చైనా ‘జియాన్-6’తో భారత్‌పై నిఘా పెట్టిందా? హిందూ మహాసముద్రంలో ఏం జరుగుతోంది? | Big Threat to India: China's Ship Xi Yan-6 Sets Sail to Sri Lanka | Sakshi
Sakshi News home page

Big Threat to India: చైనా ‘జియాన్-6’తో భారత్‌పై నిఘా పెట్టిందా?

Published Wed, Oct 4 2023 8:03 AM | Last Updated on Wed, Oct 4 2023 10:30 AM

China Ship xi yan- 6 Mission Sri Lanka a Big Threat to India - Sakshi

చైనా తన మరో గూఢచార నౌక జియాన్-6ను హిందూ మహాసముద్రంలోకి దింపింది. ఈ నౌక హిందూ మహాసముద్రం మధ్యలో 90 డిగ్రీల తూర్పు రేఖాంశ శిఖరంపై ఉంది. ఇది నిరంతరం శ్రీలంక వైపు ​​కదులుతోంది. ఇది భారత్‌కు ముప్పుగా పరిణమించినున్నదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 

2022 నవంబర్‌లో భారతదేశం బంగాళాఖాతంలో బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించాలనుకుంది. క్షిపణిని పరీక్షించబోయే ప్రాంతంలో నో ఫ్లై జోన్ హెచ్చరిక కూడా జారీ చేసింది. అయితే అదే సమయంలో చైనా తన గూఢచార నౌక యువాన్ వాంగ్-6ను హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రయోగించింది. ఈ చైనా నౌక కారణంగా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష తేదీని భారత్ కొన్ని రోజులు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అంటే అక్టోబర్ 2023లో భారత్‌ బంగాళాఖాతంలో మరో క్షిపణిని పరీక్షించబోతోంది. ఈ నేపధ్యంలో అక్టోబర్ 5 నుండి 9 వరకు సుదీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష కోసం బంగాళాఖాతం నుండి హిందూ మహాసముద్రం వరకు హెచ్చరిక జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పరీక్షకు ముందే హిందూ మహాసముద్రంలో చైనా మరో గూఢచార నౌక జియాన్-6ను ప్రయోగించింది.  ఈ నౌక హిందూ మహాసముద్రం మధ్యలో 90 డిగ్రీల తూర్పు రేఖాంశ శిఖరంపై ఉంది.

జియాన్-6 అనేది చైనీస్ పరిశోధన నౌక. చైనా తెలిపిన వివరాల ప్రకారం ఈ నౌక నేషనల్ ఆక్వాటిక్ రిసోర్సెస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (నారా)తో కలసి పరిశోధనలు సాగిస్తుంది. అయితే ఇది చైనా గూఢచార నౌక అని నిపుణులు భావిస్తున్నారు. జియాన్-6 సైన్స్ అండ్‌ ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడానికి చైనా 13వ పంచవర్ష ప్రణాళికలో కీలకమైన ప్రాజెక్ట్. ఇది ప్రారంభమైన రెండు సంవత్సరాల తరువాత, ఓడ 2022లో తూర్పు హిందూ మహాసముద్రంలో తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా చేసింది. శ్రీలంకకు చెందిన రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం అక్టోబర్‌లో కొలంబో నౌకాశ్రయంలో ఈ చైనా పరిశోధన నౌకను డాక్ చేయడానికి అనుమతి ఇచ్చింది.

ఈ చైనా గూఢచార నౌక హిందూ మహాసముద్రంలో భారత్‌ బాలిస్టిక్ క్షిపణిని యూజర్ ట్రయల్ నిర్వహించబోతున్న సమయంలో ల్యాండ్ అయింది. అటువంటి పరిస్థితిలో భారతదేశం పరీక్ష నిర్వహిస్తే.. ఈ గూఢచార నౌక భారత క్షిపణి  అందించే నిఘా సమాచారాన్ని తెలుసుకోగలుగుతుంది. ఈ క్షిపణి వేగం, పరిధి, కచ్చితత్వాన్ని చైనా తెలుసుకోగలుగుతుంది. ఈ విధంగా భారత్‌ను రెచ్చగొట్టేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఈ చర్యతో స్పష్టమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. 

2020లో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీలో సైనిక ఘర్షణ జరిగినప్పటి నుండి భారతదేశం - చైనా మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇప్పుడు హిందూ మహాసముద్రంపై పెరుగుతున్న చైనా ఆధిపత్య ప్రభావం భారత్‌కు శాశ్వత సవాలుగా నిలవనుంది. చైనా తన సముద్ర సరిహద్దులో చాలా బలమైన ఉనికిని కలిగి ఉంది. అటువంటి పరిస్థితిలో విస్తరణవాద విధానాన్ని అనుసరిస్తున్న చైనా విషయంలో భారతదేశం ఆందోళన చెందక తప్పదని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: కోట్లు పలికే ‘రంగురాయి’ ఏది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement