తెలియనితనంలో ఉండే బలం ప్రతిఘటనే! Indian-American Student Shruthi Kumar Slams Harvard Over Response to Gaza Protests | Sakshi
Sakshi News home page

తెలియనితనంలో ఉండే బలం ప్రతిఘటనే!

Published Fri, May 31 2024 6:23 AM | Last Updated on Fri, May 31 2024 10:07 AM

Indian-American Student Shruthi Kumar Slams Harvard Over Response to Gaza Protests

నోరు మూయించి పెత్తనం చేసే పాలకులు నోరు మూసుకుని బతికే ΄పౌరులు చరిత్ర నిండా ఉంటారు. కాని నోరు మూసుకొని ఉండటం చేతగాక అన్యాయాన్ని చూస్తూ ఉండలేక గొంతెత్తి గర్జించేవాళ్లు చరిత్రలో నిలబడిపోతారు. మన దేశ మూలాలున్న హార్వర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థిని శ్రుతి కుమార్‌– ఆ ప్రతిష్టాత్మక ్రపాంగణంలో గాజా మీద ఇజ్రాయిల్‌ చేస్తున్న పాశవిక దాడులకు వ్యతిరేకంగా నోరు విప్పింది.  ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది. వెనుకంజ వేయని మానవత్వం చాటిన శ్రుతి కుమార్‌ పరిచయం, నేపథ్యం.

హార్వర్డ్‌ యూనివర్సిటీ తన విద్యార్థుల గురించి సరిగ్గా అధ్యయనం చేసినట్టు లేదు. చేసి ఉంటే బహుశా శ్రుతి కుమార్‌కు ఆ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్‌ వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండేది కాదు. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్‌ సెరెమొనీలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు, బంధుమిత్రులు విశేషంగా హాజరయ్యి వేదిక మీద పట్టా అందుకుంటున్న తమ  పిల్లలను హర్షధ్వానాలతో ఉత్సాహపరుస్తారు. హార్వర్డ్‌ యూనివర్శిటీలో ప్రతి ఏటా ఈ సెర్మనీలో పట్టా పొందుతున్న ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి వారికి ప్రసంగించే అవకాశం ఇస్తారు. ఈసారి ప్రసంగం చేసే అవకాశం శ్రుతి కుమార్‌కు వచ్చింది. అక్కడే ఆమెకు గొంతెత్తే అవకాశం లభించింది.

నిరసనల నేపథ్యం
అక్టోబర్‌ 7, 2023న హమాస్‌ సంస్థ ఇజ్రాయిల్‌ మీద దాడి చేసి 1400 ఇజ్రాయిలీల మరణానికి కారణం కావడంతో బదులు తీర్చుకోవడానికి రంగంలో దిగిన ఇజ్రాయిల్‌ నేటికీ ఆగని బాంబుల వర్షం కురిపిస్తూ ఉంది. ఇప్పటికి 35,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా వీరిలో కనీసం ఇరవై వేల మంది స్త్రీలు, పసి పిల్లలు. ఈ దాడులు మొదలైనప్పటి నుంచి అమెరికా యూనివర్సిటీల్లో నిరసనలు మొదలైనా ఇజ్రాయిల్‌ మరింత దుర్మార్గంగా గాజాలోని ఆస్పత్రుల పై, స్కూళ్లపై దాడులు చేస్తుండటంతో ఇక విద్యార్థులు ఆగలేకపోయారు. ఏప్రిల్‌ నుంచి అమెరికా విశ్వవిద్యాలయాలు ‘యాంటీ ఇజ్రాయిల్‌’ నిరసనలతో హోరెత్తాయి. యూనివర్సిటీలు దిక్కుతోచక పోలీసులను ఆశ్రయిస్తే ఇప్పటికి 900 మంది విద్యార్థులు అరెస్ట్‌ అయ్యారు. వారిలో ఒక భారతీయ విద్యార్థిని కూడా ఉంది. 

అమెరికా యూనివర్సిటీలు తమ దగ్గర పోగయ్యే ఫండ్స్‌ను ఇజ్రాయిల్‌కు వంత పాడే బహుళ జాతి వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం మానేయాలని, ఆ డబ్బును వెనక్కు తీసుకోవాలనేది విద్యార్థుల ప్రధాన డిమాండ్‌. అంతే కాదు టెల్‌ అవివ్‌ (ఇజ్రాయిల్‌) యూనివర్సిటీతో కోర్సుల ఆదాన ప్రదానాలు చేసుకోవడం బంద్‌ చేయాలని కూడా డిమాండ్‌. ఏప్రిల్‌ 18న ఇదే విషయంలో హార్వర్డ్‌ యూనివర్సిటీలో భారీ నిరసన జరిగింది. విద్యార్థులు ఏకంగా మూడు చోట్ల పాలస్తీనా జెండాను ఎగురవేశారు. దాంతో యూనివర్సిటీ కన్నెర్ర చేసి ‘వయొలేషన్‌ ఆఫ్‌ యూనివర్సిటీ పాలసీ’ కింద 13 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్లు కాకుండా శిక్షించింది. అదే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన శ్రుతి కుమార్‌ ఈ అంశం మీద నిరసన వ్యక్తం చేసేందుకు గ్రాడ్యుయేషన్‌ సెర్మనీని ఎంచుకుంది.

ఆమె ఒక టోర్నడో
బీభత్సమైన పిడుగుపాట్లకూ, టోర్నడోలకు పేరు పెట్టిన నెబ్రాస్కా (అమెరికా) రాష్ట్రంలో పుట్టిన కన్నడ మూలాలున్న అమ్మాయి శృతి కుమార్‌. అక్కడ విస్తారంగా సాగు చేసే జొన్నరైతుకు పెద్ద కూతురు ఆమె. చదువుతో పాటు ఆట, పాట, మాటలో కూడా ఆసక్తి చూపింది. మంచి వక్త. ‘నేషనల్‌ స్పీచ్‌ అండ్‌ డిబేట్‌ –2019’లో పాల్గొని ఐదవ ర్యాంకులో నిలిచింది. 2020లో ‘వాయిస్‌ ఆఫ్‌ డెమొక్రసీ’ పోటీలో మొదటి విజేతగా నిలిచి 30 వేల డాలర్లు గెలుచుకుంది. అంతేకాదు తన చదువుకు స్పాన్సర్‌ని కూడా. యోగాలో దిట్ట. ముందు నుంచి అన్యాయాల, అపసవ్యతల మీద వ్యతిరేకత తెలిపే అలవాటున్న శ్రుతి కుమార్‌కు హార్వర్డ్‌ అవకాశం ఇవ్వడంతో ఆ యూనివర్సిటీనే హెచ్చరించి ఖంగు తినిపించింది.

తెలియనితనపు బలం
హార్వర్డ్‌ గ్రాడ్యుయేషన్‌ సెర్మనీలో శ్రుతి కుమార్‌ తన ప్రసంగానికి పెట్టుకున్న పేరు ‘తెలియనితనంలో ఉండే బలం’. ఆమె తన ప్రసంగం చేస్తూ ‘ప్రపంచంలో ఆర్గనైజ్డ్‌గా జరుగుతున్న అన్యాయాల గురించి అన్నీ తెలిసి నోరు మెదపని వారి కంటే ఏమీ తెలియకనే అది అన్యాయమనే కేవలం గ్రహింపుతో బరిలోకి దిగి ఎదిరించే నాలాంటి విద్యార్థులకు ఉండే బలం పెద్దది’ అని అంది. ‘పసిపిల్లల వంటి అమాయకత్వంతో కొత్త జన్మెత్తి అన్యాయాలను ప్రతిఘటించడానికి ముందుకు రావాలనే’ అర్థంలో శ్రుతి కుమార్‌ మాట్లాడి హర్షధ్వానాలు అందుకుంది. 

‘మన విశ్వవిద్యాలయ ్రపాంగణంలో భావ ప్రకటనా స్వేచ్చపట్ల వ్యక్తమైన అసహనాన్ని చూసి నేను చాలా నిరాశకు గురవుతున్నాను. 13 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్లు కాకుండా ఆపారు. దీనిని వ్యతిరేకిస్తూ పదిహేను వందల మంది విద్యార్థులం, ఐదు వందల మంది అధ్యాపకులం ఖండించాం. విశ్వవిద్యాలయ యాజమాన్యానికి అభ్యర్థనలు పంపాం. అయినా సరే వినలేదు. హార్వర్డ్, మా మాటలు నీకు వినబడుతున్నాయా? హార్వర్డ్, మా మాటలు వింటున్నావా?’ అని శ్రుతి గర్జించింది. ‘ఇప్పుడు గాజాలో జరుగుతున్న ఘటనల మీద  క్యాంపస్‌ మొత్తంగా దుఃఖం, అనిశ్చితి, అశాంతి చూస్తున్నాను. సరిగ్గా ఇప్పుడే ఇటువంటి క్షణంలోనే తెలియనితనపు శక్తి కీలకమైన దవుతుంది’ అందామె.

పర్యవసానాలను గురించి వెరవక శ్రుతి ఈ ప్రసంగం చేసింది. యూనివర్సిటీకి తాను ఇచ్చిన ప్రసంగం పేజీలలో లేనిదాన్ని మధ్యలో ఇమిడ్చి ధైర్యంగా మాట్లాడింది. నిజం చె΄్పాలంటే శ్రుతి అన్ని దేశాల విద్యార్థులకు, ప్రజలకు పిలుపునిస్తోంది. అన్నీ తెలిసి ఊరికే ఉండటం కన్నా, ఏమీ తెలియకనే ‘అన్యాయం’ అనిపించినప్పుడు వెంటనే గొంతెత్తాలని సందేశం ఇస్తోంది.

ఆమె ప్రసంగంలో కొంత
‘నేడు ఈ ఉత్సవం మనకు తెలిసినదాని కోసం చేస్తున్నారు. మనకు ఏం తెలుసో దానిని ప్రశంసిస్తున్నారు.   కాని తెలియనితనపు బలం ఒకటుంటుంది. నేనిక్కడికి (హార్వర్డ్‌) వచ్చేవరకూ ‘విజ్ఞానశాస్త్ర చరిత్ర’ అనే పాఠ్యాంశం ఉన్నదనేదే నాకు తెలియదు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఆ శాఖ నుంచి నేను గ్రాడ్యుయేట్‌ నయ్యాను. చరిత్రంటే మనకు తెలిసిన కథల గురించి ఎంత చదవాలో... తెలియని కథల గురించి కూడా అంత చదవాలని ఇక్కడే తెలుసుకున్నాను’
(మరికొంతసేపు మాట్లాడి తన దుస్తులలో నుంచి చిన్న కాగితం తీసి ప్రధాన ప్రసంగానికి విరామం ఇచ్చి ఇలా మాట్లాడింది)     

‘నా నాల్గవ సంవత్సరం చదువులో యూనివర్సిటీలో మా భావ ప్రకటనా స్వేచ్ఛ, మా నిరసన ప్రదర్శనా స్వేచ్ఛ నేరాలుగా మారిపోయాయి. నేనిక్కడ ఇవాళ మీ ముందు నిలబడి నా సహ విద్యార్థులైన పదమూడు మంది అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులను గుర్తు చేసుకోవాలి. ఆ పదమూడు మంది అండర్‌ గ్రాడ్యుయేట్లు ఇవాళ పట్టభద్రులు కాలేకపోతున్నారు. మన విశ్వవిద్యాలయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పట్ల వ్యక్తమైన అసహనం ఫలితం ఇది. దీనికి నేను చాలా నిరాశæ చెందుతున్నాను. పదిహేను వందల మంది విద్యార్థులం, ఐదువందల మంది అధ్యాపకులం ఈ అసహనాన్ని ఖండించాం. యాజమాన్యానికి అభ్యర్థనలు పంపాం. విద్యార్థులు మాట్లాడినా అధ్యాపకులు మాట్లాడినా అదంతా ఈ క్యాంపస్‌లో స్వేచ్ఛ గురించే. ΄పౌరహక్కుల గురించే. హార్వర్డ్‌... మా మాటలు నీకు వినబడుతున్నాయా? హార్వర్డ్‌... మా మాటలు వింటున్నావా?’
(అని మళ్లీ ప్రధాన ఉపన్యాసంలోకి వచ్చింది) 

‘ఒక జాతి అయిన కారణాన తనను లక్ష్యంగా చేసి దాడులకు గురి చేయడం అంటే ఏమిటో బహుశా మనకు తెలియదు. హింసా, మృత్యువూ మన కళ్లలోకి కళ్లు పెట్టి చూడడం అంటే ఏమిటో బహుశా మనకు తెలియదు. మనకు తెలియవలసిన అవసరం కూడా లేదు. మనం కూడగట్టి మాట్లాడటం అనేది మనకు తెలిసి ఉన్న విషయాల గురించే కానక్కరలేదు. మనకు తెలియనిదాని గుండా కూడా ప్రయాణించాలి’ అందామె.
ప్రసంగం చివర ఎమిలీ డికిన్సన్‌ కవితా వాక్యాన్ని కోట్‌ చేసింది. 
‘ప్రభాతం ఎప్పుడొస్తుందో తెలియదు. అందుకే ప్రతి తలుపూ తెరిచి పెడతాను’.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement