భారీగా తగ్గిన హెచ్‌1–బీ వీసాలు | H1-B Visas For US Drop The Most In A Decade | Sakshi
Sakshi News home page

భారీగా తగ్గిన హెచ్‌1–బీ వీసాలు

Published Thu, Dec 2 2021 4:35 AM | Last Updated on Thu, Dec 2 2021 4:35 AM

H1-B Visas For US Drop The Most In A Decade - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా కలల ప్రయాణానికి కరోనా మహమ్మారి అడుగడుగునా అడ్డు పడుతోంది. భారతీయ టెక్కీల్లో అత్యధిక డిమాండ్‌ ఉండే హెచ్‌1–బీ వీసాల సంఖ్య గత దశాబ్దంలో ఎన్నడూ లేని విధంగా తగ్గిపోయింది. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలకి కొరత లేదు. జాబ్‌ ఓపెనింగ్స్‌ భారీ సంఖ్యలో ఉన్నాయి. కానీ హెచ్‌1–బీ ఉద్యోగస్తుల సంఖ్య పడిపోయింది. కోవిడ్‌ నేపథ్యంలో అమెరికా ప్రయాణాలపై, వీసాలపై ఆంక్షలు విధించడంతో ఈ వలసేతర వీసాలు తగ్గాయి.

రెండేళ్లలో 19 శాతం తగ్గిపోయిన ఉద్యోగులు 

అమెరికా కార్మిక శాఖ వెల్లడించిన గణాంకాలను బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌ విశ్లేషించింది. గత ఏడాదితో పోల్చి చూస్తే సెప్టెంబర్‌ 2021 నాటికి హెచ్‌–1బీ కేటగిరి కింద విదేశీ ఇంజనీరింగ్, మ్యాథ్‌మేటిక్స్‌ ఉద్యోగస్తులు 12.6% తగ్గిపోయారు. కరోనా ముందు అంటే 2019లో పోల్చి చూస్తే ఇదే కేటగిరిలో 19% హెచ్‌1–బీ వీసాలు తగ్గిపోయాయి. కరోనా కారణంగా లాక్‌డౌన్‌లు విధించడం, వీసాల జారీ ప్రక్రియ మందగించడం, కోవిడ్‌ ముప్పుతో అమెరికాకు వెళ్లడానికి ఇష్టపడకపోవడం వంటి కారణాలతోనే హెచ్‌–1బీ వీసాల సంఖ్య తగ్గిపోయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

‘2020 మార్చి నుంచి కొత్త వీసాల జారీ ప్రక్రియ బాగా నెమ్మదించింది. లాక్‌డౌన్‌ ఆంక్షలతో ఒకానొక దశలో కొన్నాళ్ల పాటు దాదాపు నిలిచింది. స్టెమ్‌ (సైన్స్, సాంకేతికం, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌) కేటగిరీలో ఉద్యోగులు తగ్గిపోయాయి. కొన్ని కంపెనీలు విదేశాల నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కి అనుమతినివ్వడంతో హెచ్‌–1బీ వీసాల సంఖ్య తగ్గిపోయింది’ అని కాలిఫోర్నియా యూనిర్సిటీ ప్రొఫెసర్‌ పేరి గోవణ్ణ చెప్పారు. ప్రతీ ఏడాది కొత్తగా 85 వేల హెచ్‌1బీ వీసాలు జారీ చేస్తుంటారు. స్టెమ్‌లో గత ఏడాది మార్చి, ఏప్రిల్‌లో కరోనా కారణంగా ఉద్యోగాలు పోయాయి. కానీ త్వరగానే ఆయా రంగాలు కోలుకోవడంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టుగా అమెరికా కార్మిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 4,97,000 ఉద్యోగాలు ఉన్నాయని 2020 నుంచి పోల్చి చూస్తే 9% తగ్గిందని, 2019తో పోల్చి చూస్తే 17% తగ్గిందని బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌ వెల్లడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement