What Is Meniere's Disease Diagnosis And Treatment - Sakshi
Sakshi News home page

మీనియర్స్‌ డిసీజ్‌ అంటే..!

Published Sun, Aug 20 2023 12:01 PM | Last Updated on Sun, Aug 20 2023 12:40 PM

What Is Menieres Disease Diagnosis And Treatment - Sakshi

మన లోపలి చెవి (ఇన్నర్‌ ఇయర్‌) వినికిడి సామర్థ్యానికీ, నిటారుగా ఉండేందుకు దోహదం చేస్తుంది.  ఇక్కడ సమస్య వస్తే వినికిడి శక్తి తగ్గడంతో పాటు, నిటారుగా నిలబడి ఉండే సామర్థ్యం కూడా తగ్గిపోయి ఒళ్లంతా గిర్రున తిరుగుతూ, తూలి కిందికి పడిపోతామేమోనన్న ఫీలింగ్‌ కలుగుతుంది. అంతేకాదు... ఏదో ఎలక్ట్రిక్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గర నిలబడిప్పుడు వినిపించే హోరు లాంటిది చెవిలోంచి వినబడుతుంటుంది. ఇలా వినికిడి తగ్గడం, తూలి కిందపడిపోయేలా బ్యాలెన్స్‌ కోల్పోవడం, చెవిలోంచి హోరు వినిపించడం వంటి లక్షణాలతో వ్యక్తమయ్యే మీనియర్స్‌ డిసీజ్‌పై అవగాహన కోసం ఈ కథనం.

మీనియర్స్‌ డిసీజ్‌ను ‘ఇడియోపథిక్‌ ఎండోలింఫాటిక్‌ హైడ్రాప్స్‌’ అని కూడా అంటారు. అది ప్రాణాంతకం కాదుగానీ... చికిత్స అందరకపోతే క్రమంగా వినికిడి శక్తి కోల్పోయే అవకాశమూ ఉంది. గతంలో కాస్త అరుదుగా కనిపించే ఈ సమస్య... ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుండటం వైద్యవర్గాల్లో ఆందోళనను కలిగిస్తోంది. 

లక్షణాలు: మీనియర్స్‌ డిసీజ్‌లో వర్టిగో, టినైటస్, వినికిడిలోపం (డెఫ్‌నెస్‌) ఈ మూడు లక్షణాలూ కలగలసి ఉంటాయి.  

వర్టిగో లక్షణాలు: పిల్లలు గిరగిరా తిరిగీ, తిరిగీ అకస్మాత్తుగా ఆగినప్పుడు బ్యాలెన్స్‌ కోల్పోయి తూలికింద పడిపోతామేమో అనిపించినట్లుగా లేదా రంగుల రాట్నంపై నుంచి విసిరివేసినట్లుగా అనుభూతి చెందుతూ ఆందోళన పడుతుంటారు. వర్టిగోలో కనిపించే ఇదే లక్షణం మీనియర్‌లోనూ కనిపిస్తుంది.  

టినైటస్‌ లక్షణాలు : ఎలక్ట్రిక్‌ ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గరి  గుయ్‌ అనే శబ్దమే కొందరికి చెవుల్లోంచి వినిపిస్తూ, చికాకు కలిగిస్తుంది. టినైటస్‌లోని ఇదే లక్షణం... మీనియర్స్‌ డిసీజ్‌లోనూ కనిపిస్తుంది.  

వినికిడి తగ్గడం : లక్షణాలను నిర్లక్ష్యం చేయడం, చికిత్స తీసుకోకపోవడం వల్ల శాశ్వతంగా వినికిడి కోల్పోయి... పర్మనెంట్‌ డెఫ్‌నెస్‌ వచ్చే అవకాశం ఉంది. వినికిడి లోపం అన్నది ఒక్కోసారి పెరుగుతూ ఒక్కోసారి తగ్గుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఒకేరోజులోనే ఈ పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. చెవి నిండిపోయినట్లుగా ఉండే  ఫీలింగ్‌ చికాకు కలిగిస్తూ ఉంటుంది. 

నిర్ధారణ పరీక్షలు:

  • బాధితులు చెప్పే లక్షణాలతో ఆడియాలజిస్టుల ఆధ్వర్యంలో వినికిడి సామర్థ్యం పరీక్షలు (ఆడియోమెట్రీ టెస్ట్‌) , వెస్టిబ్యులార్‌ టెస్ట్‌ బ్యాటరీ పరీక్షలతో పాటు డాక్టర్ల ఆధ్వర్యంలో మెదడు ఎమ్మారై, ‘ఎలక్ట్రో కాక్లియోగ్రఫీ’, ‘ఎలక్ట్రో నిస్టాగ్మోగ్రఫీ’  వంటి పరీక్షలు మీనియర్స్‌ డిసీజ్‌ నిర్ధారణకు తోడ్పడతాయి. 
  • ఇతర పరీక్షలు: మెదడులో గడ్డలు, కొన్ని రకాల మెదడు సమస్యలు ఉన్నప్పుడూ ఈ లక్షణాలే కనిపిస్తాయి కాబట్టి... ‘మీనియర్స్‌ ప్రోటోకాల్‌’ కూడా చేసి... సమస్య మెదడుకు సంబంధించింది కాదని రూల్‌ అవుట్‌ చేసుకుంటారు. 

నివారణ / వ్యాధి ఉన్నవారికి చెప్పే జాగ్రత్తలు :

  • మీనియర్స్‌ డిసీజ్‌ ఉన్నవారిలో కొన్ని రకాల ఆహార నియంత్రణలను సూచిస్తారు. ఇవి కొంతమేరకు నివారణకూ తోడ్పడతాయి ఆహారంలో ఉప్పు తగ్గించడం
  • చాక్లెట్లు, కెఫిన్‌ ఎక్కువగా ఉండే కాఫీ, కోలాడ్రింక్స్‌ వంటి పానీయాలను పరిమితంగా తీసుకోవడం ∙ఆల్కహాల్, పొగ అలవాట్లకు దూరంగా ఉండటం
  • చైనా సాల్ట్‌కు దూరంగా ఉండటం.

చికిత్స :
వికారం, వాంతుల వంటి లక్షణాలను తగ్గించేందుకు యాంటీ–నాసియా (యాంటీ–ఎమిటిక్‌) మెడిసిన్స్‌ ఇస్తారు ∙ చెవిలోని ఒక రకం ద్రవం పెరగడం వల్ల మీనియర్స్‌ డిసీజ్‌ వచ్చే అవకాశం ఉన్నందున దేహంలోని ద్రవాలను బయటకు పంపించేందుకు మూత్రం ఎక్కువగా వచ్చే మందులైన ‘డై–యూరెటిక్స్‌’ అనే మందుల్ని వాడతారు
వర్టిగోలో కనిపించే కళ్లు తిరగడం, పడిపోవడం లాంటి లక్షణాలను తగ్గించేందుకు ‘వెస్టిబ్యులార్‌ రీ–హ్యాబిలిటీషన్‌’ అని పిలిచే ఫిజియోథెరపీ లాంటి చికిత్సలను అందిస్తారు. ఇందులో బాధితులతో కొన్ని రకాల వ్యాయామాలు చేయిస్తారు
వినికిడి సామర్థ్యం కోల్పోయిన వారిలో... వారు ఏ మేరకు కోల్పోయారో దాన్ని బట్టి హియరింగ్‌ ఎయిడ్‌ మెషిన్‌నూ అమర్చవచ్చు.
పై చికిత్సలేవీ పనిచేయనప్పుడు చాలా అరుదుగా కొందరిలో శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. ఇందులో ‘ఎండోలింఫాటిక్‌ శాక్‌’ అనే ప్రొసీజర్‌ ద్వారా చెవిలో అత్యధికంగా స్రవించే ద్రవాన్ని డ్రైయిన్‌ చేస్తారు∙ ఈ మధ్య  అందుబాటులోకి వచ్చిన ‘ఇంట్రాటింపానిక్‌ స్టెరాయిడ్‌ ఇంజెక్షన్స్‌’ థెరపీ కూడా ఉపయోగపడుతుంది.

డాక్టర్‌ ఈ.సీ. వినయ కుమార్‌ సీనియర్‌ ఈఎన్‌టి సర్జన్‌ 

(చదవండి: అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే..అన్యురిజమ్‌ నుంచి బయటపడాలంటే..?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement