విపరీతమైన మూడ్‌ స్వింగ్స్‌.. బైపోలార్‌ డిజార్డర్‌కి కారణం అదేనా? | What Is Bipolar Disorder, Know Its Main Symptoms And Its Treatment In Telugu - Sakshi
Sakshi News home page

Bipolar Disorder: బైపోలార్‌ డిజార్డర్‌, డిప్రెషన్‌తో సూసైడ్‌ ఆలోచనలు.. ముందే గుర్తించండిలా

Published Tue, Oct 3 2023 1:06 PM | Last Updated on Tue, Oct 3 2023 5:28 PM

What Is Bipolar Disorder Causes And Its Treatment - Sakshi

గోపీనాథ్‌ ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య సునీత కూడా అదే కంపెనీలో పనిచేస్తోంది. ఇద్దరు పిల్లలు. హైదరాబాద్‌ శివార్లలోని గేటెడ్‌ కమ్యూనిటీలో ప్రశాతంగా ఉంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో గోపీనాథ్‌ ప్రవర్తనలో విపరీతమైన మార్పు కనిపిస్తోంది. తాను చేస్తున్న జాబ్‌ తన సామర్థ్యానికి ఏమాత్రం సరిపోనిదని, త్వరలోనే తాను సొంత కంపెనీ మొదలుపెట్టి బిల్‌ గేట్స్‌తో పోటీ పడతానని చెప్తున్నాడు. మొదట్లో సునీత.. సరదాగా అంటున్నాడనుకుంది. కానీ ఒకరోజు హఠాత్తుగా ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. అదేంటని అడిగితే కంపెనీ మొదలు పెడుతున్నానని చెప్పాడు.

స్నేహితులు కొందరిని కూడగట్టుకుని కంపెనీ మొదలుపెట్టాడు. దానికోసం పలుమార్లు అమెరికా, ఇంగ్లండ్, కెనడా, ఆస్ట్రేలియా తిరిగి వచ్చాడు. ఆ క్రమంలో సేవింగ్స్‌ అన్నీ ఖర్చుపెట్టేశాడు. కూడగట్టుకున్న ఆస్తులు కూడా అమ్మేశాడు. స్నేహితులతో పెట్టుబడులు పెట్టించాడు. అతనూ భారీగా అప్పులు చేశాడు. సునీత వారిస్తున్నా, గొడవపడినా ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఆర్నెల్ల తర్వాత గోపీనాథ్‌ ప్రవర్తన అకస్మాత్తుగా మారిపోయింది. కంపెనీ ఆలోచన పక్కకు పడేశాడు. ఎక్కడికీ వెళ్లడంలేదు, ఎవ్వరితోనూ కలవడం లేదు. తన గదిలో కూర్చుని దిగులు పడుతున్నాడు. సమస్య ఏమిటని సునీత అడిగినా సమాధానం లేదు. ఈ దశలో ఫ్రెండ్స్‌ సలహా మేరకు అతన్ని కౌన్సెలింగ్‌కి తీసుకువచ్చింది సునీత. 

విపరీతమైన మూడ్‌ స్వింగ్స్‌.. 
గోపీనాథ్‌ బైపోలార్‌ డిజార్డర్‌ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని మొదటి సెషన్‌లోనే అర్థమైంది. సైకో డయాగ్నసిస్‌ అనంతరం అది నిర్ధారణైంది. వెంటనే సైకో ఎడ్యుకేషన్, సైకోథెరపీ ప్రారంభించి, మందులకోసం సైకియాట్రిస్ట్‌కి రిఫర్‌ చేశాను. విపరీతమైన మూడ్‌ స్వింగ్స్‌ ఈ వ్యాధి లక్షణం. మేనియా ఎపిసోడ్‌లో ప్రపంచాన్ని జయిస్తాం, కొండలనైనా పిండి చేస్తామనే ఉత్సాహం చూపిస్తారు. డిప్రెసివ్‌ ఎపిసోడ్‌లో అంతా కోల్పోయినట్లు, ఇక జీవితమే లేనట్లు బాధపడుతుంటారు. ఈ స్వింగ్స్‌ అరుదుగా జరగొచ్చు లేదా తరచుగా జరగవచ్చు. వాటి తీవ్రత కూడా వ్యక్తికీ  వ్యక్తికీ మారుతుంటుంది. సాధారణంగా టీనేజ్‌లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఏ వయసులోనైనా రావచ్చు.

బైపోలార్‌ డిజార్డర్‌కి కచ్చితమైన కారణం తెలియదు. కానీ ఈ డిజార్డర్‌ ఉన్నవారి మెదడులో మార్పులు కనిపిస్తున్నాయి. అలాగే ఈ డిజార్డర్‌తో ఉన్న తల్లిదండ్రులు, తోబుట్టువులు, సన్నిహిత బంధువులు గలవారిలో ఈ రుగ్మత కనిపిస్తోంది. అందుకు కారణమయ్యే జీన్స్‌ని కనుగొనడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.

బైపోలార్‌ లక్షణాలు
బైపోలార్‌ డిజార్డర్‌లో రెండు దశలుంటాయి. మేనియా, డిప్రెషన్‌. మేనియా దశలో మేనియా, హైపోమేనియా అనే రెండు విభిన్నమైన ఎపిసోడ్స్‌ ఉంటాయి. 
మేనిక్‌ ఎపిసోడ్‌ లక్షణాలు..
    ►  అసాధారణ ఉల్లాసం
     ►   పెరిగిన కార్యాచరణ లేదా ఆందోళన
     ►   విపరీతమైన ఆత్మవిశ్వాసం, ఆనందాతిరేకం (యుఫోరియా)
     ►   నిద్ర అవసరం తగ్గిపోవడం
     ►   అసాధారణమైన మాటకారితనం
     ►   రేసుగుర్రాల్లా పరుగెత్తే ఆలోచనలు
      ►  పేలవమైన నిర్ణయాధికారం 

మేజర్‌ డిప్రెసివ్‌ ఎపిసోడ్‌ లక్షణాలు..

  •      విచారంగా, ఖాళీగా, నిస్సహాయంగా ఉండటం
  •      కారణం లేకుండానే ఏడవడం
  •      ఏ విషయంలోనూ ఆసక్తి లేకపోవడం
  •      డైటింగ్‌ చేయనప్పటికీ గణనీయంగా బరువు తగ్గడం లేదా పెరగడం, ఆకలి తగ్గడం లేదా పెరగడం
  •      నిద్రలేమి లేదా ఎక్కువగా నిద్రపోవడం
  •      చంచలత్వం లేదా మందగించిన ప్రవర్తన
  •      అలసట లేదా నీరసం
  •      విలువ లేని ఫీలింగ్‌ లేదా తగని అపరాధ భావన.
  •      ఆలోచించే సామర్థ్యం లేదా ఏకాగ్రత తగ్గడం
  •      ఆత్మహత్య గురించి ఆలోచించడం, ప్లాన్‌ చేయడం లేదా ప్రయత్నించడం 


జీవితకాల చికిత్స అవసరం..
బైపోలార్‌ డిజార్డర్‌ అనేది జీవితకాల పరిస్థితి. ప్రాథమిక చికిత్సలలో లక్షణాలను నియంత్రించడానికి మందులు, సైకోథెరపీ, సైకోఎడ్యుకేషన్, ఫ్యామిలీ కౌన్సెలింగ్, సపోర్ట్‌ గ్రూప్‌లు ఉంటాయి. 

► బైపోలార్‌ ట్రీట్‌మెంట్‌లో మందులు ప్రధానపాత్ర పోషిస్తాయి. సైకియాట్రిస్ట్‌ పర్యవేక్షణలో క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. 
► బైపోలార్‌ ఎపిసోడ్లను ప్రేరేపించే ట్రిగ్గర్స్‌ని గుర్తించడంలో కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ (ఇఆఖీ) సహాయపడుతుంది. అనారోగ్యకరమైన, ప్రతికూల నమ్మకాలు, ప్రవర్తనలను గుర్తించి, వాటి స్థానంలో ఆరోగ్యకరమైన, సానుకూలమైన వాటితో భర్తీ చేస్తుంది.
► బైపోలార్‌ గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడం, పరిస్థితిని అర్థం చేసుకోవడంలో, బాధితుడికి సపోర్ట్‌ ఇవ్వడంలో సైకో ఎడ్యుకేషన్‌ సహాయపడుతుంది. 
► ట్రీట్‌మెంట్‌ ప్లాన్‌ని పాటించడంలో కుటుంబ సభ్యుల మద్దతు అవసరం. అందుకు ఫ్యామిలీ ఫోకస్డ్‌ థెరపీ సహాయపడుతుంది. 
► నిద్ర, ఆహారం, వ్యాయామం కోసం రోజువారీ దినచర్యను ఇంటర్‌ పర్సనల్, సోషల్‌ రిథమ్‌ థెరపీ (ఐ్క ఖఖీ) ఏర్పాటు చేస్తుంది. మూడ్‌ మేనేజ్‌మెంట్‌కి ఇది సహాయపడుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement