఏ.ఆర్‌. రెహమాన్‌కు చేరింది. ఆ సమయంలో యూ ట్యూబ్‌లో వస్తున్న ‘అరైవ్డ్‌’ అనే సింగింగ్‌ కాంపిటిషన్‌లో ఏఆర్‌ రెహమాన్‌ ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఆమె గొంతును మెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత అడపా దడపా ఏవైనా జింగిల్స్‌కు సినిమాతో సంబంధం లేని ప్రాజెక్ట్స్‌కు అంతరా చేత పాడించాడు. కాని ఆమె ఓర్పు, కష్టం వృథా కాలేదు. ఇన్నాళ్లకు పిఎస్‌–1లో మంచి హిట్‌ పాట ఇచ్చాడు. ‘మా అమ్మా నాన్నలు నా పాట విని కన్నీళ్లు కార్చారు’ అంటుంది అంతరా.


‘మీ దగ్గర ప్రతిభ ఉంటే సోషల్‌ మీడియా ద్వారా అరిచి చెప్పండి. సిగ్గు పడకండి. మరో మార్గం లేదు’ అంటుంది అంతరా. ఆమె మాట వింటే ఫలితం ఎలా ఉంటుందో ఆమే ఉదాహరణ. (క్లిక్ చేయండి: అవును.. గుర్రం ఎగిరింది.. కలా? నిజమా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement