Jalaja, Devika and Surya: లారీలో దేశాన్ని చుట్టేస్తున్నారు! Jalaja, Devika and Surya meet women trio that travelled through 22 states on cargo lorry | Sakshi
Sakshi News home page

Jalaja, Devika and Surya: లారీలో దేశాన్ని చుట్టేస్తున్నారు!

Published Thu, Jun 13 2024 12:53 AM | Last Updated on Thu, Jun 13 2024 12:59 PM

Jalaja, Devika and Surya meet women trio that travelled through 22 states on cargo lorry

మహిళా శక్తి

ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు జలజ, దేవిక, సూర్య హెవీ వెహికిల్‌ డ్రైవింగ్‌ నేర్చుకొని, లైసెన్స్‌ పొందారు.  లారీలో ఫ్లైవుడ్, ఉల్లి, అల్లం లోడ్‌ను తీసుకెళుతూ
దేశంలోని 22 రాష్ట్రాలలో ప్రయాణించారు.  జలజ, దేవిక తల్లీకూతుళ్లు.  

జలజ తోడికోడలు సూర్య.  ఈ ముగ్గురూ ఆసక్తితో నేర్చుకున్న ట్రక్కు డ్రైవింగ్‌తో తమ ప్రయాణ విశేషాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ  దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు.  కేరళవాసులైన ఈ ముగ్గురు మహిళలు చేస్తున్న సాహస ప్రయాణం   చాలామందిలో కొత్త ఉత్సాహం నింపుతోంది.

కేరళలోని ఎట్టుమనూరుకు చెందిన రతీష్‌ పుథెట్‌ లారీ ట్రాన్స్‌పోర్ట్‌ యజమాని. అతని ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థలో 30 లారీలు ఉన్నాయి. రతీష్‌ 19వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య జలజకు తన ట్రక్కు తాళాలను ఇచ్చాడు. రెండేళ్ల క్రితం ఫిబ్రవరిలో ఆమె రతీష్‌తో కలిసి ట్రక్కులో కాశ్మీర్‌కు బయల్దేరింది. ఆ సమయంలోనే తనకూ డ్రైవింగ్‌ చేయాలనే ఆసక్తి కలిగింది. 

2014లో ఫోర్‌ వీలర్‌ లైసెన్స్‌ తీసుకున్నా ఆ తర్వాత నాలుగేళ్లకు 2018లోనే జలజ హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందింది. మొదటిసారి పెరుంబవూరు నుండి ఫ్లైవుడ్‌ తీసుకొని లారీలో పుణేకి మొదటి ప్రయాణం చేసింది. అక్కడ నుంచి కశ్మీరుకు ఉల్లిపాయల లోడు తీసుకెళ్లింది. ‘ఈ ప్రయాణాలు నాలో ధైర్యాన్ని నింపాయి. 

ఒక మహిళ డ్రైవింగ్‌ సీట్లో ఉండటంతో ఇతర డ్రైవర్లు, పోలీసు అధికారులు గౌరవంగా చూసేవారు. స్థానికులు కూడా ఆసక్తిగా చూసేవారు. కాశ్మీర్‌ ప్రయాణానికి ఆరు రోజులు వెళ్లడానికి, మరో ఆరు రోజులు తిరిగి రావడానికి సమయం పట్టింది. మధ్యలో కొండచరియలు విరిగిపడటంతో లారీలు వెళ్లేందుకు వీలు కాలేదు. లారీలన్నింటికీ ఇతర రాష్ట్రాల డ్రైవర్లు ఉన్నారు. ఏ సమస్యా రాలేదు. 

దేశవ్యాప్తంగా వివిధ రకాల వ్యక్తులు, వారి జీవనశైలి, ఆహారపుటలవాట్లు... ఇలా ప్రతిదానినీ అర్ధం చేసుకోవడానికి ఈ ప్రయాణాలు నాకు బాగా తోడ్పడుతున్నాయి. వివిధ రాష్ట్రాల భాష ముఖ్యంగా హిందీ నేర్చుకుంటున్నాను’ అని చెబుతోంది జలజ. కాశ్మీర్‌ వరకు జలజ ట్రక్‌ డ్రైవింగ్‌ చేయడంతో ఇంట్లో మరో ఇద్దరు మహిళలు డ్రైవింగ్‌ పట్ల ఆసక్తి చూపారు. 

జలజ కూతురు దేవిక డిగ్రీ చదువుతోంది. రతీష్‌ తమ్ముడి భార్య సూర్య. వీళ్లూ హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందారు. దీంతో రతీష్‌ కూడా చాలా ఆనందించాడు. వీరు ముగ్గురూ కలిసి పుథెట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వ్లాగ్‌ను ్రపారంభించారు. ముగ్గురు మహిళలూ తాము చేసే లారీ ప్రయాణాల వివరాలను అందులో ఉంచుతున్నారు. దేవిక లడఖ్‌ ప్రయాణంలో 5,900 కిలోమీటర్లు ట్రక్కును నడిపింది. 

లారీ డ్రైవింగ్‌తో కేరళ నుంచి కాశ్మీర్‌ ప్రయాణం చేసిన జలజ ఆ తర్వాత మహారాష్ట్ర, నేపాల్‌కు వెళ్లింది. హరిద్వార్, రిషికేశ్‌లో పర్యటిస్తున్నప్పుడు రతీష్‌ తల్లి లీలాను వెంట తీసుకెళ్లింది. దేవిక ఎర్నాకులం రాజగిరి కాలేజీలో హెవీ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన ఏకైక స్టూడెంట్‌గా పేరొందింది. కోడలు గోపిక లైసెన్స్‌ కోసం ఎదురుచూస్తోంది. రతీష్, జలజ లది ఉమ్మడి కుటుంబం. పాతికేళ్లక్రితమే ఎట్టుమనూరుకు వలస వచ్చాడు. 

ఒకే ఇంట్లో ఉంటున్న జలజ, సూర్య, దేవిక కిందటి మే నెలలో లక్నో, షిల్లాంగ్‌ ట్రిప్పులలో డ్రైవర్లుగా ఉన్నారు. వీరికి తోడుగా సూర్య పిల్లలు గోపిక,  మరో ముగ్గురు పిల్లలూ చేరారు. లారీ క్యాబిన్‌లో ఏసీని అమర్చారు. పడుకోవడానికి, కూర్చోవడానికి, రోడ్డు పక్కన వంట చేసుకోవడానికి అవసరమైన వస్తువులను తీసుకెళతారు.

 ‘ఎక్కడా ఇబ్బంది కలగకుండా లారీని ఇల్లులా తయారు చేసుకున్నాం’ అని చెబుతారు ఈ ముగ్గురు మహిళలు. ట్రక్కులలో లోడ్లను గమ్యస్థానాలకు తరలించడమే కాదు, కుటుంబం అంతా కలిసి యాత్రలు చేస్తుంటారు. ఈ యాత్రలో జలజ, సూర్యల కుటుంబసభ్యులు ఉంటారు. తమ యాత్ర వీడియోలను, ఫొటోలను సోషల్‌మీడియా ద్వారా పోస్ట్‌ చేస్తుంటారు. వీరికి దాదాపు మూడున్నర లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ మహిళా లారీ డ్రైవర్లకు ఉన్న అభిమానుల్లో విదేశీయులూ ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement