పశ్చిమంలో సుజనా ప్రైవేట్‌ సైన్యం | - | Sakshi
Sakshi News home page

పశ్చిమంలో సుజనా ప్రైవేట్‌ సైన్యం

Published Thu, May 9 2024 8:20 AM | Last Updated on Thu, May 9 2024 1:07 PM

-

విజయవాడలో తిష్ట వేసినసుజనా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు

ఓట్ల కొనుగోలు ప్రయత్నాల్లో 200 మంది సిబ్బంది 

నగరంలోని హోటళ్లు, పాతబస్తీలోని పలు చోట్ల మకాం 

గెలవలేమని తెలిసి పెద్ద ఎత్తున ఓట్ల కొనుగోలుకు ప్రణాళికలు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీచేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనాచౌదరి ఎన్నికల్లో గెలుపు కోసం డబ్బు పంపిణీకి తెరతీశారు. ఇందు కోసం తన ప్రైవేట్‌ సైన్యాన్ని విజయవాడ నగరంలో మోహరించారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని గుర్తించిన ఆయన ఏదో విధంగా గెలవాలని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా సుజనాచౌదరితో పాటుగా తెలుగుదేశం నాయకులు భారీ ప్రణాళిక రూపొందించారు. నియోజకవర్గంలో సుజనాకు మద్దతు లేని ప్రాంతాల్లో తన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను మోహరించారు. కొత్త వ్యక్తులు నియోజకవర్గంలో డబ్బుల కట్టల పట్టుకొని తిరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

డివిజన్లవారీగా బాధ్యతలు
నియోజకవర్గంలో ఓట్లను కొనుగోలు చేయడానికి తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు 200 మందిని సుజనాచౌదరి నగరంలో దింపారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. డివిజన్‌కు పది మంది వరకూ తమ ఉద్యోగుల ద్వారా నగదు పంపిణీ చేయాలని ఆయన భావిస్తున్నారని సమాచారం. అందుకు అనుగుణంగా ఉద్యోగులకు ఆయా డివిజన్ల బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ ఓట్లను కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ఆ వర్గాలు అధికంగా ఉన్న డివిజన్లను ఎంపిక చేససుకొని వాటిపై దృష్టిని పెడుతున్నారు. ఇప్పటికే కొంత మంది నాయకులను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని సీనియర్‌ నాయకులు పేర్కొంటున్నారు. ఇంత అడ్డగోలుగా నాయకులు అమ్ముడుపోవటం ఇప్పుడే చూస్తున్నామని వారు ఆవేదన వ్యక్తంచేశారు.

హోటళ్లు ఫుల్‌
నగరంలోని పలు ప్రాంతాల్లో సుజనా సైన్యం బస చేస్తోంది. నిడమానురులోని సుజనా సొంత నివాసంలో కొద్దిమంది షెల్టర్‌ తీసుకోగా అధిక శాతం మంది వన్‌టౌన్‌, గొల్లపూడి, బెంజిసర్కిల్‌ తదితర ప్రాంతాల్లోని హోటళ్లలో తిష్టవేశారు. ఒక సామాజికవర్గానికి చెందిన దుకాణాలు, హోటళ్ల ద్వారా వారు నగదును బయటకు తరలిస్తున్నారని సమా చారం. ఎంత మొత్తం వెచ్చించైనా ఓట్లు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా మైనార్టీ, దళిత వర్గాలు నివసించే ప్రాంతాల్లో ఆయా స్థానిక నాయకుల నుంచి ఓటరు లిస్టులను దగ్గర ఉంచుకొని కొనుగోలు చేయాల్సిన ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఆ దిశగా పావులు కదుపుతున్నారు.

సుజనాచౌదరిని తరిమికొడతాం 
తమ ఓట్లను కొనుగోలు చేస్తామంటూ తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూసే సుజనాచౌదరిని తరిమికొడతామని దళిత, మైనార్టీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. సుజనాచౌదరి నగరానికి వచ్చినప్పటి నుంచి దళితులు, మైనార్టీల ఓట్లు కొంటామని మాట్లాడుతున్నా రని వారు చెబుతున్నారు. తమ ఓట్లు కొనుగోలు చేసి తద్వారా గెలుస్తానని పదేపదే మాట్లాడటం తమను దిగజార్చటమేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. సుజనాచౌదరి వంటి నేతలకు ఓటు ద్వారా తమ సత్తా చూపుతామని వారు హెచ్చరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement