Know How Much Has Mobile Phones Usage Increased, What Are The Risk Of Mobile Phone Addiction - Sakshi
Sakshi News home page

పోయేకాలం వచ్చింది.. అన్నీ మొబైల్‌లోనే, ఆఖరికి కాపురాలు కూడా ఆన్‌లైన్‌లోనే!

Published Thu, Jun 22 2023 4:50 PM | Last Updated on Fri, Jul 14 2023 4:18 PM

Know How Much Has Mobile Phones Usage Increased, Risk Of Mobile Phone Addiction - Sakshi

మా ఊరు రాయికల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో ( 1956-68) కే వీ రాజు గారుమా తెలుగు సారు. మంచి జోకులు వేస్తూ పాఠాలు చెప్పేవాడు కాబట్టి ఆయన క్లాస్ ఎప్పుడూ నిండుగా ఉండేది. 'పిచ్చి సన్నాసి' అన్నది ఆయనకు ఊతపదం. మీరు మా అందరినీ పిచ్చోళ్ళనే అంటున్నారు మాలో అసలు పిచ్చోడు ఎవడు సార్!అని అడిగాం ఒక రోజు. 'ఎవడైతే ఒంటరిగా కూర్చొని తనలో తాను నవ్వుకుంటూ, తనతో తాను మాట్లాడుకుంటాడో, చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తాడో వాడేరా ఏక్ నెంబర్ పిచ్చోడు!' అన్నాడాయన.

ఇది దాదాపు అరవై సంవత్సరాల నాటి విషయం. మా మాస్టారు చెప్పిన లక్షణాలనుబట్టి చూస్తే ఇప్పుడు అలాంటివాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పాలి. రోడ్లమీద,బస్స్టాప్ ల దగ్గర,పార్కులు పబ్లిక్ స్థలాల్లో, కార్యాలయాల్లో ఇందుగలరందు లేరన్నట్లుగా ఎక్కడ చూసినా ఒంటరిగా పరిసరాలను, చేయాల్సిన పనులను కూడా మరిచిపోయి చెవి పుల్ల తగిలించుకొని, చూపుడు వెలుతో ప్రపంచాన్ని చుట్టేస్తూ తమలో తామే నవ్వుకుంటూ, తమతో తామే గంటలు గంటలు మాట్లాడుకుంటున్నట్లు కనబడే సెల్ ఫోన్ పిచ్చిగాళ్ళు విచ్చలవిడిగా కనబడుతున్నారు, ఎవరి పిచ్చి వారికానందం !

మొబైల్‌ వ్యసనంగా మారిన తర్వాత వచ్చిన దుష్పరిణామాలు

1. జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోయింది 
(గతంలో కనీసం 50 లాండ్‌లైన్‌ నెంబర్లు గుర్తుండేవి), ఇప్పుడు దేనికయినా కాంటాక్ట్స్‌లోకి వెళ్లి పేరు, ఫోటో చూసి నొక్కడమే.

2. మెదడుకు మేత అసలే లేదు 
ఇప్పుడు ఏదయినా మొబైలే. కాలిక్యులేటర్‌ మొబైల్‌లోనే, క్యాలెండర్‌ మొబైల్‌లోనే, పెయింట్‌, ఆర్ట్‌, ఎడిటింగ్‌ అన్నీ AI సహకారంతోనే. అంటే నీ మెదడుకు పని చెప్పడమే లేదు. మేత వేయనప్పుడు.. మెదడు కూడా పని చేయడం మానేస్తుంది. 

3. సృజనాత్మకత ప్రదర్శించే అవకాశమే లేదు
మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలన్నది నాటి మాట. జీవితాల్లోకి మొబైల్‌ ఎంటరయ్యాక.. మరొకరిని చూసి ఫాలో కావడమే తప్ప మనలో జ్ఞానం వికసించేది చాలా తక్కువ. కోటిలో ఒకరు బాగుపడితే.. మిగతా అంతా దానికి బానిసలవుతున్నారు.

4. రుచిని గ్రహించే సమయం లేదు
ఏం తింటున్నామన్నా స్పృహనే లేదు, తింటున్నంత సేపు చేతిలో మొబైల్‌, తల తీసుకెళ్లి స్క్రీన్‌లో పెట్టడమా. మన ముందున్న ప్లేట్‌లో ఏముంది, దాని రుచి ఏంటీ? అది ఎలా తినాలి? ఏం తెలియట్లేదు. నోట్లోకి నెట్టడం, కడుపులోకి కుక్కడం.. 

5. సెల్‌కు జై, బంధుత్వాలకు బై బై
గతంలో సెలవులు వస్తే.. ఊళ్లకు వెళ్లి బంధువులతో, మిత్రులతో గడిపేవాళ్లు. ఇప్పుడిది బాగా తగ్గింది. ఎవడి సెల్‌ వాడికి లోకం. సినిమాలు, క్రికెట్‌, చాటింగ్‌లు అన్నీ మొబైల్‌లోనే..

6. సర్వం సెల్‌ మయం
తినాలంటే మొబైల్‌లో ఆర్డర్‌, చదువుకోవాలంటే మొబైల్‌లో ఆన్‌లైన్‌ క్లాస్‌లు, ఆఫీస్‌ మీటింగ్‌లు మొబైల్‌లో వర్చువల్‌, ఇంకా రేపు స్పర్శ కూడా తెస్తారట. అప్పుడు కాపురాలు కూడా ఆన్‌లైన్‌లో ఉంటాయేమో. 
పోయేకాలం.. మొబైల్‌ రూపంలో దాపురిస్తే.. ఎవరేం చేయగలరు. కే వీ రాజు గారు పిచ్చి సన్నాసి అన్నది ప్రత్యేకంగా ఇప్పుడు ఒకరిని ఉద్దేశించే అవసరమే లేదు. 

వేముల ప్రభాకర్, హైదరాబాద్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement