ప్రాణం నిలిపే రక్తపు బొట్టు  | Today is World Blood Donor Day | Sakshi
Sakshi News home page

ప్రాణం నిలిపే రక్తపు బొట్టు 

Published Wed, Jun 14 2023 5:56 AM | Last Updated on Wed, Jun 14 2023 5:56 AM

Today is World Blood Donor Day - Sakshi

రక్తపు బొట్టు... ప్రాణాన్ని నిలబెడుతుంది. ఆ రక్తం సమయానికి అందకపోతే... ప్రాణాన్ని నిలపగలిగే డాక్టర్‌ కూడా అచేతనం కావాల్సిందే. శిబి చక్రవర్తిలా దేహాన్ని కోసి ఇవ్వాల్సిన పనిలేదు. కొంత రక్తాన్ని పంచి మరొక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. రక్తదానానికి మగవాళ్లతోపాటు మహిళలూ ముందుకొస్తున్నారు. మహిళలు రక్తదానం చేయరాదనే అపోహను తుడిచేస్తున్నారు. రక్తదానం చేస్తూ... సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ఉన్న ఓ మెడికో... ఓ సోషల్‌ యాక్టివిస్ట్‌ల పరిచయం ఇది. 

నాన్న మాట... 
యాభై సార్లు రక్తదానం చేయాలనే సంకల్పం కూడా మా నాన్న చెప్పిన మాటే. రక్తదానం చేయగలిగింది ఇరవై నుంచి అరవై ఏళ్ల మధ్యలోనే. అరవై తర్వాత రక్తదానం చేయడానికి ఆరోగ్యరీత్యా నిబంధనలు ఒప్పుకోవు. వీటికి తోడు ఆడవాళ్లకు ప్రసవాలు, పిల్లల పెంపకంలో మరో పదేళ్లు గడిచిపోతాయి. 35 నుంచి విధిగా రక్తదానం చేస్తూ యాభై సార్లు రక్తం ఇవ్వాలనే నియమాన్ని పెట్టుకోవాలనేవారు. ఆ లక్ష్యంతోనే యాభై రక్తదానాలు పూర్తి చేశాను. ఆ తర్వాత మా అమ్మకోసం మా తమ్ముడితోపాటు నేనూ రక్తం ఇచ్చాను కానీ దానిని ఈ లెక్కలో చెప్పుకోను. అమ్మరుణం ఏమిచ్చినా తీరేది కాదు.   – గొట్టిపాటి నిర్మలమ్మ, రక్తదాత 

మా పుట్టిల్లు నెల్లూరు నగరం (ఆంధ్రప్రదేశ్‌). మా చిన్నాన్న జయరామనాయుడు డాక్టర్‌. ‘రక్తం అంది ఉంటే ప్రాణాన్ని కాపాడగలిగేవాళ్లం’ అని అనేకసార్లు ఆవేదన చెందేవారు. ఇంట్లో అందరినీ రక్తదానం పట్ల చైతన్యవంతం చేశారాయన. దాంతో మా నాన్న నెల్లూరులో రెడ్‌క్రాస్, బ్లడ్‌బ్యాంకు స్థాపించారు. ఇంట్లో అందరం రక్తదానం చేశాం. అలా నేను తొలిసారి బ్లడ్‌ డొనేట్‌ చేసినప్పటికి నా వయసు 20.  

మామగారి ప్రోత్సాహం 
పెళ్లికి ముందు నెల్లూరులో మొదలైన రక్తదాన ఉద్యమాన్ని పెళ్లయి అత్తగారింటికి నెల్లూరు జిల్లా, కావలి పట్టణానికి వెళ్లిన తర్వాత కూడా కొనసాగించాను. నలభై ఏళ్ల కిందట కావలి రక్తదాతల్లో మహిళలు దాదాపు పదిహేను మంది ఉండేవారు. రెడ్‌క్రాస్‌ సమావేశాలు మా ఇంట్లోనే జరిగేవి. అనేక క్యాంపులు కూడా నిర్వహించేవాళ్లం. కాలేజ్‌ స్టూడెంట్స్‌ ఉత్సాహంగా ముందుకు వచ్చేవాళ్లు.

కానీ అలా ముందుకొచ్చిన అమ్మాయిల్లో బ్లడ్‌ తగినంత ఉంటే కదా! వందమంది ఆడపిల్లలు వస్తే రక్తదానం చేయగలిగిన ఎలిజిబులిటీ ఉన్న వాళ్లు ఆరేడుకు మించేవాళ్లు కాదు. అండర్‌ వెయిట్, హిమోగ్లోబిన్‌ శాతం తగినంత లేకపోవడం ఎక్కువగా కనిపించేది. అరుదైన గ్రూపుల వాళ్ల నుంచి కూడా బ్లడ్‌ క్యాంపుల్లో సేకరించేవాళ్లం కాదు. వాళ్లకు పరీక్షలు చేసి లిస్ట్‌ తయారు చేసుకుని ఎమర్జెన్సీ కండిషన్‌లో పిలుస్తామని చెప్పేవాళ్లం. 

అప్పట్లో బ్యాంకుల్లేవు 
నా వయసు 63. ఈ వయసులో కూడా ఇంత చురుగ్గా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానంటే అందుకు రక్తదానమే కారణం. ఇప్పుడు బ్లడ్‌ డొనేషన్‌కు సౌకర్యాలు బాగున్నాయి. కానీ మొదట్లో బ్యాంకులు ఉండేవి కాదు. మా మామగారు మాజీ ఎమ్మెల్యే సుబ్బానాయుడు ప్రోత్సాహంతో మా బంధువులు ముందుకొచ్చి కావలి హాస్పిటల్‌లో రక్తదానం కోసం ఒక గది కట్టించారు. యాక్సిడెంట్‌ కేస్‌ రాగానే హాస్పిటల్‌ నుంచి మాకు ఫోన్‌ వచ్చేది. అప్పటికప్పుడు మా డోనర్స్‌లో పేషెంట్‌ బ్లడ్‌ గ్రూపుతో మ్యాచ్‌ అయ్యే డోనర్‌ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లు వెళ్లి రక్తం ఇచ్చేవాళ్లం.

బ్లడ్‌ డోనర్స్‌ అంతా ఆరోగ్యంగా, అంటువ్యాధుల పట్ల విచక్షణతో ఉండాలి. చిన్నపాటి అనారోగ్యాలు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలన్నీ చేయించుకుని రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అవసరాన్ని బట్టి ఏడాదికి మూడు–నాలుగుసార్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా అమ్మాయి దగ్గరకు యూఎస్‌కి వెళ్లినప్పుడు అక్కడ కూడా ఓ సారి బ్లడ్‌ డొనేట్‌ చేశాను. అది అత్యవసర స్థితి కాదు, కేవలం యూఎస్‌లోనూ రక్తమిచ్చాననే సరదా కోసం చేసిన పని. మొత్తానికి అరవై ఏళ్లు నిండేలోపు యాభైసార్లు రక్తం ఇచ్చి మా నాన్న మాటను నెగ్గించాను. ఈ క్రమంలో ఎక్కువసార్లు రక్తదానం చేసిన మహిళగా గుర్తింపు వచ్చింది.  

గవర్నర్‌ అభినందించారు 
అప్పటి గవర్నర్‌ రంగరాజన్, ఆయన సతీమణి హరిప్రియా రంగరాజన్‌ దంపతులు 2000వ సంవత్సరంలో కావలికి వచ్చారు. ఆమె రెడ్‌క్రాస్‌లో చురుకైన సభ్యురాలు కూడా. రాజ్‌భవన్‌లో జరిగిన రెడ్‌క్రాస్‌ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను. నన్ను కావలిలో చూసి ‘ఈ పురస్కారం అందుకుంటున్న నిర్మలవి నువ్వేనా’ అని ఆత్మీయంగా పలకరించారు. మహిళలకు మార్గదర్శి అంటూ గవర్నర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ జ్ఞాపకాలన్నీ నా మనసులో ఉన్నాయి కానీ జ్ఞాపికలుగా దాచుకోవాలనే ఆలోచన కూడా ఉండేది కాదు. నా జీవితం అంతా ఎదురీతలోనే గడిచింది. ఆ ఎదురీతల్లో ఇవేవీ ప్రాధాన్యతాంశాలుగా కనిపించలేదప్పట్లో. మొత్తానికి మా చిన్నాన్న, నాన్న, మామగారు అందరూ బ్లడ్‌ డొనేషన్‌ పట్ల చైతన్యవంతంగా ఉండడంతో నాకు ఇంతకాలం ఈ సర్వీస్‌లో కొనసాగడం సాధ్యమైంది. ఇది నాకు సంతోషాన్నిచ్చే కార్యక్రమం కావడంతో ఇంట్లో ఎవరూ అడ్డుచెప్పేవాళ్లు కాదు’’ అని తన రక్తదాన ప్రస్థానాన్ని వివరించారు సోషల్‌ యాక్టివిస్ట్‌ నిర్మలమ్మ.  

రక్తదానం చేద్దాం! – శృతి కోట, రక్తదాత, వైద్యవిద్యార్థిని
నేను పద్దెనిమిదేళ్ల వయసు నుంచి బ్లడ్‌ డొనేట్‌ చేస్తున్నాను. నా హిమోగ్లోబిన్‌ శాతాన్ని పరీక్షించుకుంటూ మూడు – నాలుగు నెలలకోసారి ఇచ్చేటట్లు చూసుకుంటున్నాను. ఈ మధ్య హెపటైటిస్‌ వ్యాక్సిన్‌ కారణంగా కొంత విరామం వచ్చింది.  మా నాన్న సంపత్‌కుమార్‌ బ్లడ్‌ డోనర్‌ కావడంతో నాకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. రక్తదానానికి మహిళలు, మగవాళ్లు అనే తేడా పాటించక్కర్లేదు. అయితే భారతీయ మహిళల్లో రక్తహీనత ఎక్కువ మందిలో ఉంటోంది కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ రక్తదానం చేయవచ్చు.

హిమోగ్లోబిన్‌ పన్నెండు శాతానికి తగ్గకూడదు. డయాబెటిస్, పీసీఓడీ, థైరాయిడ్‌ సమస్యలతోపాటు లాస్ట్‌ పీరియడ్‌లో రక్తస్రావం స్థాయులను దృష్టిలో ఉంచుకుని రక్తదానం చేయవచ్చు. పాలిచ్చే తల్లులు రక్తదానం చేయకూడదు. మెనోపాజ్‌ దశలో ఉన్న వాళ్లు డాక్టర్‌ సూచన మేరకు ఇవ్వవచ్చు. ఇక మహిళలు, మగవాళ్లు అందరూ రక్తదానం చేయడానికి ముందు చెక్‌లిస్ట్‌ ప్రకారం అన్ని పరీక్షలు చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరించుకోవాలి.

ఎయిడ్స్, హెపటైటిస్, మలేరియా, సమీప గతంలో ఏవైనా ఇన్‌ఫెక్షన్‌లకు గురవడం, వ్యాక్సిన్‌లు వేయించుకోవడం, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడుతూ ఉండడం వంటి కండిషన్స్‌కు స్క్రీనింగ్‌ జరిగిన తర్వాత మాత్రమే రక్తాన్ని సేకరిస్తారు. రక్తం ఇవ్వాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ తమ దేహ సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బ్లడ్‌ డోనార్స్‌ మంచి ఆహారం, తగినంత నీరు తీసుకోవడంతోపాటు, క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తుండాలి. రక్తదానం చేస్తుంటే ఎప్పటికప్పుడు కొత్త కణాలు పుట్టుకొస్తూ దేహం ఆరోగ్యంగా ఉంటుంది.

‘రక్తాన్ని ఇవ్వండి, ప్రాణాన్ని కాపాడండి’ అనేదే మెడికోగా నా సందేశం. ప్రమాదంలో గాయపడిన తొలి గంటను గోల్డెన్‌ అవర్‌ అంటాం. ఆ గంటలో వైద్య చికిత్స జరగడం ఎంత అవసరమో వైద్యానికి రక్తం అందుబాటులో ఉండడమూ అంతే అవసరం.  

– వాకా మంజులారెడ్డి,  సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement