ముత్తు నందిని ప్యాలెస్‌ ఇష్టాల ఇల్లు Jayalakshmi explained about Muthunandhini Palace in Kanyakumari | Sakshi
Sakshi News home page

ముత్తు నందిని ప్యాలెస్‌ ఇష్టాల ఇల్లు

Published Fri, Mar 29 2024 2:46 AM | Last Updated on Fri, Mar 29 2024 2:47 AM

Jayalakshmi explained about Muthunandhini Palace in Kanyakumari - Sakshi

రాజ్‌ చందర్‌ పద్మనాభన్, నాగ జయలక్ష్మి దంపతులు తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారిలో నివసించేవారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో వీరు అనుసరించిన విధానం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. పర్యావరణ ప్రేమికులనైతే మరీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. రెండేళ్ల కిందట గృహప్రవేశం చేసుకున్న కొత్త ఇల్లది. అయితే ఆ ఇంట్లో అడుగుపెడితే కాలం గిర్రున సినిమా రీల్‌లాగ వందేళ్ల వెనక్కి తిరిగిపోయిందా అనిపిస్తుంది.

ఇంటిని చూడడానికి వచ్చిన వాళ్లను అతిథి మర్యాదలతో ముంచెత్తుతారు ఈ దంపతులు. సేంద్రియ పద్ధతిలో పండించిన దినుసులు, కాయగూరలతో సంప్రదాయ తమిళ, చెట్టినాడు వంటలను వడ్డిస్తారు.   ఎర్రమట్టి, సున్నపు రాయితో నిర్మించిన ఇంట్లో భూగర్భ జలాలను పరిరక్షించే ఏర్పాటు ఉంది. బంకమట్టి నిర్మాణం కావడంతో ఎండాకాలం చల్లగా ఉంటుంది. నేచర్‌ ఫ్రెండ్లీ ట్రావెల్‌ను ఇష్టపడే వాళ్లు ఇక్కడ బస చేస్తుంటారు. బస చేయకపోయినా చూసి పోవడానికి వచ్చేవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ కాలంలో ఇంటిని ఇలా ఎందుకు కట్టుకున్నారనే ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతుంటుంది. జయలక్ష్మి ప్రతి ఒక్కరికీ పూసగుచ్చినట్లు వివరిస్తుంటుంది. 

 
బాల్యంలోకి వెళ్లారాయన! 
‘‘రాజ్‌చందర్‌ వృత్తిరీత్యా జియో డాటా అనలిస్ట్‌. ఆయనకు ఇష్టమైన రోజులంటే చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ గారింట్లో గడిపిన బాల్యమే. పైగా రాజ్‌ అభిరుచి, విధి నిర్వహణ కూడా పర్యావరణవేత్తలతో కలిసి పని చేయడమే. ఈ రెండు ఇష్టాలను కలుపుతూ చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ చెప్పేవారు. నాక్కూడా మా సంప్రదాయ నిర్మాణంలో ఉండే సౌందర్యం చాలా ఇష్టం. ఇద్దరి అభిరుచులూ కలవడంతో ఇంటిని ఇలా కట్టుకున్నాం. మా ఇద్దరి ఇష్టాల మేరకు ఎలా కట్టుకోవాలో ఒక ఐడియా వచ్చేసింది. ఎక్కడ కట్టాలనే విషయంలో ఒక అభిప్రాయానికి రావడం కొంచెం కష్టమే అయింది. లొకేషన్‌ సెర్చింగ్‌ మొదలు పెట్టాం. 


సంజీవని శకలం 
కన్యాకుమారికి సమీపంలో పోథయాడి గ్రామాన్ని చూసినప్పుడు కొండలు, పచ్చటి చెట్లతో ప్రదేశం బాగుందనిపించింది. ఆశ్చర్యంగా మరో విషయం తెలిసింది. అదేంటంటే... రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు వైద్యం కోసం హనుమంతుడు ఏకంగా సంజీవని మొక్క ఉన్న పర్వతం అంతటినీ ఎత్తుకొచ్చాడని విన్నాం. వైద్యం చేసిన తర్వాత ఆ పర్వతాన్ని తిరిగి తీసుకెళ్లే క్రమంలో పర్వతంలోని ఒక శకలం విరిగి కింద పడి పోయిందని, ఆ శకలమే ఈ కొండ అని చె΄్పారు స్థానికులు. వాళ్ల విశ్వాసాన్ని పక్కన పెడితే ఆ కొండమీద చుట్టు పక్కల ఉన్న మొక్కలన్నీ ఔషధ మొక్కలే. ప్రకృతితో మమేకమై నివసించడానికి మాకు ఇంతకంటే సౌకర్యవంతమైన ప్రదేశం మరోటి ఉండదేమో అనిపించింది. అంతే... 2021లో నిర్మాణం మొదలు పెట్టాం.

ఒక ఏడాదిలో తమిళ, వేనాడు, చెట్టినాడు సంస్కృతుల సమ్మేళనమైన మా ఇంటి నిర్మాణం పూర్తయింది. సంప్రదాయ కళాకృతుల సేకరణ నా హాబీ. ఇంటిని తమిళ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా మలిచాను. ఇంటి ముఖద్వారం నుంచి నేల, గోడ, మెట్లు, పై కప్పు, అలంకరణ వస్తువులు ప్రతి ఒక్కటీ తమ వైభవాన్ని తామే చెప్పుకుంటాయి. పర్యావరణ హితమైన సున్నపు పోడి ఇటుకలు, ఎర్ర మట్టి, ఆవుపేడ, ధాన్యం పోట్టు, కోడిగుడ్లు, బెల్లంతోపాటు అత్తంగుడి నది తీరాన దొరికే ఇసుకతో తయారు చేసే అత్తంగుడి టైల్స్‌ను వాడాం.

పై కప్పుకి కాంక్రీట్‌ వాడకాన్ని తగ్గించి ఫిల్లర్‌ స్లాబ్‌ టెక్నిక్‌ ఉపయోగించాం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ పిట్, కరెంటుకోసం సోలార్‌ ప్యానెల్స్‌ పెట్టాం. ఈ మట్టి సౌధంలో 5బెడ్‌ రూమ్‌లు, మూడు బాల్కనీలు, మూడు లివింగ్‌ స్పేస్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా పర్యాటకులు ఈ హోమ్‌ స్టేలో బస చేశారు. ఆహారం కూడా తమిళనాటప్రాంంతాల వారీగా విలసిల్లిన విభిన్నమైన రుచులుంటాయి. ఇంటి ఆవరణలో అన్ని రకాల కూరగాయలనూ పండిస్తాం. వంటగదిలో వచ్చే వ్యర్థాలనే ఎరువుగా వేస్తాం’’ అని తమ పర్యావరణ హిత భవనం ముత్తు నందిని ప్యాలెస్‌ గురించి వివరించింది జయలక్ష్మి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement