ఓ ఆదివాసి వీరనారి పోరాటం! Rani Durgavati: Symbol Of Syncretic Culture Between Rajputs And Tribals | Sakshi
Sakshi News home page

ఓ ఆదివాసి వీరనారి పోరాటం!

Published Thu, Oct 5 2023 11:06 AM | Last Updated on Fri, Oct 6 2023 12:09 PM

Rani Durgavati: Symbol Of Syncretic Culture Between Rajputs And Tribals - Sakshi

మొఘల్‌ సామ్రాజ్యాన్ని ఎదిరించి వీరమరణం పొందిన ఆదివాసీ వీరనారి రాణి దుర్గావతి. మధ్యప్రదేశ్‌లోని గోండు తెగకు చెందిన బుందేల్‌ ఖండ్‌ సంస్థానాధీశుడు చందవేల్‌కు 1524 అక్టోబర్‌ 5న దుర్గావతి జన్మించింది. దుర్గావతి భర్త దళపత్‌ షా గోండు రాజ్యాన్ని పాలిస్తూ మరణించాడు. కుమారుడు వీరనారాయణ్‌ మైనర్‌ కావడంతో దుర్గావతి గోండ్వానా రాజ్య పాలన చేపట్టింది. రాణి దుర్గావతి పైనా, ఆమె పాలిస్తున్న గోండ్వానా రాజ్య సంపద పైనా మనసు పారేసుకున్న అక్బర్‌ సేనాని ఖ్వాజా అబ్దుల్‌ మజీద్‌ అసఫ్‌ ఖాన్‌... అక్బర్‌ అనుమతిని తీసుకొని గోండ్వానాపై దండెత్తాడు. సుశిక్షితులైన వేలాది మొఘల్‌ సైనికులు ఒకవైపు, అసంఘ టితమైన ఆదివాసీ సైన్యం ఒకవైపు యుద్ధ రంగంలో తలపడ్డారు. మొఘల్‌ సైన్యానికి ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. కానీ ఆదివాసీ సైనికులకు సంప్రదాయ ఆయుధాలే దిక్కయ్యాయి.

మొఘల్‌ సైన్యం రాకను తెలుసుకున్న దుర్గావతి రక్షణాత్మకంగా ఉంటుందని భావించి ‘నరాయ్‌’ అనే ప్రాంతానికి చేరుకొంది. ఇక్కడ ఒకపక్క పర్వత శ్రేణులు ఉండగా మరోపక్క గౌర్, నర్మద నదులు ఉన్నాయి. ఈ లోయలోకి ప్రవేశించిన మొఘల్‌ సైన్యంపై గెరిల్లా దాడులకు దిగింది దుర్గావతి. ఇరువైపులా సైనికులు మరణించారు. దుర్గావతి ఫౌజ్‌దార్‌ అర్జున్‌ దాస్‌ వీరమరణం పొందాడు. ఆమె గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తే సైనికాధికారులు రాత్రి గుడ్డి వెలుతురులో ప్రత్యక్ష యుద్ధం చేయాలని సలహా ఇచ్చారు.

మరుసటిరోజు ఉదయానికి పెద్ద తుపాకులను వాడమని మొఘల్‌ సైన్యాధికారి అసఫ్‌ ఖాన్‌ సైనికులను ఆదేశించాడు. రాణి ఏనుగునెక్కి మొఘల్‌ సైనికులపై విరుచుకుపడింది. యువరాజు వీర్‌ నారాయణ్‌ కూడా యుద్ధరంగంలోకి దూకి మొఘల్‌ సైనికులను మూడుసార్లు వైనక్కి తరిమాడు. కానీ అతడు తీవ్రంగా గాయపడడంతో సురక్షితమైన ప్రదేశానికి వెళ్లిపోయాడు. రాణి దుర్గావతికి కూడా చెవి దగ్గర బాణం తగిలి గాయపడింది.

ఆ తర్వాత ఒక బాణం ఆమె గొంతును చీల్చివేసింది. వెంటనే ఆమె స్పృహ కోల్పోయింది. స్పృహ వచ్చిన తర్వాత ఆమె ఏనుగును తోలే మావటి యుద్ధ రంగం నుంచి సురక్షిత ప్రదేశానికి తప్పించుకు వెళదామని సలహా ఇచ్చాడు. ఆమెకు అపజయం ఖాయం అని అర్థమయ్యింది. శత్రువుకు భయపడి పారిపోవడం లేదా అతడికి చిక్కి మరణించడం అవమానకరం అని భావించి తన సురకత్తిని తీసుకుని పొడుచుకొని ప్రాణాలు వదిలింది రాణి. దీంతో ఒక మహోజ్వల ఆదివాసీ తార నేలకొరిగినట్లయ్యింది.
– గుమ్మడి లక్ష్మీ నారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి

(చదవండి: దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్‌ సారా! చివరికి సుప్రీం కోర్టు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement