Sakshi Guest Column Development Issues On Environment Human Life - Sakshi
Sakshi News home page

కొంచెం నెమ్మదిస్తేనే... నిలవగలం!

Published Fri, Jul 21 2023 12:52 AM | Last Updated on Fri, Jul 21 2023 6:41 PM

sakshi guest column development issues on environment human life - Sakshi

గడచిన శతాబ్దాల్లో మనిషి అనూహ్యమైన ప్రగతి సాధించాడు. బొగ్గు, వంటగ్యాస్, సహజ వాయువుల శక్తిని ఒడిసిపట్టి, ఇంధన విప్లవం సాధించడంతో సమాజం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టింది. ఆర్థిక అభివృద్ధి అనేది సామాజిక ఆకాంక్షలు పెరిగేందుకు దోహదపడింది. అదే సమయంలో మానవజాతి భవిష్యత్తు కూడలికి చేరింది. అభివృద్ధి వెంట పరుగులు పెట్టడాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. మానవజాతి మరిన్ని కాలాలు మనుగడ సాగించాలంటే ఈ ఆలోచన, సమీక్ష అత్యవసరం. అభివృద్ధితో వచ్చిన ఆధునిక జీవనశైలి పర్యావరణాన్ని మాత్రమే ప్రభావితం చేయడం లేదు. మన మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత  సంక్షేమాన్ని... మొత్తమ్మీద మన జీవితపు నాణ్యతను దెబ్బతీస్తోంది.

ఆర్థికవేత్త జాన్‌ మేనార్డ్‌ కేన్స్‌ చెప్పినట్లు, మనిషి జీవన ప్రమాణం కొన్ని వేల ఏళ్లపాటు స్తబ్ధుగానే ఉండింది. శిలాజ ఇంధనాల వాడకం మొదలుకావడం అంటే 18, 19వ శతాబ్దం నుంచే దీంట్లో పెను పురోగతి మొదలైంది. బొగ్గు, వంటగ్యాస్, ముడిచమురు అందుబాటులోకి రావడం మన జీవితాలను సమూలంగా మార్చేసిందనడంలో అతిశయోక్తి లేదు. దశాబ్దాల్లోనే సగటు ఆయుష్షు రెట్టింపు అయ్యింది. వేల కిలోమీటర్ల దూరాన్ని గంటల్లో దాటేయగలుగుతున్నాం. ప్రపంచం మూలమూల ల్లోని వారితోనూ  సమాచార వినిమయం చిటికెలో జరిగిపోతోంది. వృద్ధి చెందుతున్న టెక్నాలజీ, దాని విపరిణామాలూ ప్రపంచ రూపు రేఖలను మార్చేశాయి అనడంలో సందేహం లేదు. కానీ ఈ అనూహ్య వేగానికి మనం మూల్యం కచ్చితంగా చెల్లిస్తున్నాం.

మరింత ఎక్కువ ఉత్పత్తి చేయాలి... అది కూడా సమర్థంగా జరగాలన్న ఆదుర్దా మనల్ని మనం సమీక్షించుకునే, విమర్శించు కునే... ప్రకృతితో మనకున్న సంబంధాన్ని మదింపు చేసుకునే సమ యమూ ఇవ్వడంలేదు. పైగా... వలసలు, మనిషి చలనశీలతలకు ముడిపడి ఉన్న రాజకీయ సవాళ్లు కూడా కాలంతోపాటు సంక్లిష్టమ వుతూ పోయాయి. ఇప్పుడు ప్రయాణమూ సులువే, పెద్ద ఎత్తున వలస వెళ్లిపోవడమూ సులభమే. వీటి ప్రభావం వనరులపై పడుతోంది. వలస వెళ్లిన ప్రాంతాల సంస్కృతులతో ఘర్షణలకు కారణ మవుతున్నాయి. సామాజిక సమన్వయమూ దెబ్బతింటోంది. సరి హద్దులు పలుచనైపోయి ప్రపంచం కుంచించుకుపోతున్న కొద్దీ పరిస్థి తులు మరింత ముదురుతున్నాయి. అందుకే ఒక క్షణం ఆగి ఈ సవాళ్లను దీర్ఘాలోచనలతో, సమతుల దృష్టితో పరిష్కరించాల్సి
ఉంటుంది. 

సుస్థిరత–అభివృద్ధి
మనిషి శతాబ్దాలుగా ఇంధన వినియోగమనే వ్యసనానికి బానిస. శిలాజ ఇంధనాలు మనల్ని ముందుకు పోయేలా చేసినా ప్రపంచాన్ని వాతావరణ మార్పుల అంచున నిలబెట్టింది కూడా ఇవే. సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో పర్యావరణ అనుకూల టెక్నాలజీలకు పెద్దపీట వేయాల్సిన సమయం ఇదే. అయితే ఈ మార్పు జరగాలంటే గనుల తవ్వకాలు, నిర్మాణాల అవసరం చాలా ఎక్కువగా ఉంటుందన్నది విమర్శకుల అలోచన. పర్యావరణ అనుకూల టెక్నాలజీల కోసం అవసరమైన రాగి, నికెల్, కోబాల్ట్, ఇతర ఖనిజాలు మన అవసరాలకు తగినన్ని ఉన్నాయా? అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యల్లో కొంత నిజం లేకపోలేదు.

కానీ.. మనిషి తన సృజ నాత్మకతతో వీటిని అధిగమించడం పెద్ద కష్టమూ కాదు. భూమిలో ఈ అత్యవసరమైన లోహాలు తగినన్ని ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. కాకపోతే వీటి శుద్ధీ కరణ పద్ధతులు మాత్రం సమస్యాత్మకమైనవి. వీటిని అధిగమించ డమూ కష్టమేమీ కాదు. డిమాండుకు తగ్గట్టు సరఫరాలను పెంచగలిగే పెట్టుబడిదారీ వ్యవస్థను దృష్టిలో పెట్టుకుంటే ఈ సవాళ్లను ఎదుర్కోవడం కష్టమేమీ కాకపోవచ్చు. ఈ క్రమంలో పర్యావరణ, సామాజిక సమస్యలను విస్మరించడం సరికాదు. ‘రేర్‌ ఎర్త్‌మెటల్స్‌’ ఉత్పత్తిలో, గ్రీన్‌ టెక్నాలజీల్లో ముందువరసలో ఉన్న చైనాలో పర్యావరణ పరిస్థితి దిగజారిపోవడం, కాలుష్యం, కొన్ని వర్గాల సామాజిక బహిష్కరణ, ఆరోగ్య అంశాలు మనకు హెచ్చరికలుగా నిలవాలి. 

ఇంకో కీలకమైన విషయం... పర్యావరణ అనుకూల జీవన విధానాన్ని అలవర్చుకోవాలంటే మన ఆలోచనా ధోరణుల్లోనూ మార్పులు రావాలి. సుస్థిరత అనేది అభివృద్ధికి అడ్డంకి కాదనీ, మెరుగైన భవిష్యత్తుకు మార్గమనీ గుర్తించాలి. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ధులకు పొంతన కుదరదన్న ద్వైదీభావం సరికాదని తెలుసుకోవాలి. నిజానికి పర్యావరణ అనుకూల విధానాలు ఆర్థిక వృద్ధిని పెంచుతాయనీ, నూతన ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందనీ అర్థం చేసుకోవడం ముఖ్యం. పునరుత్పాదక ఇంధన వనరులపైనే ఆధారపడి పనిచేసే కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఇదో మేలి అవకాశం.

జీవన విధానంలో నిదానం
పర్యావరణ అనుకూల టెక్నాలజీలకు కాస్త నెమ్మదైన జీవన విధానమూ తోడైతే శిలాజ ఇంధనాల దుష్పరిణామాలను తగ్గించడం వీలవుతుంది. ప్రపంచంపై, సమాజంపై సరైన అవగాహన కలిగి ఉంటూ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి ఫలాలను అనుభవించడం అవసరం. అభివృద్ధి సాధించే ప్రయాసలో మన చర్యల పర్యవసానా లను గుర్తించి తదనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడం కూడా అవసరం. ఆధునిక జీవితంపై మోజు తాత్కాలికంగా కొన్ని ప్రయో జనాలు కల్పించవచ్చునేమోగానీ... దీర్ఘకాలంలో భూమ్మీద మనిషి మనుగడ ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదముంది.

అభివృద్ధిని సాధించాలన్న వ్యామోహంలో ప్రస్తుతం 800 కోట్లు దాటిన మానవ జనాభాకు ఆహారం అందివ్వడం ఎలా అన్నది మరవకూడదు. మానవ మనుగడ కోసం మన వేగాన్ని తగ్గించు కోవాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ, అందరికీ ఆహార కల్పన అన్న అంశాల మధ్య సమతౌల్యత సాధించాలి. ప్రస్తుతం ఆహారాన్ని పండించడం అనేది ఒక పరిశ్రమలా సాగు తోంది. అయితే ఇందుకు పర్యావరణం మూల్యం చెల్లిస్తోంది. విచ్చల విడి రసాయన ఎరువుల వాడకం, అడవుల నరికివేతవంటివన్నీ పర్యావరణ వ్యవస్థలు, జీవవైవిధ్యతలు, భూమి సారాల విషయంలో చెడు ప్రభావం చూపాయి. సుస్థిరాభివృద్ధి కావాలంటే ఇదే పద్ధతిని కొనసాగించడం మంచిది కాదు.

నిదానమే ప్రధానము
అందరికీ ఆహారమన్న సవాలును ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం అవసరం. ఆయా దేశాల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పరిష్కార మార్గాలను వెత కాల్సి ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులకు ప్రోత్సాహం కల్పిస్తూ... వ్యవసాయ రంగంలో పరిశోధనలకు పెద్దపీట వేయాలి. వనరులు అందరికీ అందుబాటులో ఉండేలా అవకాశాలను కల్పించాలి. కాక పోతే ఇదో సంక్లిష్టమైన సవాలే. ఎన్నో సౌకర్యాలు కల్పించిన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలోనూ కొంచెం జాగరూకతతో వ్యవహరించాలి.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆటోమేషన్లు భవిష్యత్తులో ఉద్యోగాలను తగ్గిస్తాయన్న ఆందోళన కూడా ఒకవైపు ఏర్పడుతోంది. ఈ విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. విద్యపై పెట్టే పెట్టుబడులు పెరగాలి. అదే సమయంలో కొత్త టెక్నాలజీల గురించి అందరికీ శిక్షణ ఇచ్చేందుకూ ఏర్పాట్లు కావాలి. విధానాల ద్వారా సామాజిక అసమతుల్యతలను రూపుమాపే ప్రయత్నం జరగాలి. విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అవకాశాలు అందరికీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధునిక జీవనశైలి పర్యావరణాన్ని మాత్రమే ప్రభావితం చేయడం లేదు.

మన మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత సంక్షేమాన్ని... మొత్తమ్మీద మన జీవితపు నాణ్యతను దెబ్బతీస్తోంది. ఈ ఉరుకుల జీవితాన్ని కాస్త మందగింపజేస్తే ఆత్మవిమర్శకు అవకాశం ఏర్పడుతుంది. మానసిక, భావోద్వేగ సంక్షేమాలను మన ప్రాథమ్యాలుగా ఉంచుకుని పనిచేసేందుకు పనికొస్తుంది. ఆందోళన సంబంధిత ఆరోగ్య సమస్యలు తగ్గించేందుకు వీలేర్పడుతుంది. ప్రాపంచిక సౌఖ్యాల వెంబడి పరుగులో సామాజిక బంధాలను దాదాపుగా విస్మ రించాం. బంధుత్వాలు, సహానుభూతి, మానవ సంబంధాలను మరో సారి ఆచరించేందుకు, కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తుంది. 

డా‘. శ్రీనాథ్‌ శ్రీధరన్‌ - వ్యాసకర్త కార్పొరేట్‌ సలహాదారు, ‘టైమ్‌ ఫర్‌ భారత్‌’ రచయిత
(‘ద ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement