ఆదిమ ఖండంలో... నియంత పాలనలు Military coups on the African continent | Sakshi
Sakshi News home page

ఆదిమ ఖండంలో... నియంత పాలనలు

Published Mon, Sep 4 2023 5:00 AM | Last Updated on Mon, Sep 4 2023 5:00 AM

Military coups on the African continent - Sakshi

సైనిక తిరుగుబాట్లతో ఆఫ్రికా ఖండం అతలాకుతలం అవుతోంది. కొన్నేళ్లుగా ఇక దేశం తర్వాత ఒక దేశంలో ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసి సైనిక నియంతలు అధికారం చేజిక్కించుకుంటున్నారు. బుర్కినా ఫాసో మొదలుకుని తాజాగా గబాన్‌ దాకా ఈ జాబితా నానాటికీ పెరుగుతూనే పోతోంది. ఆ సైనిక కుట్రల పట్ల ఆయ దేశాల్లో పెద్దగా వ్యతిరేకత కూడా వ్యక్తం కాకపోవడం విశేషం. పైగా యువ ఆఫ్రికన్లు ఈ పరిణామాన్ని రెండు చేతులా స్వాగతిస్తుండటం విస్మయకర వాస్తవం...

► పశ్చిమ ఆఫ్రికాలోని నైగర్‌లో సైనిక తిరుగుబాటు జరిగి నెలన్నర కూడా కాలేదు. అప్పుడే ఆదిమ ఖండంలో మరో కుట్ర. మధ్య ఆఫ్రికా దేశం గాబాన్‌లో గత ఆదివారమే ఎన్నికలు జరిగాయి. బుధవారం ఉదయమే ఫలితాలు వెలువడ్డాయి. 2009 నుంచీ దేశాన్ని పాలిస్తూ వస్తున్న అధ్యక్షుడు అలీ బొంగో ఒండింబా మరోసారి తన అధికారాన్ని నిలుపుకున్నారు. ఆయన పార్టీ ఘన విజయం సాధించినట్టు టీవీల్లో అధికారిక ప్రకటన వెలువడింది. దాంతో ఆయన అభిమానులు పండుగ చేసుకున్నారు. కానీ నిమిషాల్లోనే పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఈసారి సైనికాధికారులు టీవీ తెరపైకి వచ్చారు. బొంగోను అదుపులోకి తీసుకుని ఆయన అధికారిక నివాసంలోనే ఖైదు చేసినట్టు, పాలనా పగ్గాలు తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అలా మరో ఆఫ్రికా ఖండంలో ప్రజాస్వామ్యం మరోసారి పరిహాసానికి గురైంది. మరో దేశం సైనిక కుట్రను చవిచూసింది.

వరుస సైనిక కుట్రలు
ఆఫ్రికాలో, ముఖ్యంగా పశ్చిమ, సెంట్రల్‌ ఆఫ్రికాలో కొన్నేళ్లుగా సైనిక కుట్రలు పరిపాటిగా మారాయి.
► గత జూలై 26న నైగర్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ బజొమ్‌ను ఆయన సొంత ప్రెసిడెన్షియల్‌ బాడీ గార్డులే నిర్బంధంలోకి తీసుకున్నారు.

► 2022 జనవరిలో బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్‌ మార్క్‌ క్రిస్టియన్‌ కబోరేనుఆ దేశ సైన్యాధ్యక్షుడే బందీని చేసి అధికారం చేజిక్కించుకున్నాడు. అయితే 8 నెలల్లోనే కింది స్థాయి సైనికాధికారులు అతన్ని కూడా జైలుపాలు చేసి అధికారాన్ని పంచుకున్నారు!

► 2012 సెపె్టంబర్‌లో గినియాలో అధ్యక్షుడు ఆల్ఫా కొండేను ప్రత్యేక సైనిక బృందాలు ఖైదు చేసి పాలనా పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్నాయి.

► 2021 మేలో మాలిలో కల్నల్‌ అసిమి గొయిటా కూడా సైనిక కుట్రకు పాల్పడ్డాడు. అంతకుముందు కూడా ఇలా ప్రభుత్వాన్ని పడదోసిన చరిత్ర అతనిది.

► 2021 ఏప్రిల్లో చాద్‌ రిపబ్లిక్‌లో కూడా అధ్యక్షుడు ఇద్రిస్‌ దెబీ ఇట్నో మృతి కారణంగా అనిశ్చితి ఏర్పడటంతో సైన్యం జోక్యం చేసుకుంది. అయితే, ఆయన కుమారుడే అధికార పగ్గాలు చేపట్టేలా చక్రం తిప్పి రంగం నుంచి తప్పుకుంది. పాలనపై తమ ఆధిపత్యాన్ని మాత్రం నిరి్నరోధంగా కొనసాగిస్తూనే ఉంది!

ఆఫ్రికాలోనే ఎందుకిలా?
కేవలం గత మూడేళ్లలో ఆఫ్రికాలో కనీసం 5 దేశాల్లో సైనిక కుట్రలు జరిగా యి. ఇందుకు పలు కారణాలు కనిపిస్థాయి కూడా...
► సంప్రదాయ పాలక వర్గపు మితిమీరిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం తదితర పోకడలతో ఆఫ్రికా యువత తీవ్రంగా విసిగిపోయింది.
► అదే సమయంలో ఇటు జనాదరణలోనూ, అటు ఆర్థికంగా కూడా ఆయా ప్రభుత్వాలు బలహీనపడుతూ వచ్చాయి. ఈ పరిస్థితిని సైనిక పెద్దలు అవకాశంగా మలచుకున్నారు  
► ప్రజల్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంత యువతలో అధికార పారీ్టల పట్ల ఉన్న ఏహ్య భావాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు.

...అందుకే ఆఫ్రికా యువతలో అసంతృప్తి!
ఆఫ్రికా యువతలో ప్రజాస్వామిక ప్రభుత్వాల పట్ల నెలకొన్న తీవ్ర అసంతృప్తికి కారణాలు లేకపోలేదు...
► ఉపాధి అవకాశాల లేమి
► పెచ్చరిల్లిన అవినీతి
► అధిక వర్గాల్లోనూ వారి మితిమీరిన ఆశ్రిత పక్షపాతం
► ఈ దేశాల్లో చాలావరకు మాజీ ఫ్రెంచి వలస రాజ్యాలే. దాంతో వాటిపై ఇప్పటికీ చాలా విషయాల్లో ఫ్రాన్స్‌ ప్రభావం కొనసాగుతోంది. ఇది కూడా యువతకు మింగుడు పడడం లేదు.
► ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవడానికి పాలక పార్టీలు చేస్తున్న అక్రమాలతో జనం మరింతగా విసిగిపోయారు.


దశాబ్దాలుగా బొంగోల రాజ్యమే!
గాబన్‌పై బొంగో కుటుంబం ఒకరకంగా అర్ధ శతాబ్దానికి పైగా గుత్తాధిపత్యం చెలాయించిందనే చెప్పాలి.
► అలీ బొంగో 14 ఏళ్లుగా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు! ఇది ఆయ నకు మూడో టర్ము. 2018లోనే స్ట్రోక్‌కు గురైనా అధికారాన్ని మాత్రం వీడలేదు.
► అయితే దేశాన్ని ఆధునీకరణ బాట పట్టించేందుకు ఆయన ప్రయత్నాలు చేయకపోలేదు. కానీ జనం ఆకాంక్షలను నెరవేర్చేందుకు అవి సరిపోలేదు.
► అలీ తండ్రి ఒమర్‌ బొంగో అయితే ఏకంగా 40 ఏళ్లకు పైగా నియంతలా దేశాన్ని పాలించారు! 2009లో ఆయన మరణానంతరం జరిగిన ఎన్నికల్లో అలీ తనను తాను విజేతగా ప్రకటించుకున్నారు. కానీ నిజానికి విపక్ష నేత ఆంద్రే ఎంబా ఒబామే నెగ్గారని చెబుతారు.


– నేషనల్‌ డెస్క్, సాక్షి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement