రష్యా తో ‘లైఫ్‌ లైన్స్‌’కు ముప్పు! | Russia could threaten internet cables in underwater attacks | Sakshi
Sakshi News home page

రష్యా తో ‘లైఫ్‌ లైన్స్‌’కు ముప్పు!

Published Fri, Jan 14 2022 5:19 AM | Last Updated on Fri, Jan 14 2022 5:25 AM

Russia could threaten internet cables in underwater attacks - Sakshi

ఆధునిక సాంకేతికత మన జీవితాలను ఆక్రమించేసింది. ఇంటర్నెట్‌ లేనిది క్షణమైనా గడవని పరిస్థితి. కొద్ది గంటలు ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇంటర్నెట్‌ సేవలు లేదా సామాజిక మాధ్యమ యాప్‌లు నిలిచిపోతే అదో పెద్ద వార్త అవుతోంది. అలాంటిది ఇంటర్నెట్‌కు జీవనాడులుగా పరిగణించే సముద్రగర్భంలోని ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ను ఎవరైనా కత్తిరించేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ప్రపంచం స్తంభించిపోతుంది.

అండర్‌ వాటర్‌ క్యాప్సుల్‌ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (ఫైల్‌) వివిధ ఖండాలను కలుపుతున్న ఆప్టికల్‌

ఇంటర్నెట్, రక్షణ వ్యవస్థలు, వైద్య ఆరోగ్య సేవలు, విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలు, ఆర్థిక కార్యకలాపాలు, క్యాబ్‌ సర్వీసులు, ఫుడ్‌ డెలివరీలు... ఇలా ఒకటేమిటి ప్రతిదీ నిలిచిపోతుంది. ప్రపంచం అతలాకుతలమవుతంది. ఇప్పుడదే ముప్పు రష్యా నుంచి పొంచి వుందని అమెరికా, బ్రిటన్‌తో సహా ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి.  అణ్వాయుధ పోటీ గతించిన ముచ్చట. శత్రుదేశాలను దెబ్బతీయడానికి, ప్రపంచ దేశాలను భయపెట్టడానికి రష్యా, చైనాలు ఇప్పటికే సైబర్‌ దాడులను సమర్థమంతమైన ఆయుధంగా వాడుతున్నాయి.

ఇతర దేశాల్లోని కీలక వ్యవస్థలపై దాడులు కొనసాగిస్తూ, వాటిని కుప్పకూల్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. హ్యాకింగ్, డేటా చౌర్యం జరుగుతోంది. అందుకే ప్రపంచదేశాలన్నీ ‘సైబర్‌ సెక్యూరిటీ’ని అతిపెద్ద సవాల్‌గా స్వీకరించాయి. ఈ తరుణంలోనే రష్యా గత ఐదారేళ్లుగా కొత్త యుద్ధ తంత్రానికి తెరలేపింది. సముద్రగర్భంలోని ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ను లక్ష్యంగా చేసుకుంటూ... ఏ క్షణమైనా వాటిని తుంచేసే విధంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.

వీటిలో నుంచి ప్రసారమయ్యే సమాచారాన్ని తస్కరించే సాంకేతికతలనూ అభివృద్ధి చేస్తోంది. భారీగా పెట్టుబడులు పెడుతోంది. కొత్తగా నియమితులైన బ్రిటన్‌ చీఫ్‌ ఆప్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అడ్మిరల్‌  టోనీ రాడకిన్‌ ఈ జీవనాడులకు రష్యా నుంచే ప్రధాన ముప్పు పొంచి వుందని గతవారం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సముద్రగర్భంలోని ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ను పరిరక్షించుకోవడానికి.. ప్రత్యేక నిఘా నౌకను 2024 కల్లా జలప్రవేశం చేయిస్తామని బ్రిటన్‌కు చెందిన రాయల్‌ నేవీ ఇటీవల ప్రకటించింది. ఇది అణ్వాయుధ యుద్ధంతో సమానమైన ముప్పని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా లక్ష మంది సైన్యాన్ని మోహరించడంతో రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తే తీవ్ర పర్యవసానాలు చవిచూడాల్సి వస్తుందని అమెరికా, నాటో దేశాలు రష్యాను పలుమార్లు హెచ్చరించాయి. దీంతో రష్యా అభివృద్ధి చేస్తున్న సముద్రగర్భ సాంకేతికతలు, సమకూర్చుకుంటున్న సాధానాలపై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. రష్యా ఇలాంటి తీవ్ర చర్యలకు దిగే అవకాశాలు తక్కువే అయినా... అమెరికా, నాటో దేశాలతో ఘర్షణ ముదిరితే... రష్యా దీన్నో ఆయుధంగా వాడే ప్రమాదం ఉందనేది నిపుణుల అభిప్రాయం. రష్యా ఏయే మార్గాల్లో ప్రపంచానికి జీవనాడులైన ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ను దెబ్బతీయగలదో చూద్దాం..


436: వివిధ సముద్రాల మీదుగా పలు ఖండాలను, ప్రపంచ దేశాలను కలుపుతూ కడలి గర్భంలో మొత్తం 436 ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ లైన్స్‌ ఉన్నాయి. వీటి మొత్తం పొడవు.. 12,87,475 కిలోమీటర్లు. ఇవే నేటి మన ప్రపంచపు జీవనాడులు (లైఫ్‌ లైన్స్‌). నిరంతరాయ ఇంటర్నెట్‌ సేవలకు మూలాధారం. వీటిలో అన్నింటికంటే పొడవైనది అమెరికా– ఆసియా ఖండాలను కలిపేది. ఈ కేబుల్‌లైన్‌ పొడవు 20,004 కిలోమీటర్లు.  

97%: అంతర్జాతీయంగా నిత్యం జరిగే కమ్యూనికేషన్స్‌లో 97 శాతం ఈ కేబుల్స్‌ ద్వారానే జరుగుతుంది. శాటిలైట్స్‌ మన కమ్యూనికేషన్స్‌ అవసరాల్లో మూడు శాతం మాత్రమే తీరుస్తున్నాయి.

10 లక్షల కోట్ల డాలర్లు: సముద్రపు అడుగుభాగంలోని 436 కేబుల్‌ లైన్స్‌ ద్వారా ప్రతిరోజూ 10 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. ప్రపంచం ఆర్థిక రంగానికి ఇదే లైఫ్‌లైన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement