ఫోన్‌ కనపడకపోతే.. ప్రాణం పోతోందా? అయితే మీకీ వ్యాధి ఉన్నట్లే! | What Is Nomophobia, Causes, Symptoms, Psychiatrists Warnings And Precautions | Sakshi
Sakshi News home page

Nomophobia Precautions: ఫోన్‌ కనపడకపోతే.. ప్రాణం పోతోందా? అయితే మీకీ వ్యాధి ఉన్నట్లే!

Published Tue, May 21 2024 8:21 AM | Last Updated on Tue, May 21 2024 9:19 AM

Nomophobia High Risk Psychiatrists Warnings And Precautions

ఒక్క నిమిషం.. ఫోన్‌ కనపడదు. చాలా భయం. చాలా ఆందోళన. చాలా కోపం. చాలా వణుకు. ఈ లక్షణాలన్నీ ఉంటే మీకు ‘నో మొబైల్‌ ఫోన్‌ ఫోబియా’ లేదా ‘నోమొఫోబియా’ ఉన్నట్టే. ఇది మీకు చేటు చేస్తుంది. దీన్నుంచి బయటపడమని సైకియాట్రిస్ట్‌లు సూచిస్తున్నారు.

ఇంతకుముందు మనిషి రెండు చేతులు రెండు కాళ్లతో ఉండేవాడు. ఇప్పుడు అతని చేతికి అదనపు అంగం మొలుచుకుని వచ్చింది – మొబైల్‌ ఫోన్‌. అది లేకుండా గతంలో మనిషి బతికాడు. ఇప్పుడూ బతకొచ్చు. కాని మొబైల్‌ ఫోన్‌తో మన వ్యక్తిగత, కుటుంబ, వృత్తిగత, స్నేహ, సాంఘిక సమాచార సంబంధాలన్నీ ముడి పడి ఉన్నాయి కాబట్టి అది కలిగి ఉండక తప్పదు. అలాగని అదే జీవితంగా మారితే నష్టాలూ తప్పవు. ఐదు నిమిషాల సేపు ఫోన్‌ కనిపించకపోతే తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నా, సినిమాకు వెళ్లినప్పుడైనా మూడు గంటల సేపు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేయలేకపోయినా, రాత్రి ఫోన్‌ ఎక్కడో పడేసి మీరు మరెక్కడో నిద్రపోలేకపోయినా, ఎంత ఆత్మీయులొచ్చినా ఫోన్‌ వైపు చూడకుండా దానిని చేతిలో పెట్టుకోకుండా వారితో గడపలేకపోయినా మీకు ‘నోమొ ఫోబియా’ ఉన్నట్టు.

కేస్‌స్టడీ.. 1
ఆఫీస్‌ నుంచి హుషారుగా ఇల్లు చేరుకున్న సుందర్‌ కాసేపటికి బట్టలు మార్చుకుని ముఖం కడుక్కుని రిలాక్స్‌ అయ్యాడు. ఫోన్‌ గుర్తొచ్చింది. టీ పాయ్‌ మీద లేదు. టీవీ ర్యాక్‌ దగ్గర లేదు. కంగారుగా భార్యను పిలిచి ఆమె ఫోన్‌తో రింగ్‌ చేయించాడు. రింగ్‌ వస్తోంది కాని ఇంట్లో ఆ రింగ్‌ వినపడలేదు. సుందర్‌కు చెమటలు పట్టాయి. మైండ్‌ పని చేయలేదు. ఎక్కడ మర్చిపోయాడు. కారు తాళాలు తీసుకుని కిందకు వెళ్లి కారులో వెతికాడు. లేదు. మళ్లీ పైకి వచ్చి ఇల్లంతా వెతికాడు. దారిలో పెట్రోలు పోయించుకున్నాడు... అక్కడేమైనాపోయిందా? మరోచోట ఫ్రూట్స్‌ కొని ఫోన్‌పే చేశాడు. అక్కడ పడేసుకున్నాడా? ఫోన్‌.. మొబైల్‌ ఫోన్‌.. అదిపోతే... అదిపోతే... మైండ్‌ దిమ్మెక్కిపోతోంది. సరిగ్గా అప్పుడే అతని కూతురు వచ్చి రక్షించింది. ‘నాన్నా.. ప్యాంట్‌ జేబులో మర్చిపోయావు. వాల్యూమ్‌ లో అయి ఉంది’ అని. ఫోన్‌ కనపడకపోతే ప్రాణంపోతుంది ఇతనికి. అంటే నోమొ ఫోబియా ఉన్నట్టే.

కేస్‌ స్టడీ.. 2
ఇంటికి చాలా రోజుల తర్వాత గెస్ట్‌లు వచ్చారు. వారు ఎదురుగా కూచుని మాట్లాడుతున్నారు. ఇంటి యజమాని విజయ్‌ ఫోన్‌ చేతిలో పట్టుకుని వారితో మాట్లాడుతున్నాడు. ప్రతి నిమిషానికి ఒకసారి ఫోన్‌ చూస్తున్నాడు. వాళ్లతో మాట్లాడుతూనే ఫేస్‌బుక్‌ స్క్రోల్‌ చేస్తున్నాడు. వాళ్లతో మాట్లాడుతూనే వాట్సప్‌ చెక్‌ చేస్తున్నాడు. వాళ్ల వైపు ఒక నిమిషం ఫోన్‌ వైపు ఒక నిమిషం చూస్తున్నాడు. వాళ్లకు విసుగొచ్చి కాసేపటికి లేచి వెళ్లిపోయారు. విజయ్‌కు నోమొ ఫోబియా ఉంది.

కేస్‌ స్టడీ.. 3
దుర్గారావు ఆఫీస్‌ పని మీద వేరే ఊరు వెళ్లి హోటల్‌లో దిగాడు. దిగాక గాని తెలియలేదు అక్కడ ఫోన్‌ సిగ్నల్స్‌ అందవని. కాల్స్‌ ఏమీ రావడం లేదు. డేటా కూడా సరిగ్గా పని చేయడం లేదు. ఆ ఊళ్లో వేరే మంచి హోటళ్లు లేవు. సిగ్నల్‌ కోసం హోటల్‌ నుంచి గంట గంటకూ బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇక అక్కడ ఉన్నంత సేపు దుర్గారావుకు అస్థిమితమే. చిరాకే. ఏ కాల్‌ మిస్సవుతున్నానో అన్న బెంగే. ఏ మెసేజ్‌ అందడం లేదో అన్న ఆందోళనే. ఇదీ నోమొ ఫోబియానే.

నష్టాలు..
1. నోమొఫోబియా ఉంటే మీ అనుబంధాలు దెబ్బ తింటాయి. ఎందుకంటే అనుబంధాల కంటే ఫోన్‌తో బంధం ముఖ్యమని భావిస్తారు కాబట్టి.
2. నోమొ ఫోబియా మీ లక్ష్యాలపై మీ ఫోకస్‌ను తప్పిస్తుంది. మీరు ఎక్కువసేపు ఒక పని మీద మనసు లగ్నం చేయరు. దీనివల్ల చదువుకునే విద్యార్థి, పని చేయాల్సిన ఉద్యోగి, ఇంటిని చక్కదిద్దే గృహిణి అందరూ క్వాలిటీ వర్క్‌ను నష్టపోతారు. పనులు పెండింగ్‌లో పడతాయి.
3. నోమొ ఫోబియా కలిగిన వారు తమను తాము నమ్ముకోవడం కన్నా ఫోన్‌ను నమ్ముకుంటారు. చివరకు ఫోన్‌ లేకుండా ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టడానికి కూడా ఇష్టపడరు.
4. సోషల్‌ మీడియా సంబంధాలే అసలు సంబంధాలుగా భావించి అసలు సంబంధాలు కోల్పోతారు.
5. ఫోన్‌ ఇతరుల చేతుల్లో పడితే వారు ఏమి ఆరా తీస్తారోనని అనుక్షణం ఫోన్‌ని కనిపెట్టుకుని ఉంటారు.

ఎలా బయటపడాలి?
1. ఖాళీ సమయాల్లో మెల్లమెల్లగా ఫోన్‌ను పక్కన పడేయడంప్రాక్టీస్‌ చేయండి.
2. రోజులో ఒక గంటైనా ఏదో ఒక సమయాన ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేయడం మొదలుపెట్టండి.
3. సినిమాలకు, శుభకార్యాలకు వెళ్లినప్పుడు ఫోన్‌ ఇంట్లో పడేయడమో, మ్యూట్‌ చేసి జేబులో పడేయడమో చేయండి.
4. ఫోన్‌ నుంచి దృష్టి మరల్చే ఆటలు, పుస్తక పఠనం, ఇతర హాబీలపై దృష్టి పెట్టండి.
5. యోగా, ప్రాణాయామం చేయడం మంచిది.
6. ఫోన్‌లో మీ కాంటాక్ట్స్, ముఖ్యమైన ఫొటోలు, ఇతర ముఖ్య సమాచారం పర్సనల్‌ కంప్యూటర్‌లోనో మెయిల్స్‌లోనో నిక్షిప్తం చేసుకుని ఫోన్‌ ఎప్పుడుపోయినా మరో సిమ్‌ కొనుక్కోవచ్చు అనే అవగాహన కలిగి ఉంటే నోమొఫోబియాను దాదాపుగా వదిలించుకోవచ్చు.

ఇవి చదవండి: Fauzia Arshi - ఆకాశమే హద్దు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement