60+ ‘సూపర్‌’ బ్రెయిన్‌.. మెదడుకు వృద్ధాప్యం లేదట! | Full intellectual activity at age 70 | Sakshi
Sakshi News home page

60+ ‘సూపర్‌’ బ్రెయిన్‌.. మెదడుకు వృద్ధాప్యం లేదట!

Published Thu, Mar 9 2023 2:36 AM | Last Updated on Thu, Mar 9 2023 3:16 PM

Full intellectual activity at age 70 - Sakshi

సాక్షి, అమరావతి: వృద్ధాప్యంలో వెంటాడే ఆరోగ్య సమస్యలతో పాటు మెదడు పనితీరు మందగించి జ్ఞాపక శక్తి క్షీణిస్తుందన్న వాదనల్లో నిజం లేదని అమెరికాలోని జార్జి వాషింగ్టన్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధకులు చెబుతున్నారు.

నిజానికి పెద్దల మెదడు ఎంతో ఆచరణాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుందని, 60 ఏళ్లు దాటిన తర్వాత తీసుకునే నిర్ణయాలు చాలా సృజనాత్మకంగా ఉంటాయంటున్నారు. వీరి మెదడులో కుడి, ఎడమ హెమిస్పియర్స్‌ చాలా చురుగ్గా ఉండటంతో సృజనాత్మక ఆలోచనలు విస్తరిçస్తున్నట్టు గుర్తించారు.

చక్కటి జీవనశైలి, మానసికంగా చురుగ్గా ఉంటే మేధో సామర్థ్యాలు వయసుతో పాటు పెరుగుతాయే కానీ తగ్గవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 60 ఏళ్లు పైబడిన తర్వాత సృజనాత్మక కార్యకలాపాలను ప్రారంభించిన అనేక మందిపై ప్రయోగాలు నిర్వహించి ఈ ఫలితాలను రూపొందించారు. 

నియంత్రణలో భావోద్వేగాలు..
చిన్నతనంలో ఏదైనా వస్తువు పాడు చేసినప్పుడు మెదడు విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంది. యవ్వనంలో అదే పని చేసినప్పుడు కొంత కంగారు పడినా తక్కువ సమయంలోనే స్థిమితపడతారు. 60 ఏళ్లు దాటాక ఎలాంటి భావోద్వేగాలకైనా ఒకేలా స్థిరంగా స్పందిస్తారు.

ఇక 70 ఏళ్ల వయసులో మేధో కార్యకలాపాలు గరిష్ట స్థాయికి చేరినట్లు నిర్ధారించారు. ముదిమి వయసులో మెదడులోని మైలిన్‌ (న్యూరాన్ల మధ్య సంకేతాలను వేగంగా పంపుతుంది) పరిమాణం పెరుగుతుంది. దీంతో సగటు యువకులతో పోలిస్తే 60 ఏళ్లు దాటిన వారిలో మేధో సామర్థ్యాలు 300 శాతం పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు.  

తొట్రుపాటు లేకుండా.. 
60 ఏళ్ల వయసు నుంచి వృద్ధులు నిర్ణయాలు తీసుకునేందుకు మెదడులోని రెండు హెమిస్పియర్స్‌ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ‘80–90 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి మెదడు తక్కువ శక్తిని వినియోగించుకుని గరిష్ట స్థాయిలో ఆలోచిస్తుంది. అనవసరమైన విషయాలను వదిలేసి అవసరమైన వాటికే స్పందిస్తుంది’అని మాంట్రియల్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ మోంచి తెలిపారు.

అధ్యయనంలో భాగంగా నిర్వహించిన వివిధ రకాల పరీక్షల్లో విజయం సాధించేందుకు యువకులు చాలా గందరగోళానికి గురవగా 60 ఏళ్లు పైబడినవారు ఎలాంటి తొట్రుపాటు లేకుండా సరైన నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. చికాగో నార్త్‌ వెస్ట్రన్‌ యూనివర్సిటీలోని ఫీన్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు వీరిని ‘సూపర్‌ ఏజెర్స్‌గా’అభివర్ణిస్తున్నారు.

80ల్లో ఉన్నవారు మేధోపరంగా చురుగ్గా ఉండేందుకు పెయింటింగ్, డ్యాన్స్, సంగీతం నేర్చుకోవడంతో పాటు స్నేహితులను కలుస్తూ భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించు కోవడంలో ముందున్నారని, వారు అద్భుతాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement