Ecojet: World's First Electric Flight Services Will Start In Two Years - Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే తొలిసారిగా విద్యుత్‌ విమానం, ఎప్పటినుంచంటే..

Published Tue, Aug 1 2023 2:53 PM | Last Updated on Tue, Aug 1 2023 4:14 PM

 World First Electric Flight Services Will Start In Two Years - Sakshi

ప్రపంచంలోనే తొలి విద్యుత్‌ విమాన సేవలు మరో రెండేళ్లలో ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌ నుంచి ఎడిన్‌బర్గ్‌ వరకు ఈ విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. కాలుష్యానికి దారితీసే పెట్రో ఇంధనాల వాడుకను పూర్తిగా నిలిపివేయాలనే లక్ష్యంతోనే పూర్తి విద్యుత్‌ విమాన సేవలను ప్రారంభించేందుకు ‘ఎకోజెట్‌’ సంస్థ సన్నాహాలు చేస్తోంది. బ్రిటిష్‌ సంపన్నుడు డేల్‌ విన్స్‌ ఈ కంపెనీని నెలకొల్పారు.

‘జస్ట్‌ స్టాప్‌ ఆయిల్‌’ వంటి పర్యావరణ అనుకూల కార్యక్రమాలకు భూరి విరాళాలు అందిస్తూ వస్తున్న డేల్‌ విన్స్, కర్బన ఉద్గారాలను విడుదల చేయని విమాన సేవలను అందించడానికి స్వయంగా రంగంలోకి దిగారు. ఈ విమాన సేవలు సౌతాంప్టన్‌–ఎడిన్‌బర్గ్‌ల మధ్య 2025 నుంచి ప్రారంభం కానున్నాయని విన్స్‌ ప్రకటించారు. ‘ఎకోజెట్‌’ రెండు రకాల విమానాల ద్వారా ఈ సేవలను అందించనుంది. పంతొమ్మిది సీట్ల సామర్థ్యం గల విమానాలు, డెబ్బయి సీట్ల సామర్థ్యం గల విమానాలు ఈ సేవల కోసం ‘ఎకోజెట్‌’ వాహనశ్రేణిలో కొలువుదీరనున్నాయి.

ఈ విమానాల్లోని హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్స్‌ ద్వారా విద్యుత్తు ఉత్పత్తవుతుంది. ఈ విద్యుత్తుతోనే విమానాలు నిరాటంకంగా రాకపోకలు సాగించగలుగుతాయి. ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా పాత విమానాలకు మరమ్మతులు చేసి, హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్స్‌ను అమర్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నామని ‘ఎకోజెట్‌’ అధికారులు చెబుతున్నారు. ఈ విమానాల వల్ల పర్యావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాల పరిమాణం ఏడాదికి 90వేల టన్నుల వరకు తగ్గుతుందని వారు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement