2 వేలు దాటిన అఫ్గాన్‌ మరణాలు Afghanistan earthquake death toll rises to 2000 | Sakshi
Sakshi News home page

2 వేలు దాటిన అఫ్గాన్‌ మరణాలు

Published Mon, Oct 9 2023 5:50 AM | Last Updated on Mon, Oct 9 2023 5:50 AM

Afghanistan earthquake death toll rises to 2000 - Sakshi

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ పశి్చమ ప్రాంతాన్ని శనివారం కుదిపేసిన పెనుభూకంపంలో మృతుల సంఖ్య రెండువేలు దాటింది. తీవ్ర భూప్రకంపనల కారణంగా మట్టితో నిర్మించిన వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆరు గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎటు చూసినా శిథిలాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటి పెను భూకంపం అఫ్గాన్‌ను కుదిపేయడం ఇదే మొదటిసారి. గత ఏడాది జూన్‌లో అఫ్గానిస్తాన్‌లోని పర్వత ప్రాంతాల్లో సంభవించిన భూకంపంలో కనీసం వెయ్యి మంది చనిపోయారు.

అఫ్గాన్‌లో నాలుగో అతి పెద్ద నగరమైన హెరాత్‌ కేంద్రంగా శనివారం భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. మృతుల సంఖ్య 2,100కి చేరువలో ఉందని ఆదివారం తాలిబన్‌ సమాచార, సాంస్కృతిక శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్‌ వాహిద్‌ రయాన్‌ చెప్పారు. మరో 9,240 మందికి తీవ్ర గాయాలయ్యాయని 1,320 ఇళ్లు నేలమట్టమయ్యాయని ఆయన తెలిపారు. డజనుకి పైగా బృందాలు అత్యవసర సహాయ చర్యల్లో మునిగిపోయాయి.

కొన్ని గ్రామాల్లోకి సహాయ సిబ్బంది అడుగు పెట్టడానికి కూడా వీల్లేకుండా శిథిలాలతో నిండిపోయాయి. ఎటు చూసినా శిథిలాల్లో చిక్కుకున్న వారి రోదనలే వినిపిస్తున్నాయి. శిథిలాల కింద ఉన్న వారిని కాపాడడానికి సహాయ బృందాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ చేతులనే ఆయుధాలుగా చేసుకొని శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ గుట్టలు గుట్టలుగా శవాలు బయటకి వస్తున్నాయి.

మరికొందరు స్థానికులు శిథిలాల మీద పాకుతూ వెళుతూ వాటిని తొలగిస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న వారిని కాపాడుతున్నారు. హెరాత్‌లో నేలమట్టమైన ఓ ఇంటి శిథిలాల్లో నుంచి ఆదివారం ఒక శిశువును అక్కడి వారు కాపాడుతున్న దృశ్యాన్ని అసోసియేటెడ్‌ ప్రెస్‌ ప్రసారం చేసింది. అక్కడే శిథిలాల నుంచి ఓ మహిళ చేయి బయటికి కనిపిస్తుండటం కూడా రికార్డయ్యింది. ఆ మహిళ చిన్నారి తల్లేనని స్థానికులు తెలిపారు. ఆమె బతికున్నదీ లేనిదీ స్పష్టం కాలేదు. క్షతగాత్రులకు చికిత్స అందించడానికి వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.  

బాధితులకు అందుతున్న సాయం..
అఫ్గాన్‌లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి నుంచి భూకంప బాధితుల్ని కాపాడేందుకు యూనిసెఫ్‌ దుస్తులు, దుప్పట్లు, టార్పాలిన్లు తదితరాలను పంపించింది. ఐరాస వలసల విభాగం నాలుగు అంబులెన్సులు, వైద్యులు, ఇతర సిబ్బందిని అక్కడి ఆస్పత్రికి పంపించింది. మూడు మొబైల్‌ వైద్య బృందాలను జెందాజన్‌ జిల్లాకు పంపిస్తున్నట్లు వెల్లడించింది. డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ సంస్థ కూడా 80 మంది రోగులకు సరిపోయే అయిదు మెడికల్‌ టెంట్లను హెరాత్‌ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించింది. వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం వంటి సంస్థలు కూడా అత్యవసరాలను అఫ్గానిస్తాన్‌కు అందజేస్తామని ప్రకటించాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement