International Court of Justice: రఫాలో సైనిక చర్య ఆపండి Israel-Hamas war: ICJ orders Israel to halt its offensive on Rafah, Gaza in new ruling | Sakshi
Sakshi News home page

International Court of Justice: రఫాలో సైనిక చర్య ఆపండి

Published Sat, May 25 2024 5:36 AM | Last Updated on Sat, May 25 2024 5:36 AM

Israel-Hamas war: ICJ orders Israel to halt its offensive on Rafah, Gaza in new ruling

ఇజ్రాయెల్‌కు ఐరాస కోర్టు ఆదేశం 

బేఖాతరు చేసే అవకాశం 

ది హేగ్‌: దక్షిణ గాజాలోని రఫా నగరంలో సైనిక చర్యను తక్షణం ఆపాలని ఇజ్రాయెల్‌ను ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ శుక్రవారం ఆదేశించింది. అయితే ఇజ్రాయెల్‌ ఈ ఆదేశాలకు కట్టుబడి ఉండకపోవచ్చు. పాలస్తీనియన్లపై దాడుల విషయంలో అంతర్జాతీయంగా మద్దతు కోల్పోతున్న ఇజ్రాయెల్‌పై కోర్టు ఆదేశాలు మరింత ఒత్తిడిని పెంచుతాయి.

 గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో 10 లక్షల పైచిలుకు పాలస్తీనియన్లు రఫాకు వలస వచ్చారు. వీరిలో చాలామంది టెంట్లలో నివసిస్తున్నారు. రఫాపై ఇజ్రాయెల్‌ దృష్టి సారించడంతో మిత్రదేశం అమెరికాతో సహా పలుదేశాలు వారించాయి. ఈ వారమే మూడు యూరోప్‌ దేశాలు తాము పాలస్తీనాను స్వతంత్రదేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. 

హమాస్‌కు మిగిలిన చివరి సురక్షిత స్థావరంగా రఫా ఉందని, దానిపై దాడి చేస్తేనే వారిని తుడిచిపెట్టగలమని ఇజ్రాయెల్‌ అంటోంది. ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ (ఐసీజే) అధ్యక్షుడు నవాఫ్‌ సలామ్‌ తీర్పు వెలువరిస్తూ ‘రఫాలో సైనిక చర్యపై తాము వెలిబుచ్చిన భయాలు నిజమయ్యాయని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ తక్షణం రఫాలో సైనిక చర్య నిలిపివేయకుంటే భారీగా ప్రాణనష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

రెండు వారాల కిందట రఫాను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ హెచ్చరికలు జారీచేసింది. సైన్యాన్ని రఫా దిశగా నడిపించి కీలకమైన సరిహద్దు మార్గాన్ని తమ ఆ«దీనంలోకి తీసుకొంది. మానవతాసాయం అందడానికి రఫా క్రాసింగ్‌ అత్యంత కీలకం. అందుకే రఫా క్రాసింగ్‌ను తెరిచి ఉంచాలని ఐసీజే శుక్రవారం ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ ఆదేశాలు అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌కు ఎదురుదెబ్బే అయినా .. రఫాపై దాడులు చేయకుండా ఇజ్రాయెల్‌ను నిలువరించలేవు. ఎందుకంటే ఐసీజే వద్ద తమ ఆదేశాలను అమలుచేయడానికి అవసరమైన పోలీసు, సైనిక బలగాలేమీ లేవు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement