అసంపూర్ణం కూడా సంపూర్ణమే! | Sameera Reddy opens up about body shaming | Sakshi
Sakshi News home page

అసంపూర్ణం కూడా సంపూర్ణమే!

Published Fri, Jul 24 2020 2:44 AM | Last Updated on Fri, Jul 24 2020 2:44 AM

Sameera Reddy opens up about body shaming - Sakshi

బాడీషేమింగ్‌ చేసేవాళ్లను ఉద్దేశించి ‘షేమ్‌ షేమ్‌’ అంటున్నారు సమీరా రెడ్డి. ‘‘మనం ఎలా ఉంటే అలా స్వీకరించడాన్ని నేర్చుకుందాం. మనల్ని మనం ఇష్టపడదాం. పోల్చుకోవడం మానేద్దాం. పోల్చి చూడటం ఆపేద్దాం’’ అని కూడా అన్నారు సమీరా. బాడీషేమింగ్‌ గురించి ఓ వీడియోను తన  ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారామె. ఇటీవలే తల్లి అయిన ఒక అమ్మాయి పంపిన మెసేజ్‌ చూసి ఈ విషయం మీద ఈ వీడియో చేసినట్టు తెలిపారు సమీరా.

వీడియో సారాంశం ఈ విధంగా... ‘‘సమీరా.. ఈ మధ్యనే తల్లయిన నేను బరువు పెరిగాను. నా శరీరం నాకే నచ్చడం లేదు. అసహ్యంగా ఉన్నాను అనిపిస్తోంది’ అనే మెసేజ్‌ నాకు వచ్చింది. నాకు చాలా బాధ అనిపించింది. మన దగ్గర ఏం లేదో (జీరో సైజ్‌ అయినా ఇంకేదైనా..) దాని గురించే పదే పదే ఆలోచించి బాధపడటం మానేద్దాం. మన దగ్గర ఉన్నదానితో సంతోషపడటం నేర్చుకుందాం. చిన్నప్పటి నుంచి నన్ను మా అక్కయ్యలతోనో ఎవరో ఒకరితోనో పోలుస్తూనే ఉన్నారు.

తను అలా ఉంది.. నువ్వు ఇలా ఉన్నావు అని. ఇక నేను పని చేసిన ఇండస్ట్రీ చేసే పనే అది.. పోల్చి చూడటం. దాంతో నేను చూడటానికి బావుండాలని చేయని ప్రయత్నం లేదు. మేకప్, లెన్స్, ప్యాడ్స్‌.. ఇలా అన్నీ వాడాను. ఇలాంటివి చేసినా సంతోషంగా ఉన్నానా? అంటే అస్సలు లేదు. మనం ఎలా ఉన్నాం అనేది ముఖ్యం కాదు. సంతోషంగా ఉన్నామా? లేదా? అన్నదే ముఖ్యం. చాలా ఏళ్లుగా ఇలాంటి షేమింగ్స్‌తో విసుగెత్తిపోయాను. పట్టించుకోవడం మానేశాను. మనం సంతోషంగా ఉన్నామా? లేదా అనే విషయం మీదే దృష్టి పెట్టాను. మీరు కూడా అదే పాటించండి.

లావుగా ఉన్నారా? ఏం ఫర్వాలేదు.. మెల్లిగా తగ్గుతారు. కంగారుపడకండి.. కుంగిపోకండి. అనవసరమైన విమర్శలతో వేరే వాళ్లు కుంగిపోయేలా చేయకండి. సంతోషంగా ఉండటంపైనే ఫోకస్‌గా ఉండండి. అసంపూర్ణాన్ని కూడా ఆస్వాదిద్దాం. అసంపూర్ణం కూడా సంపూర్ణం అనుకుందాం. అప్పుడు చాలా బాగుంటుంది!’’ అని ఆ వీడియోలో సమీరా రెడ్డి చెప్పిన మాటలు చాలా అర్థవంతంగా, ధైర్యం నింపేలా ఉన్నాయి. సమీరా రెడ్డి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. తల్లయినప్పటి నుంచి తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఇలాంటి విషయాలు చర్చిస్తూ, అవగాహన తీసుకొస్తూ, అభద్రతాభావంతో బాధపడేవాళ్లకు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement