Youtube Village: Success Story of 'Youtube Village' Cooking Channel in Telugu - Sakshi
Sakshi News home page

Youtube Village: ఘుమఘుమలాడే బిర్యానీ, చేపలు సులభంగా ఎలా పట్టాలి? వీటన్నింటికీ సమాధానం!

Published Wed, May 25 2022 10:12 AM | Last Updated on Wed, May 25 2022 11:03 AM

Successful Journey: Bangladesh Kushtia Youtube Village Cooking Channel - Sakshi

‘యూ ట్యూబా, అదేమిటి?’ అని అడిగినవాళ్లే ఇప్పుడు తమ వీడియోలతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ‘దీన్ని ఎలా ఉపయోగిస్తారు?’ అని కెమెరాను చూస్తూ  అమాయకంగా అడిగిన వాళ్లే ఆ కెమెరాను ఆపరేట్‌ చేస్తూ  ‘సూపర్‌’ అనిపించుకుంటున్నారు. ‘చిన్న ఊరు’గా ఒకప్పుడు ఆ ఊరికి చిన్నపేరే ఉంది. ఇప్పుడు మాత్రం ‘యూట్యూబ్‌ విలేజ్‌’గా పెద్దపేరు వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఆ గ్రామ మహిళలు...

పచ్చటిపంట పొలాలు పలకరింపుగా నవ్వుతున్నాయి. పిల్లలు గోలగోలగా ఆడుకుంటున్నారు. సుమారు పదిహేనుమంది మహిళలు వంటపనుల్లో నిమగ్నమయ్యారు. మగవాళ్లు వారికి సహాయపడుతున్నారు. అంతా సందడి సందడిగా ఉంది. అలా అని అది పెళ్లికి సంబంధించిన విందు కార్యక్రమం కాదు.

జస్ట్‌... యూట్యూబ్‌ షూటింగ్‌!
బంగ్లాదేశ్‌లోని కుష్తియ జిల్లాలోని షిములియ గ్రామం ‘యూట్యూబ్‌ విలేజ్‌’గా ఫేమస్‌ అయింది. ఈ గ్రామ నేపథ్యంగా ఘుమఘుమలాడే బిర్యానీ వంటకాల తయారీ నుంచి చేపలను సులభంగా ఎలా పట్టాలి?... వరకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ ‘యూట్యూబ్‌ విలేజ్‌’ నుంచి తెలుసుకోవచ్చు.

షూట్‌ పూర్తయిన తరువాత వేడివేడి వంటకాలను పేదలకు పంచుతారు. కెమెరా హ్యాండిల్‌ చేయడం, ఎడిటింగ్, షూట్, డైరెక్షన్‌... మొదలైన విషయాలను శ్రద్ధగా నేర్చుకున్న షిములియ గ్రామ మహిళలు తమ వంటల వీడియోలతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ ఛానల్‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామ అభివృద్ధికి, పేదల అవసరాల కోసం వినియోగిస్తున్నారు.

ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే...
మీర్‌పూర్‌లో ఐటీ కంపెనీ నడిపే లిటన్‌ అలి స్వగ్రామం షిములియ. ఊరికి వచ్చినప్పుడల్లా తన చేతిలో ఉన్న కెమెరాతో చేపలమార్కెట్‌ సందడి, పిల్లకాలువలు, పెద్దచెరువు అందాలు, చేతివృత్తుల పనితనం, గొర్రెల కాపరి పాడే పాట... ఇలా రకరకాల దృశ్యాలను వీడియోలో బంధించి ‘ఎరౌండ్‌ మీ బీడి’ పేరుతో  యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసేవాడు. 

ఆ సమయంలోనే ‘ఎరౌండ్‌ మీ బీడి’ని ఉపాధికి ఉపయోగపడే ఛానల్‌గా మార్చాలని రంగంలోకి దిగాడు అలి. మొదట్లో ఎలా ఉండేదోగానీ మహిళలు ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటర్‌ అయిన తరువాత సీన్‌ మారిపోయింది. వారు తమ నైపుణ్యం, సృజనాత్మక ఆలోచనలతో ‘యూట్యూబ్‌ విలేజ్‌’ను ఎక్కడికో తీసుకువెళ్లారు. దీంతో షిములియ పేరు ‘యూట్యూబ్‌ విలేజ్‌’గా మారిపోయింది.

‘ఎప్పుడోగానీ ఊరంతా ఒకచోట కలుసుకునే అవకాశం ఉండదు. అయితే ఛానల్‌ పుణ్యమా అని అందరం తరచు ఒకచోట కలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఊరంతా కలిసి విందు చేసుకుంటున్నట్లుగా ఉంటుంది. సంతోషాలు పంచుకోవడమే కాదు సమస్యల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం’ అంటుంది 38 సంవత్సరాల మహేర.

‘మా వంటల రుచులతో ప్రపంచంతో మాట్లాడే అవకాశం దొరికింది’ అంటుంది రియా. కంటెంట్‌ సక్సెస్‌ కావడం ఒక ఎత్తయితే, ఆ సక్సెస్‌ను నిలుపుకోవడం మరో ఎత్తు. ఎప్పటికప్పుడు విభిన్నమైన ఎపిసోడ్స్‌ను రూపొందించాల్సి ఉంటుంది. ఈ బాధ్యతను భుజాన వేసుకొన్న గ్రామ మహిళలు కాలగర్భంలో కలిసిపోయిన అరుదైన, రుచికరమైన వంటకాలను బయటికి తీస్తున్నారు. దీంతోపాటు కొత్త వంటకాలను సృష్టిస్తున్నారు.

‘యూట్యూబ్‌ విలేజ్‌’ అనేది బిజినెస్‌ మోడల్‌గా మారడమే కాదు ఎన్నో ఊళ్లకు స్ఫూర్తి ఇస్తుంది. ఇప్పుడు మనదేశంతో సహా పాకిస్థాన్, ఇండోనేషియా... మొదలైన దేశాల్లో ‘యూట్యూబ్‌ విలేజ్‌’ అనేది ఒక ట్రెండ్‌గా మారింది.

చదవండి👉🏾ఆమె వస్తే... పెళ్లి ఆగాల్సిందే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement