Ponmudi: కేరళ బంగారం.. పొన్‌ ముడి | Trip to Ponmudi Hill Station Kerala | Sakshi
Sakshi News home page

Ponmudi: కేరళ బంగారం.. పొన్‌ ముడి

Published Sat, Jul 10 2021 1:41 AM | Last Updated on Sat, Jul 10 2021 1:10 PM

Trip to Ponmudi Hill Station Kerala - Sakshi

కశ్మీరు లోయ... కన్యాకుమారి చెంతకు వచ్చినట్లుంది. సముద్రం అంటే ఏమిటో ఎరుగని కశ్మీర్‌ పశ్చిమ కనుమలను ఆసరాగా చేసుకుంటూ అరేబియా తీరం వెంబడే దక్షిణాదికి నడిచి వచ్చినట్లు ఉంటుంది పొన్ముడి.

పొన్‌ముడి అంటే బంగారు శిఖరం అని అర్థం. ఇక్కడి వాతావరణాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించిన వాళ్లు ఈ ప్రదేశాన్ని కశ్మీర్‌తో పోలుస్తారు. కేరళలోని ఈ హిల్‌స్టేషన్‌లో ఏడాదంతా ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయి. పర్వత శిఖరాలను తాకుతూ ప్రయాణించే మబ్బులను దక్షిణాదిలో చూడాలంటే ఈ పొన్ముడిలోనే సాధ్యం. ఈ కేరళ కాశ్మీరం ఆ రాష్ట్ర రాజధాని త్రివేండ్రం నగరానికి డెబ్బై కిలోమీటర్ల దూరాన ఉంది.

జ్ఞాపకంగా ఓ రాయి
త్రివేండ్రం నుంచి మొదలైన రోడ్డు ప్రయాణంలో నగరాన్ని వదిలినప్పటి నుంచి పశ్చిమ కనుమల పచ్చదనం ఆహ్వానిస్తుంది. రోడ్డు మలుపులు తిరుగుతూ ఉంటుంది. కొంతసేపటికి ఏ దిక్కుగా ప్రయాణిస్తున్నామో కూడా అర్థం కాదు. ఈ మధ్యలో కల్లేరు నది పలకరిస్తుంది. ఈ నదిలో రాళ్లు నీటి ప్రవాహానికి అరిగిపోయి నునుపుదేలి ఉంటాయి. బాగా నునుపుదేలిన ఒక రాయిని వెంట తెచ్చుకుంటే పొన్‌ ముడి టూర్‌ జ్ఞాపకంగా ఉంటుంది. పొన్‌ ముడి శిఖరం మీద నిలబడి ఆత్మప్రదక్షిణం చేసుకుంటే ప్రకృతి విజయం కనువిందు చేస్తుంది. గ్లోబల్‌ వార్మింగ్‌లు, సునామీలు ఎన్ని విపత్తులు వచ్చినా ప్రకృతి తిరిగి చిగురించడం మానదు. అదే ప్రకృతి సాధించే విజయం. ఇక పొన్‌ ముడి టూర్‌లో తీరాల్సిన అద్భుతం అందమైన సూర్యోదయం.        

పశ్చిమ కోన
వరయాడు అంటే నీలగిరి థార్‌. నీలగిరి థార్‌ ఉండే ఎల్తైన ప్రదేశమే వరయాడు మొట్ట. ఇది మూడు వేల ఐదు వందల అడుగుల ఎత్తు ఉంటుంది. కల్లేరు నదికి పొన్‌ ముడి పర్వత శిఖరానికి మధ్యలో వరయాడు మొట్ట వస్తుంది. ఇది పదమూడు శిఖరాల సమూహం. ఇందులో సెకండ్‌ హయ్యస్ట్‌ వరయాడు మొట్ట. సౌత్‌ ఇండియాలో అడ్వంచరస్‌ ట్రెక్కింగ్‌ పాయింట్‌. ట్రెకింగ్‌ మొదలైన అరగంటకే ఉచ్ఛ్వాశ నిశ్వాసల వేగం పెరుగుతుంది, శబ్దం స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ట్రెకింగ్‌కి రెండు నెలలు ముందు బుక్‌ చేసుకోవాలి. జంతుప్రేమికులు, పక్షి ప్రేమికులు వాళ్ల ఆసక్తిని బట్టి వరయాడు మొట్ట, సీతతీర్థం మీదుగా పొన్‌ ముడి చేరుకోవచ్చు.

ట్రావెల్‌ టిప్‌
ట్రెకింగ్‌కి వెళ్లే వాళ్లు షూస్‌ పట్ల ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. పాదానికి, మడమకు అదనపు ఒత్తిడి కలగకుండా సౌకర్యంగా ఉండాలి. అలాగే ట్రెకింగ్‌ మొదలు పెట్టేటప్పుడు సాక్స్‌ ధరించడానికి ముందు పాదానికి, వేళ్ల సందుల్లో టాల్కమ్‌ పౌడర్‌ చల్లాలి. ఇలా చేయడం వల్ల రోజంతా షూస్‌తోనే ఉన్నప్పటికీ పాదాలు తాజాగా ఉంటాయి. చెమటతో చిరాకు కలగదు.

వరయాడు మొట్టకు పర్యాటకుల ట్రెకింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement