అందుకు కారణం సీఎం వైఎస్‌ జగన్: కోన వెంకట్‌ | Kona Venkat Comments On CM YS Jagan At Galli Rowdy First Look Launch | Sakshi
Sakshi News home page

అందుకు కారణం సీఎం వైఎస్‌ జగన్: కోన వెంకట్‌

Published Mon, Apr 5 2021 4:24 AM | Last Updated on Mon, Apr 5 2021 8:38 AM

Kona Venkat Comments On CM YS Jagan At  Galli Rowdy First Look Launch - Sakshi

‘‘ఎంవీవీ సత్యనారాయణగారు మంచి వ్యక్తి. ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టుకోవడంలో కోన వెంకట్‌ స్పెషలిస్ట్‌. కామెడీ సినిమాలు తీయడంలో నాగేశ్వర రెడ్డిది ప్రత్యేక శైలి’’ అని డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ అన్నారు. సందీప్‌ కిషన్, నేహా శెట్టి జంటగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘గల్లీ రౌడీ’. కోన వెంకట్‌ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా మే 21న విడుదలకానుంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వీవీ వినాయక్, డైరెక్టర్‌ నందినీ రెడ్డి ‘గల్లీ రౌడీ’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ని విడుదల చేశారు. వీవీ వినాయక్‌ మాట్లాడుతూ– ‘‘సందీప్‌ కిషన్‌ నాకు మేనల్లుడితో సమానం. తెలుగు వాళ్లు గర్వంగా చెప్పుకునే నటుడు రాజేంద్రప్రసాద్‌. ‘గల్లీ రౌడీ’ హిట్‌ అయ్యి కోన, ఎంవీవీలకు బాగా డబ్బులు రావాలి’’ అన్నారు.

‘‘కరోనా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే నాగేశ్వర రెడ్డిగారి సినిమాలు చూడాలి’’ అని నందినీ రెడ్డి అన్నారు. కోన వెంకట్‌ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ఇంత త్వరగా పూర్తయిందంటే కారణం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిగారు. ఏపీలో షూటింగ్‌లకు సింగిల్‌ విండో విధానం తీసుకొచ్చారాయన. ఈ విధానంలో పూర్తయిన తొలి చిత్రం మాదే. ఇందుకు జగన్‌గారికి, ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ విజయ్‌ చందర్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘నేను నటించిన ‘లేడీస్‌ టైలర్‌’కు ఎంత మంచి అభినందన వచ్చిందో ‘గల్లీ రౌడీ’కి కూడా మంచి అభినందన వస్తుంది’’ అన్నారు నటుడు డా. రాజేంద్ర ప్రసాద్‌.

ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘నేను, కోన వెంకట్‌ చేసిన ‘గీతాంజలి’ కంటే ‘గల్లీ రౌడీ’ పెద్ద హిట్‌ అవుతుంది. ఈ సినిమా హిట్‌ కాకపోతే నా జడ్జ్‌మెంట్‌లో రాంగ్‌ ఉన్నట్లే. ఆ తర్వాత నేను సినిమాలు చేయలేనేమో? అనేంత నమ్మకంతో సినిమా సక్సెస్‌ అవుతుందని చెబుతున్నాను’’ అన్నారు. ‘‘నేను కథ వినేటప్పుడు ప్రేక్షకుడి కోణంలో వింటాను. అందరి సహకారం వల్లే మా సినిమాను 60 రోజుల్లో పూర్తి చేశాం’’ అన్నారు జి. నాగేశ్వర రెడ్డి. ‘‘అందరూ నవ్వుకునే సినిమా ‘గల్లీ రౌడీ’’ అన్నారు సందీప్‌ కిషన్‌. ఈ కార్యక్రమంలో నేహా శెట్టి, ఎడిటర్‌ ఛోటా కె.ప్రసాద్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాయి కార్తీక్, సినిమాటోగ్రాఫర్‌ సుజాత సిద్ధార్థ్, రచయితలు భాను, నందు తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement