Mann Deshi: ఇప్పుడు ప్రపంచం నా దగ్గరే ఉంది! | Mann Deshi Gives Smartphones To Rural Women To Prevent Digital Gender Gap | Sakshi
Sakshi News home page

Mann Deshi: ఇప్పుడు ప్రపంచం నా దగ్గరే ఉంది!

Published Wed, Sep 29 2021 10:38 AM | Last Updated on Thu, Sep 30 2021 8:39 AM

Mann Deshi Gives Smartphones To Rural Women To Prevent Digital Gender Gap - Sakshi

అనారోగ్యంతో పట్టణంలో ఉన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు లత భర్త. ఊళ్లో ఉన్న భార్య ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. భర్త గురించే ఆమె ఆలోచనలన్నీ... ఎలా ఉన్నాడో ఏమో! భర్త దగ్గర మాత్రమే సెల్‌ఫోన్‌ ఉంది. లత దగ్గర లేదు. తనకు అవసరం అని కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే భర్త తన ఫోన్‌ ఇచ్చేవాడు. అలాంటి లత చేతిలోకి ఇప్పుడు సెల్‌ఫోన్‌ వచ్చింది. దాంతో గతంలో మాదిరిగా ఆమె ఇతరుల మీద ఆధారపడడం లేదు. తానే భర్తకు ఫోన్‌ చేసే మాట్లాడుతుంది. వీడియో కాల్స్‌ మాట్లాడడం కూడా నేర్చుకుంది. లతది మహారాష్ట్రలోని నింబోర గ్రామం. 

ఇప్పుడు అదే మహారాష్ట్రలో భానుపూరి గ్రామానికి వెళదాం...జ్యోతి దేవ్‌కర్‌ చిన్నపాటి కిరాణా దుకాణం నడుపుతుంది. తాను కూడా ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే భర్త ఫోన్‌పైనే ఆధారపడేది. ఇప్పుడు తన దగ్గర కొత్త ఫోన్‌ ఉంది. మాట్లాడడమే కాదు మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన వస్తువుల గురించి తెలుసుకోవడం నుంచి ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ వరకు ఎన్నో విషయాలు నేర్చుకుంది. ఇదే గ్రామానికి చెందిన పూర్ణ కూలి పనులు చేసుకుంటుంది. అంతో ఇంతో చదువువచ్చు.

ఒకప్పుడు సెల్‌ఫోన్‌లో ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే...ఎవరినో ఒకరిని బతిమిలాడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆమె చేతిలో కొత్త ఫోన్‌. ‘మాట్లాడడం మాత్రమే కాదు, ప్రపంచంలో ఏంజరుగుతుందో తెలుసుకో గలుగుతున్నాను’ అంటుంది పూర్ణ.

ఉన్నట్టుండి వీరి చేతిలోకి ఫోన్లు ఎలా వచ్చాయి? సతార జిల్లా (మహారాష్ట్ర) కేంద్రంగా పనిచేసే ‘మన్‌దేశీ’ అనే స్వచ్ఛంద సంస్థ వీరికి మాత్రమే కాదు ఎంతోమంది పేద మహిళలకు సెల్‌ఫోన్‌లను ఉచితంగా ఇచ్చింది. ఇవ్వడమే కాదు ఫోన్‌ ఎలా ఆపరేట్‌ చేయాలో కూడా నేర్పించింది.

‘నాకంటూ సెల్‌ఫోన్‌లేదు..అని ఈరోజుల్లో ఎవరూ అనరు’ అనుకుంటాంగానీ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళితే సెల్‌ఫోన్‌లేని పేద మహిళలు, వాటి గురించి ఏమీ తెలియని మహిళలు ఎంతోమంది ఉన్నారు. మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ‘డిజిటల్‌ జెండర్‌ గ్యాప్‌’ ఎక్కువగా ఉందని రకరకాల రిపోర్ట్‌లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని పేదమహిళలకు ఉచితంగా సెల్‌ఫోన్‌లు ఇచ్చింది మన్‌దేశీ.

విచిత్రమేమిటంటే ఉచితంగా ఇచ్చినా ‘ఈ ఫోన్లతో మేమేం చేసుకోవాలమ్మా’ అనేంత అమాయకులు కూడా ఉన్నారు. అలాంటి వారికి సెల్‌ఫోన్‌ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో, సులభంగా ఎలా ఆపరేట్‌ చేయాలో నేర్పించారు.

‘తీసుకోవాలా వద్దా? అని మా భర్తను అడిగి చెబుతాను’ అనే మాట చాలామంది నోటి నుంచి వినిపిస్తుంది. మహారాష్ట్ర, బిహార్, రాజస్థాన్‌...మొదలైన రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో మహిళలు సెల్‌ఫోన్‌ వాడడంపై అప్రకటిత నిషేధం ఉంది. కొన్ని గ్రామీణప్రాంతాల్లో ‘మహిళలు వాడకూడదు’ అంటూ సెల్‌ఫోన్‌లపై నిషేధాలు కూడా ఉన్నాయి. ఈ కారణం వల్లే కావచ్చు...ఫోన్‌ కొనగలిగే స్థాయి ఉండికూడా కొనలేకపోవడం. దీనికితోడు వారెవ్వరికీ దానిని ఆపరేట్‌ చేయడం కూడా రాదు. 

బిహార్‌లోని కిషన్‌గంజ్‌ జిల్లాలో ఉన్న సుందర్‌బడి గ్రామంలో పెళ్లికాని అమ్మాయిలు సెల్‌ఫోన్‌ వాడితే రెండు వేలు, పెళ్లయిన మహిళలు వాడితే పదివేల రూపాయల జరిమానా విధిస్తారట! అందుకే...సెల్‌ఫోన్‌ ఇవ్వడం మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్న అపోహలను తొలగించే కాన్యాచరణ కూడా చేపట్టింది మన్‌దేశీ.  ఫలితంగా ఎంతో మందిలో  మార్పు వచ్చింది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకుచ్చి ప్రపంచంతో అనుసంధానం కావడానికి సెల్‌ఫోన్‌ ఎలా ఉపయోగపడుతుంది అనేదానిపై విస్తృత ప్రచారం చేస్తుంది మన్‌దేశీ.

చదవండి: Social Star: పైజమా పాప్‌స్టార్‌ శిర్లే సెటియా.. ఆర్జే నుంచి సింగర్‌గా..  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement