Dubai Floods: దుబాయ్‌లో వర్ష బీభత్సం.. అంతటా అల్లకల్లోలం! | Dubai Floods: A Years Worth Of Rain Plunges Normally Dry Dubai Underwater, Watch Videos Inside - Sakshi
Sakshi News home page

Dubai Heavy Rainfall Floods: దుబాయ్‌లో వర్ష బీభత్సం.. అంతటా అల్లకల్లోలం!

Published Wed, Apr 17 2024 2:12 PM | Last Updated on Wed, Apr 17 2024 3:47 PM

A years worth of rain plunges normally dry Dubai underwater - Sakshi

వర్ష బీభత్సానికి ఎడారి దేశం దుబాయ్‌ విలవిలలాడిపోతోంది. కేవలం గంటన్నర వ్యవధిలో అంటే 90 నిమిషాల్లో.. ఏడాదిలో కురవాల్సిన వర్షమంతా ఒకేసారి కురిసింది.  
 

భారీ వర్షానికి తోడు వేగంగా వీచిన ఈదురు గాలులకు చెట్లు నేల కూలాయి. కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. మాల్స్  అన్నీ నీటితో నిండిపోయాయి. 

దుబాయ్ ఎయిర్ పోర్టులోనూ వర్ష బీభత్సం ప్రత్యక్షంగా కనిపించింది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బయటి రోడ్లను చూస్తే అవి చెరువులను తలపించాయి. 

రైల్వే వ్యవస్థ చాలావరకూ దెబ్బతింది. సబ్ వేలన్నీ నీట మునిగాయి. రోడ్లపై నిలిపివుంచిన కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. 

దుబాయ్ తీరాన్ని తాకిన తుఫాను కారణంగా ఈ ప్రకృతి విలయం సంభవించింది. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలతో యూఏఈ అంతటా జన జీవనం స్తంభించింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.  ప్రైవేట్ ఉద్యోగులకు ఆయా సంస్థలు వర్క్ ఫ్రం హోం వెసులుబాటును కల్పించాయి.  

ఫుజైరా ఎమిరేట్స్‌లో దుబాయ్‌కి మించిన వర్షపాతం నమోదయ్యింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన మాల్‌ ఆఫ్ ఎమిరేట్స్ లోపలికి నీరు ప్రవేశించింది. నీటి ఒత్తిడికి మాల్‌ పైకప్పు భాగాలు ఊడి కింద పడ్డాయి. గత 75  ఏళ్లలో ఎప్పుడూ  ఇంతటి భారీ వర్షాలు కురియలేదని అధికారులు తెలిపారు. 

రోడ్లపై భారీగా నిలిచిన నీటిని అధికారులు ట్రక్కుల్లో నింపి క్లియర్ చేస్తున్నారు. మరోవైపు  దేశవ్యాప్తంగా రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురియవచ్చని పేర్కొంటూ జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని హెచ్చరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement