ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్.. భయానక పోరుకు ఇజ్రాయెల్ సిద్ధం Next stage Coming Israeli PM Netanyahu Tells Soldiers Outside Gaza | Sakshi
Sakshi News home page

ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్.. భయానక పోరుకు ఇజ్రాయెల్ సిద్ధం

Published Sun, Oct 15 2023 9:57 AM | Last Updated on Sun, Oct 15 2023 11:12 AM

Next stage Coming Israeli PM Netanyahu Tells Soldiers Outside Gaza - Sakshi

జెరూసలేం: హమాస్‌ పాశవిక దాడిపై ఇజ్రాయెలీలు మండిపడుతున్నారు. చీకటిమాటున తీసిన దొంగ దెబ్బపై కనీవినీ ఎరగని రీతిలో ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నినదిస్తున్నారు. హమాస్‌ను సర్వనాశనం చేసి గానీ విశ్రమించేది లేదని ఆయన ఇప్పటికే స్పష్టం చేసిన నెతన్యాహు.. యుద్ధంలో మరోస్థాయికి సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ మేరకు గాజాపై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ ఇజ్రాయెల్ దళాలను  ప్రధాని బెంజమన్ నెతన్యాహు  కలిశారు.

తొమ్మిదో రోజు యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సైనికులను సందర్శించి వారిలో మనోధైర్యాన్ని పెంచారు. యుద్ధంలో మరో స్థాయికి వెళ్లనున్నామని తెలిపిన నెతన్యాహు..  ఇందుకు సిద్ధమేనా అంటూ సైనికులను అడిగారు. అందుకు వారు సిద్ధమని చెబుతూ తలలు ఊపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్(ఎక్స్) వేదికగా పంచుకున్నారు. యుద్ధంలో అసలైన ఘట్టం వచ్చేసిందని ప్రధాని నెతన్యాహు అన్నారు. 

హమాస్  'ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ బ్యాటిల్'కు ప్రతీకారంగా ఇజ్రాయెల్ 'ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్' గురించి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని సైనికులతో కరచాలనం చేశారు. యుద్ధంలో మరోస్థాయికి వెళుతున్నామని సైనికులకు తెలిపిన వీడియో  బయటకు వచ్చింది. గాజాను ఖాలీ చేయాలని పౌరులను హెచ్చరించిన ఇజ్రాయెల్‌.. యుద్ధాన్ని తదుపరి మరింత ఉద్ధృతం చేయనున్నట్లు స్పష్టమవుతోంది. అటు.. గాజాను వీడకూడదంటూ హమాస్ దళాలు పిలుపునిచ్చాయి. ఈ హోరాహోరి పోరు రానున్న రోజుల్లో యుద్ధం మరింత భీకర స్థాయికి చేరనున్నట్లు తెలుస్తోంది. 

భూతల దాడి..
ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్‌ను దాని నాయకత్వాన్ని నిర్మూలించడానికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం భూతల, వాయు, జల అన్ని మార్గాల్లో దాడులు చేయడానికి దళాలను సమన్వయం ఏర్పరిచింది. ఆకస్మిక దాడులతో విరుచుకుపడిన హమాస్‌ను నిర్మూలించడానికి భూతల దాడులను జరపనున్నట్లు తెలుస్తోంది. గాజాను రాజకీయంగా, సైనికంగా హమాస్ పాలించడానికి వీలు ఉండకూడదని ఇజ్రాయెల్ రక్షణ దళాల(ఐడీఎఫ్) ప్రతినిధి డానిల్ హాగరీ అన్నారు. 

ఇస్మాయిల్ హనియే తర్వాత రెండవ స్థానంలో ఉన్న హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్‌ను నిర్మూలించడం గ్రౌండ్ అటాక్  ముఖ్య లక్ష్యం. బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను ఈ దాడుల ద్వారా కాపాడుకోవచ్చని భావిస్తున్నారు. గత శనివారం ఇజ్రాయెల్‌లపై జరిగిన అకృత్యాలకు సిన్వార్ బాధ్యత వహించాడని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దీనికి గ్రౌండ్ అటాక్ మాత్రమే సరైనదని భావిస్తున్నారు. ఈ వారాంతంలో ఈ దాడి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాజా సరిహద్దులో 30,000 ఇజ్రాయెల్ సైనికులు వేచి ఉన్నారు. 10,000 మంది సైనికులు గాజాలోకి అడుగుపెట్టారు. ఈ దాడులకు కావాల్సిన యుద్ధ సామగ్రిని, యుద్ధం ట్యాంకులను సరిహద్దుకు చేర్చారు.  

అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేయడంతో యుద్ధం ఆరంభం అయింది. హమాస్ దాడులకు ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో బదులిస్తోంది. భూతల, వాయు మార్గాల్లో వైమానిక దాడులతో గాజాపై విరుచుకుపడుతోంది. తొమ్మిది రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఇరుపక్షాల వైపు 3200 మంది మరణించారు. ఇజ్రాయెల్‌లో 1300 మంది ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనాలో 1900 మంది మృత్యువాతపడ్డారు.

ఇదీ చదవండి: అల్‌ఖైదా కంటే ప్రమాదకరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement