బొంగులో ఉప్పు.. ధరలో టాపు | Korean Bamboo Salt: This Is What Makes It Awefully Expensive | Sakshi
Sakshi News home page

బొంగులో ఉప్పు.. ధరలో టాపు

Published Sat, Apr 9 2022 4:57 AM | Last Updated on Tue, Apr 12 2022 11:35 AM

Korean Bamboo Salt: This Is What Makes It Awefully Expensive - Sakshi

కేజీ ఉప్పు రేటు ఎంతుంటుంది? మహా అయితే రూ.20 నుంచి రూ.30 మధ్య ఉంటుంది. హిమాలయన్‌ పింక్‌ సాల్ట్‌ అయితే రూ.100 నుంచి రూ.150 వరకు ఉంటుంది. అంతేకానీ కేవలం పావుకిలో ఉప్పుకు ఎక్కడైనా రూ.7,500 ఉంటుందా.. అంటే కొరియన్‌ స్టైల్‌లో తయారు చేసే ఉప్పుకు ఉంటుంది మరి. ఈ రకం ఉప్పు డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతోంది కూడా. మున్ముందు పావుకిలో రూ. 10 వేలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతలా ఏముంది ఆ ఉప్పులో అనుకుంటున్నారు కదా. అయితే దాని పుట్టుపూర్వోత్తరాలు, తయారీ, ఉపయోగాల గురించి తెలుసుకోవాల్సిందే.  

800 డిగ్రీల ఉష్ణోగ్రతలో కాల్చి..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఉప్పు పేరు బాంబూ (వెదురు) సాల్ట్‌. దీన్నే పర్పుల్‌ సాల్ట్‌ అని కూడా అంటారు. కొరియన్‌ సంప్రదాయంలో ఎక్కువగా వాడతారు. వారి వంటల్లో, ఔషధాల్లో, చికిత్స విధానాల్లో వందల ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోని మిగతా ఉప్పులతో పోలిస్తే దీనిలో ప్రత్యేకత ఏముంది? అంటే.. తయారీ విధానమే. సముద్రపు ఉప్పును వెదురు బొంగుల్లో వేసి దాన్ని సిరామిక్‌ రకం బంకమన్నుతో మూసేస్తారు.

తర్వాత ఆ బొంగును అత్యధికంగా 800 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. దీంతో బొంగులోని ఖనిజ లవణాలు, బొంగు నుంచి వచ్చే నూనే ఉప్పులో కలిసిపోతాయి. దాదాపు 14 నుంచి 15 గంటలు కాలిస్తే బొంగు మొత్తం కాలిపోయి కేవలం ఉప్పు ముద్ద మిగులుతుంది. దీన్ని మళ్లీ పొడి చేసి మళ్లీ బొంగులో నింపి కాలుస్తారు. ఇలా అనేకసార్లు బొంగును కాల్చడంతో ఉప్పు రంగు కూడా మారిపోతుంది. గట్టిగా రాయిలా తయారవుతుంది. తర్వాత ఈ ఉప్పును బయటకు తీసి పొడిలా చేసి అమ్ముతారు.  

తయారీకి 40 నుంచి 45 రోజులు
బొంగులో ఉప్పు నింపడం దగ్గర్నుంచి ఉప్పు తయారయ్యాక తీసి పొడి చేయడం వరకు అంతా మనుషులు చేస్తారు. అందుకే రేటు ఎక్కువుంటుంది. ఈ ఉప్పు వాడితే రోగనిరోధక శక్తి, ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి డిమాండ్‌ విపరీతంగా ఉంటుంది. గతంలో రెండు, మూడుసార్లు వెదురు బొంగుల్లో కాల్చి ఉప్పును తయారు చేసేవారు. అయితే 20వ శతాబ్దం నుంచి తొమ్మిదిసార్లు కాలుస్తున్నారు.

ఎక్కువసార్లు బొంగులో కాల్చడం వల్ల వెదురులోని మంచి గుణాలన్నీ ఉప్పుకు చేరతాయని, పైగా మలినాలన్నీ తొలగిపోయి అత్యంత నాణ్యమైన ఉప్పు వస్తుందని తెలుసుకున్నారు. అందుకే ప్రస్తుతం  తొమ్మిదిసార్లు 800 డిగ్రీల నుంచి 1,000 డిగ్రీల ఉష్ణోగ్రతలో బొంగులో ఉప్పును కాలుస్తున్నారు. చివరగా 9వ సారి 1,000 డిగ్రీల వేడిలో కాలుస్తున్నారు. ఈ రకం ఉప్పు తయారీకి దాదాపు 40 నుంచి 45 రోజులు పడుతుంది. 

ఎన్నెన్నో ఉపయోగాలు
వెదురు ఉప్పును వాడితే జీర్ణక్రియ బాగా జరుగుతుందని, చర్మం మెరుగవుతుందని, కడుపులో మంటను తగ్గిస్తుందని, కేన్సర్‌ రాకుండా అడ్డుకుంటుందని చెబుతున్నారు. సాధారణ ఉప్పుతో పోలిస్తే వెదురు ఉప్పులో ఇనుము, పొటాషియం, కాల్షియం ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీవక్రియ మెరుగవుతుంది.       
– సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement