Itlu Maredumilli Prajaneekam Telugu Movie Review And Rating | Allari Naresh | Anandi - Sakshi
Sakshi News home page

Itlu Maredumilli Prajaneekam Movie Review: ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ రివ్యూ

Published Fri, Nov 25 2022 12:25 PM | Last Updated on Fri, Nov 25 2022 1:45 PM

Itlu Maredumilli Prajaneekam Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
నటీనటులు:  ‘అల్లరి’ నరేశ్‌, ఆనంది, వెన్నెల కిశోర్‌, రఘు బాబు, శ్రీతేజ్‌, ప్రవీణ్‌, సంపత్‌ రాజ్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: హాస్య మూవీస్‌
నిర్మాత: రాజేశ్‌ దండు
సమర్పణ: జీ స్టూడియోస్‌
దర్శకుడు: ఏఆర్‌ మోహన్‌
సంగీతం: సాయి చరణ్‌ పాకాల
సినిమాటోగ్రఫీ:  చోటా కె. ప్రసాద్‌
ఎడిటర్‌: రామ్‌ రెడ్డి
విడుదల తేది: నవంబర్‌ 25, 2022

Itlu Maredumilli Prajaneekam Telugu Movie Review

కథేంటంటే..
శ్రీపాద శ్రీనివాస్‌(అల్లరి నరేశ్‌) ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఎలక్షన్ల డ్యూటీపై రంప చోడవరం సమీపంలోని మారెడుమిల్లి తండాకు వెళ్తాడు. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా అభివృద్దికి నోచుకొని తండా అది. అక్కడ చదువుకోవడానికి బడి లేదు. అనారోగ్యం పాలైతే చూపించుకోవడానికి ఆస్పత్రి లేదు. పట్టణం వెళ్లడానికి సరైన దారి లేదు. పాఠశాల, ఆస్పత్రితో పాటు నదిపై వంతెన కట్టించాలని 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదు. అందుకే వాళ్లు ఓటేయడానికి నిరాకరిస్తారు. కానీ శ్రీనివాస్‌ చేసిన ఓ పనికి మెచ్చి అతని కోసం ఓట్లు వేస్తారు. వందశాతం పోలింగ్‌ జరుగుతుంది. అయితే బ్యాలెట్‌ బాక్సులతో వెళ్తున్న అధికారులను మార్గమధ్యలో మారెడుమిల్లి తండాకు చెందిన కండా(శ్రీతేజ) బ్యాచ్‌ కిడ్నాప్‌ చేస్తుంది. అసలు ప్రభుత్వ అధికారులను కండా ఎందుకు కిడ్నాప్‌ చేశాడు? అధికారులను విడిపించడానికి కలెక్టర్‌(సంపత్‌ రాజ్‌) ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు?  ఎన్నికలు నిర్వహించడంలో శ్రీనివాస్‌కు తండాకు చెందిన యువతి లక్ష్మి(ఆనంది) ఎలాంటి సహాయం చేసింది? తండా వాసుల కష్టాలు తీర్చడంలో నరేశ్‌ ఏ మేరకు సక్సెస్‌ సాధించాడు? అనేదే మిగతా కథ. 

Itlu Maredumilli Prajaneekam Movie Stills

ఎలా ఉందంటే.. 
పట‍్టణాలకు దూరంగా నివసించే తండా వాసుల కష్టాల గురించి మనం నిత్యం వార్తల్లో చూస్తుంటాం. వాళ్లకు సరైన సదుపాయాలు ఉండవు. కనీస అవసరాలైన విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు కూడా ఉండవు.  తమ సమస్యలను తీరుస్తేనే ఓటు వేస్తామంటూ ధర్నాలు చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అలాంటి సంఘటలనే కథాంశంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు ఏఆర్‌ మోహన్‌. తమ సమస్యలు పరిష్కరించమని ఓ ఊరి ప్రజలంతా ప్రభుత్వానికి ఎదురు తిరిగితే అదే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా.  

విద్య, వైద్యం, రవాణా సదుపాలను కల్పించాలని ఏళ్లుగా విజ్ఞప్తి చేసిన పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు అధికారులను నిర్భంధిస్తే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. డైరెక్టర్‌ ఎంచుకున్న పాయింట్‌ రొటీనే అయినా.. అందరికి కనెక్ట్‌ అయ్యేలా చేయడంలో సఫలం అయ్యాడు. సినిమాలో కొత్తగా చెప్పిన విషయమేమి ఉండదు కానీ.. అందరిని ఆలోచింపజేస్తుంది. కంప్యూటర్‌ యుగంలోనూ.. కనీస సదుపాయాలు లేకుండా ఇబ్బంది పడేవారున్నారని ఈ సినిమా మరోసారి గుర్తు చేస్తుంది.

Allari Naresh Photos In Itlu Maredumilli Prajaneekam

అయితే కథనం మాత్రం ఊహకందేలా సాగడం కాస్త మైనస్‌. ఎలాంటి సాగదీత లేకుండా సినిమా ప్రారంభం నుంచే అసలు కథ మొదలవుతుంది. ఫస్టాఫ్‌ మొత్తం ఎన్నికల చుట్టే కథ సాగుతుంది. తండావాసులు ఓటు హక్కు వినియోగించుకునేలా చేయానికి శ్రినివాస్‌ చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో వారి సమస్యలు తెలుసుకొని చలించిపోవడం.. ఇలా ఫస్టాఫ్‌ రొటీన్‌గా సాగుతుంది. వెన్నెల కిశోర్‌, ప్రవీణ్‌ల కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌ మొత్తం తండావాసుల దగ్గర బంధీలుగా ఉన్న అధికారులను విడిపించేందుకు జిల్లా కలెక్టర్‌ చేసే​ ప్రయత్నం చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్స్‌ సినిమాటిక్‌గా అనిపిస్తుంది.

Itlu Maredumilli Prajaneekam Cast And Crew

అయితే కథనం రోటీన్‌గా సాగినా.. అబ్బూరి రవి రాసిన డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. 'తప్పు చేసి శిక్ష పడినా పర్వాలేదు... సాయం చేసి బాధ పడకూడదు', మనందరం గొప్పవాళ్ళం అయిపోవాలని అనుకుంటున్నాం... కానీ ఎవరూ మనిషి కావడం లేదు' లాంటి అద్భుతమైన సంభాషణలు సినిమాలో చాలానే ఉన్నాయి. ఈ సినిమా కమర్షియల్‌గా ఏ మేరకు ఆడుతుందో తెలియదు కానీ.. నరేశ్‌ చేసిన మరో మంచి అటెంప్ట్‌గా మాత్రం నిలుస్తుంది.

Allari Naresh And Anandi Latest Photos 

ఎవరెలా చేశారంటే.. 
కామెడీనే కాదు సీరియస్‌ పాత్రల్లో కూడా అద్భుతంగా నటించే నటుల్లో నరేశ్‌ ఒకరు. ఒకవైపు కామెడీ సినిమాలు చేస్తూనే.. సీరియస్‌ పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ చిత్రంలో నరేశ్‌ది పూర్తి సిరియస్‌ రోల్‌. తెలుగు భాషా ఉపాధ్యాయుడు శ్రీపాద శ్రీనివాస్‌ పాత్రలో ఒదిగిపోయాడు. అయితే ఇలాంటి పాత్ర కొత్తేమి కాదు. ప్రవీణ్, వెన్నెల కిషోర్, రఘుబాబుల కామెడీ బాగా పండింది.  తండా వాసి కండాగా శ్రీతేజ్‌, ఊరి పెద్దమనిషి ‘పెద్ద’ కుమనన్ సేతురామన్‌లతో పాటు మిగిలిన నటీనటుల తమ పాత్రల పరిధిమేర నటించారు.  శ్రీ చరణ్ పాకాల అందించిన సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచాడు. పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. చోటా కె. ప్రసాద్‌ కెమెరా పనితీరు బాగుంది. అడవి అందాలను అద్భుతంగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 
-అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement