పనామా ట్రాఫిక్‌జామ్‌! | Panama Canal: Drought at the Panama Canal disrupts global trade | Sakshi
Sakshi News home page

పనామా ట్రాఫిక్‌జామ్‌!

Published Mon, Aug 28 2023 5:11 AM | Last Updated on Tue, Aug 29 2023 4:52 PM

Panama Canal: Drought at the Panama Canal disrupts global trade - Sakshi

అంతర్జాతీయ వర్తకానికి అతి కీలకమైన పనామా కాలువ నానాటికీ చిక్కిపోతోంది. దాంతో భారీ సరుకు రవాణా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొద్ది రోజులుగా ఎప్పుడు చూసినా వందలాది నౌకలు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాంతో పనామాకు ప్రత్యామ్నాయంగా మరో కాలువ ఉండాలన్న వాదన మళ్లీ తెరమీదకొచి్చంది.
 
పసిఫిక్, అట్లాంటిక్‌ మహా సముద్రాలను కలి­పే కీలకమైన పనామా కాలువలో నీటి పరిమాణం కొన్నాళ్లుగా బాగా తగ్గుతోంది. దాంతో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయి భారీ నౌకల ప్రయాణానికి ప్రతిబంధకంగా మారింది. ఓ మోస్తరు నౌకలు ఆచితూచి, అతి నెమ్మదిగా కదలాల్సి వస్తోంది. దీంతో విపరీత జాప్యం జరుగుతోంది. ఫలితంగా భారీ నౌకలు కాలువను దాటి అటు అట్లాంటిక్, ఇటు పసి­ఫిక్‌ వైపు వెళ్లడానికి రోజుల తరబడి వేచి చూ­డాల్సి వస్తోంది. ప్రస్తుతం కనీసం 250కిపైగా భారీ నౌ­క­లు తమవంతు ఎప్పుడొస్తుందా అని ఎదురు­చూ­­స్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

కారణమేమిటి?
పనామా కాలువకు ప్రధానంగా నీటిని సరఫరా చేసే రెండు రిజర్వాయర్లు కొద్ది్ద కాలంగా నీటి ఎద్దడితో అల్లాడుతున్నాయి. వాటి పరీవాహక ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర వర్షాభావమే అందుకు అసలు కారణం.

మళ్లీ తెరపైకి ’ఆ కాలువ’
పనామా కాలువ పరిమితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ కాలువ ఉండాలన్న ప్రతిపాదన మళ్లీ తెర మీదికి వస్తోంది. ఇది కొత్తదేమీ కాదు. 1900 తొలి నాళ్లలో అమెరికా ముందు రెండు ప్రతిపాదనలు ఉండేవి. ఒకటి పనామా కాగా మరోటి నికరాగ్వా గుండా కాలువ నిర్మాణం. పనామాకే అమెరికా సెనే­ట్‌ ఓటు వేయడంతో నికరాగ్వా గుండా నిర్మాణం అనేది ప్రతిపాదనలకే పరిమితమైంది. ఆ మార్గంలో చురుకైన అగ్ని పర్వతాలు ఉండటం సైతం ఆ ప్రాజెక్టు ఆదిలోనే ఆగడానికి ప్రధాన కారణం. అదీకాక నికరాగ్వా మార్గంతో పోలిస్తే తక్కువ దూరం ఉండటమూ పనామాకు కలిసొచి్చన అంశాల్లో ఒకటి. దీంతో ఆనాడు కనుమరుగైన ఆ ప్రతిపాదన తాజాగా ఇప్పుడు కొత్త రెక్కలు కట్టుకుని
ముందుకు వాలింది.
► ఎలాగైనా దాని నిర్మాణం పూర్తి చేస్తానని చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు ముందుకొచ్చారు.
► 2013 ఏడాదిలో హెచ్‌కేఎన్‌డీ అనే చైనా కంపెనీ నికరాగ్వా కాలువ నిర్మాణానికి సిద్ధపడింది కూడా. నికరాగ్వా దేశ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 50 ఏళ్ల పాటు దాని నిర్వహణ అధికారాలు  సంపాదించింది. కానీ ఇదీ కాగితాలకే పరిమితం అయింది.


అంత ఈజీ కాదు...
నికరాగ్వా గుండా కాలువ నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఎందుకంటే...
► పశి్చమాన పసిఫిక్, తూర్పున అట్లాంటిక్‌ను కలుపుతూ రెండు కాలువలు తవ్వాలి. ఈ కాలువల మధ్యలోనే నికరాగ్వా సరస్సు ఉంటుంది.
► అట్లాంటిక్‌ వైపు 25 కిలోమీటర్లు, పసిఫిక్‌ వైపు 100 కిలోమీటర్ల పొడవునా ఈ కాలువలను తవ్వాల్సి ఉంటుంది.
► దీని నిర్మాణానికి కనీసం 40 బిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా.
► ఇంత భారీ వ్యయంతో కాలువ నిర్మాణం చేపట్టాలంటే దాని ద్వారా అంతకు మించి ఆదాయం ఉంటుందన్న భరోసా కావాలి.
► ఇంత భారీ కాలువ నిర్మాణమంటే పర్యావరణపరంగా ఎంతో పెద్ద సవాలే.
► నిర్మాణం కారణంగా సతతహరిత అరణ్యాలు తుడిచి పెట్టుకుపోతాయని పర్యావరణవేత్తలు ఆందోళనలు చేశారు.

ఇదీ పనామా కథ
► మధ్య అమెరికాలో ఉన్న బుల్లి దేశం పనామా.
► అక్కడ నిర్మించిన కృత్రిమ కాలువే పనామా కాలువ.
► ఇది ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలను కలుపుతుంది.
► దీని పొడవు 80 కిలోమీటర్లు.
► పనామా కాలువ మధ్యలో గతూన్‌ అనే కృత్రిమ సరస్సు ఉంటుంది. అలజేలా అనే మరో కృత్రిమ సర­స్సు ఈ కాలువకు రిజర్వాయర్‌గా ఉంది.
► ఇటు పసిఫిక్‌ మహా సముద్రం, అటు అట్లాంటిక్‌ మహా సముద్రం వైపు కరేబియన్‌ సముద్రాన్ని విడదీసే ఇస్తుమస్‌ ఆఫ్‌ పనామను ఆను­కుని పనామా కాలువ ఉంటుంది.
► పనామా కాలువ గుండా ఏటా 270 బిలియన్‌ డాలర్ల విలువైన సరుకు రవాణా జరుగుతోంది.
► పనామా గుండా 170 దేశాలకు సరుకులు వెళ్తాయి.


ఏం జరగనుంది?
► సరుకు నౌకలు దీర్ఘ కాలం పాటు ఇలా వేచి ఉండటం కారణంగా రవాణా వ్యయం విపరీతంగా పెరుగుతుంది.
► దాంతో ధ్రవీకృత సహజ వాయువు తదితర ఇంధనాల ధరలకు అమాంతం రెక్కలొస్తాయి.
► ఇది అంతిమంగా చాలా దేశాల్లో, అంటే అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది.
► చివరకు ద్రవ్యోల్బణం పెరిగి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అల్లాడే పరిస్థితి రావచ్చు.


‘పనామాలో ఇప్పుడున్నది కనీవినీ ఎరగని అసాధారణ పరిస్థితి. చాలా ఆందోళనకరం కూడా’
– మిషెల్‌ వైస్‌ బోక్‌మ్యాన్, లాయిడ్స్‌ లిస్ట్‌ ఇంటెలిజెన్స్‌లో సీనియర్‌ విశ్లేషకుడు

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌
పనామా కాలువ ప్రవేశ మలుపు వద్ద తమ వంతు కోసం వేచి చూస్తున్న వందలాది ఓడలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement