Israel-Hamas War: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ | Israel-Hamas War: UN Security Council passes resolution calling for Gaza ceasefire | Sakshi
Sakshi News home page

Israel-Hamas War: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ

Published Tue, Mar 26 2024 5:19 AM | Last Updated on Tue, Mar 26 2024 5:19 AM

Israel-Hamas War: UN Security Council passes resolution calling for Gaza ceasefire - Sakshi

ఐరాస భద్రతా మండలి తీర్మానం

అనుకూలంగా ఓటేసిన రష్యా, చైనా సహా     14 దేశాలు

ఓటింగ్‌లో పాల్గొనని అమెరికా

ఐక్యరాజ్యసమితి: ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య వివాదం మొదలైన అయిదు నెలల తర్వాత సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత రంజాన్‌ మాసంలో గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని సంబంధిత వర్గాలను కోరుతూ ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. 15 సభ్యదేశాలతో కూడిన మండలిలోని 10 తాత్కాలిక సభ్యదేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రష్యా, చైనా సహా 14 దేశాలు అనుకూలంగా ఓటేశాయి.

ఎవరూ వ్యతిరేకించనప్పటికీ శాశ్వత సభ్యదేశం అమెరికా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. ‘గాజా విషయంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తీర్మానాన్ని భద్రతా మండలి ఆమోదించింది. తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బేషరతుగా బందీలందరినీ విడుదల చేయాలని కోరింది’అని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ‘ఎక్స్‌’లో తెలిపారు.

అలాగే, గాజాలో చిక్కుకున్న పాలస్తీనియన్ల వైద్య, ఇతర మానవతా అవసరాలను పరిష్కరించాలని, నిర్బంధించిన వారందరికీ అంతర్జాతీయ చట్టాల ప్రకారం కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత వర్గాలపై ఉందని తీర్మానం పేర్కొంది. ‘ఈ తీర్మానాన్ని కచి్చతంగా అమలు చేయాల్సిందే.

వైఫల్యం క్షమించరానిది’ అంటూ అని గుటెరస్‌ వ్యాఖ్యానించారు. మండలి తీర్మానంపై ఇజ్రాయెల్‌ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ఐరాస హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ డైరెక్టర్‌ ల్యూయిస్‌ పేర్కొన్నారు. పాలస్తీనా ప్రజల ఆకలిచావులను ఆపేందుకు మానవతా సాయం అందించేందుకు వీలు కల్పించాలని, చట్ట విరుద్ధ దాడులను ఆపాలని ఇజ్రాయెల్‌ను కోరారు.  
అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న నెతన్యాహు
ఐరాస తీర్మానానికి నిరసనగా ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఉన్నత స్థాయి బృందంతో తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీకి సహకారం నిలిపివేయాలని కూడా ఇజ్రాయెల్‌ నిర్ణయించింది. గతేడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులు చేయడం, ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్‌ తీవ్రస్థాయి యుద్ధంతో విరుచుకుపడుతుంటం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement