ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి | Sakshi
Sakshi News home page

ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి

Published Wed, May 22 2024 5:32 PM

Meet woman who lives in Indialargest house larger than Mukesh Ambani

విలాసవంతమైన భవనం  అనగానే రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ నివాసం ఆంటిలియా గుర్తొస్తుంది కదా. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసంగా గుర్తింపు పొందిన మరోకటి ఉంది తెలుసా. అది ఎక్కడ ఉంది?  అందులో ఎవరుంటారు.. ఈ వివరాలు తెలుసుకుందాం రండి..!

దాదాపు 600 ఎకరాల్లో ఉండే ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్యాలెస్‌  మన దేశంలోనే ఉంది. బరోడాలోని గైక్వాడ్ కుటుంబానికి చెందిన గుజరాత్‌లోని వడోదరలో ఉన్న  ఈ రాజభవనాన్ని  వీక్షించాలంటే రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు.   ఇది బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ.  దాని పేరు లక్ష్మీ విలాస్‌  ప్యాలెస్‌.

1890లో మరాఠా గైక్వాడ్ వంశస్థులు  దీన్ని నిర్మించారు. శిల్పి  మేజర్ చార్లెస్ మాంట్ ఇండో-సారసెనిక్‌ శైలిలో దీన్ని నిర్మించారు.  176 లగ్జరీ గదులు, కళ్లు చెదిరిపోయేలా హాళ్లు, తోటలు, ఫౌంటెన్‌ ఇలా సర్వ హంగులూ దీని సొంతం.ప్యాలెస్‌లో గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది.  బరోడా పాలకులుగా ఉన్న సమయంలో  1890లో మహారాజా  శాయాజీరావ్ గైక్వాడ్ - III దీన్ని నిర్మించారు. ఈ రాజప్రాసాదాన్ని నిర్మించడానికే సుమారు పన్నెండేళ్లు పట్టిందట. ఇంతకీ ఈ అందమైన రాజభవనం విలువ ఎంతో  తెలుసా? రూ.24,000 కోట్లకు పైమాటే. 

విశేషాలు
3,04,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది లక్ష్మీ విలాస్‌  ప్యాలెస్‌.  బకింగ్‌హామ్ ప్యాలెస్ విస్తీర్ణం 8,28,821 చదరపు అడుగులుమాత్రమే. మహారాజా ఫతే సింగ్ మ్యూజియంలో రాజా రవివర్మకు సంబంధించిన అనేక అరుదైన పెయింటింగ్స్‌ ఉన్నాయి. అంతేకాదు రాజభవనంలో ప్రపంచంలోని ఇతర ప్యాలెస్‌ల కంటే ఎక్కువ గాజు కిటికీలు ప్రత్యేక ఆకర్ణణ అని చెబుతారు. వీటిలో ఎక్కువ గాజు కిటికీలను బెల్జియం నుంచి తీసుకొచ్చారు.

అందమైన రాణి రాధిక రాజే గైక్వాడ్‌
ప్రస్తుతం గైక్వాడ్‌ వంశ కుటుంబానికి సారధి సమర్జిత్‌సిన్హ్ గైక్వాడ్ భార్య, మహారాణి మహారాణి రాధికరాజే గైక్వాడ్ దేశంలోని అత్యంత అందమైన , ఆధునిక రాణులలో ఒకటి గుర్తింపు తెచ్చుకున్నారు. గుజరాత్‌లోని వాంకనేర్‌కు చెందిన రాధిక రాజే 1978, జూలై 19న జన్మించారు. తండ్రి డా. MK రంజిత్‌సిన్హ్ ఝాలా.ఈయన ఐఏఎస్‌ అధికారికావడానికి రాజ్‌షాహి బిరుదును వదులు కున్నారట.

రాధికారాజే గైక్వాడ్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లేడీ శ్రీరామ్ కళాశాల నుండి భారతీయ చరిత్రలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 2002లో మహారాజా సమర్జిత్‌సింగ్ గైక్వాడ్‌తో వివాహానికి ముందు, ఆమె జర్నలిస్టుగా పనిచేశారు. 2012లో లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో జరిగిన సంప్రదాయ వేడుకలో సమర్జిత్‌సిన్హ్ గైక్వాడ్ బరోడా కిరీటాన్ని స్వీకరించారు. ఈ దంపతులకు నారాయణి ,పద్మజ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చేతివృత్తుల కళాకారులు,మహిళల కోసం అనేక ప్రాజెక్టులను చేపడుతూ, వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు రాధికా రాజే

 

Advertisement
 
Advertisement
 
Advertisement