తొమ్మిది నెలల్లో 40 కేజీల బరువు తగ్గి... | Tulika Singh: Lose Weight Turned Fitness Coach Inspirational Journey | Sakshi
Sakshi News home page

తొమ్మిది నెలల్లో 40 కేజీల బరువు తగ్గి...

Published Fri, Sep 9 2022 8:46 PM | Last Updated on Fri, Sep 9 2022 8:47 PM

Tulika Singh: Lose Weight Turned Fitness Coach Inspirational Journey - Sakshi

అంతవరకు సన్నగా... నాజుగ్గా ఉన్న అమ్మాయిలలో చాలామంది పెళ్లి అయ్యాక శరీరంలో చోటు చేసుకునే మార్పులతో ఒక్కసారిగా బరువు పెరిగిపోతుంటారు. కొంతమంది వ్యాయామం, క్రమబద్ధమైన ఆహారం ద్వారా బరువుని నియంత్రణలో ఉంచుకుంటే, అవేమీ చేయకుండా ఆకృతి మారిన శరీరాన్ని చూసి నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు మరికొందరు. అధిక బరువుతో నిరాశకు గురైన వారు అంత త్వరగా ఆ నిరాశ నుంచి బయటకు రాలేరు. గుమ్మం దాటి బయటకొస్తే తనని చూసి అందరూ నవ్వుతారు అని భయపడిన తులికా సింగ్‌.. ఇంట్లో వాళ్ల ప్రోత్సాహంతో నలభై కేజీల బరువు తగ్గి, తనే ఫిట్‌నెస్‌కోచ్‌గా రాణిస్తోంది.

వారణాసికి చెందిన తులికాసింగ్‌ ఇంటర్మీడియట్‌ వరకు చదువుకుని 2004లో జర్నలిజం చదివేందుకు నోయిడాకు వెళ్లింది. జర్నలిజం కోర్సు పూర్తయ్యాక వెంటనే ఉద్యోగం దొరకలేదు. తిరిగి ఇంటికి వెళ్లలేని పరిస్థితి. పొట్టకూటికోసం కొన్నాళ్లపాటు పరాటాలు విక్రయించింది. తరువాత ఓ ప్రొడక్షన్‌ హౌస్‌లో పనిదొరకడంతో మూడు వేలరూపాయల జీతానికి చేరింది. ఇలా రెండేళ్లు కష్టపడ్డాక 2007లో ఓ న్యూస్‌ చానల్లో్ల ఉద్యోగం దొరికింది. చక్కగా పనిచేస్తూ కెరీర్‌లో నిలదొక్కుకుంది. కొంతకాలానికి దిగ్విజయ్‌ సింగ్‌ను పెళ్లిచేసుకుంది.

జోకులు వినలేక...
పెళ్లివరకు అనేక కష్టాలు పడినప్పటికీ ధైర్యంగా ముందుకు సాగిన తులికాకు పెళ్లి తరువాత కొత్తరకం కష్టాలు మొదలయ్యాయి. చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా ఉన్న ఆమె పెళ్లి, పిల్లలతో హార్మోన్లలో ఏర్పడిన అసమతుల్యత కారణంగా ఒక్కసారిగా బరువు పెరిగింది. అంత బరువున్నా, ఎప్పుడూ నీరసంగా ఉండేది. దీనికితోడు చుట్టుపక్కల వాళ్లు ఆమె శరీరం మీద రకరకాల జోకులు వేస్తూ, గేలిచేసేవారు. దీంతో తనకు తెలియకుండానే డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఇంట్లో నాలుగు గోడల మధ్య కూర్చోని దిగులు పడుతుండేది. ముంబై నుంచి ఢిల్లీకి మారాక కూడా చానల్‌లో పనిచేసేది. కానీ అధిక బరువు కారణంగా ఏకాగ్రత పెట్టలేక ఆర్టికల్స్‌ను రాయలేకపోయేది. రోజురోజుకి పెరుగుతోన్న బరువుని నియంత్రించలేక, జనాల ఈసడింపు చూపులు తట్టుకోలేకపోయేది. మరోవైపు పీసీఓడీ సమస్యతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంది.

తొమ్మిది నెలల్లో నలభై కేజీలు...
నాలుగో అంతస్థులో ఉండే తులికా, తాను కిందకి దిగితే చూసినవాళ్లు నవ్వుతారన్న భయంతో భర్త, కొడుకు, స్నేహితులు మోటివేట్‌ చేయడంతో దగ్గర్లో ఉన్న చిన్న పార్క్‌లోకి రాత్రి సమయాల్లో వెళ్లి రహస్యంగా వాకింగ్, రన్నింగ్‌ చేయడం మొదలు పెట్టింది. రెండు నెలలపాటు రన్నింగ్, వాకింగ్‌లతో పదమూడు కేజీలు బరువు తగ్గింది. ఈ ఉత్సాహంతో ఆహారంలో మార్పులు, జిమ్‌లో చేరి వర్క్‌ అవుట్‌లు, యోగా చేయడంతో తొమ్మిది నెలల్లోనే నలభై కేజీలు బరువు తగ్గింది. 

జిమ్‌ ట్రైనర్‌ను చూసి...
ఒకపక్క డిప్రెషన్‌కు కౌన్సెలింగ్‌ తీసుకుంటూనే, జిమ్‌లో క్రమం తప్పని వ్యాయామంతో బరువు తగ్గిన తులికా.. తను కూడా జిమ్‌లోని ఫిట్‌నెస్‌ కోచ్‌ కావాలనుకుంది. దీంతో వ్యాయామాలన్ని చక్కగా నేర్చుకుని ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ప్రస్తుతం చక్కని ఫిట్‌నెస్‌ కోచ్‌గా రాణించడమేగాక, నేషనల్‌ గేమ్స్‌ ఆస్పిరెంట్స్‌కు శిక్షణ ఇస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లో నలుగురిలో కలవలేనప్పటికీ.. మనలో ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే ఎంతటి బరువునైనా దింపేసుకుని ముందుకు సాగవచ్చనడానికి తులికా జీవితం ఉదాహరణగా నిలుస్తోంది. (క్లిక్‌: పుష్ప.. 66 వయసులోనూ తగ్గేదేలే..!)
 
మనల్ని మనం ప్రేమించుకోవాలి. అప్పుడే సంతోషంగా ఉండగలుగుతాం. శరీరమే మనకు సర్వస్వం. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కెరీర్‌ మీద దృష్టిపెడుతూనే ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరచుకుంటే ఎప్పుడూ ఫిట్‌గా ఉంటాము. మన రోజువారి పనుల్లో హెల్దీ లైఫ్‌స్టైల్‌ భాగం కావాలి. నా స్టూడెంట్స్‌కు ఇదే నేర్పిస్తున్నాను. 
– తులికా సింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement