Chetana Parikh: రక్తదాతకు వందనం | India all 3 women centurion blood donors are from Ahmadabad, A proud hat-trick. | Sakshi
Sakshi News home page

Chetana Parikh: రక్తదాతకు వందనం

Published Tue, Oct 3 2023 12:24 AM | Last Updated on Tue, Oct 3 2023 5:47 AM

India all 3 women centurion blood donors are from Ahmadabad, A proud hat-trick. - Sakshi

ఇన్ని కోట్ల మంది ఉన్న మనదేశంలో 100 సార్లు రక్తదానం చేసినవారు కేవలం 125 మంది ఉన్నారు. వీరిలో స్త్రీలు ఇద్దరే ఉండగా మూడవ వ్యక్తిగా అహ్మదాబాద్‌కు చెందిన చేతన పారిఖ్‌ నిలిచింది. అక్టోబర్‌ 1న వందోసారి రక్తదానం చేయడం ద్వారా ఆమె ఈ ఘనత సొంతం చేసుకుంది. రక్తదాన అవసరాన్ని ప్రచారం చేయడమే కాక అనితరసాధ్యంగా పాటిస్తున్న చేతన పరిచయం.

అక్టోబర్‌ 1, ఆదివారం, అహ్మదాబాద్‌లోని జె.ఎల్‌.ఠాకూర్‌ రెడ్‌క్రాస్‌ భవన్‌. ‘నేషనల్‌ వాలంటరీ బ్లడ్‌ డొనేషన్‌ డే’ సందర్భంగా రెడ్‌క్రాస్‌ సంస్థ నిర్వహిస్తున్న మెగా బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌. అందరూ 58 ఏళ్ల చేతన పారిఖ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. కాసేపటికి ఆమె వచ్చింది. రక్తం ఇవ్వడానికి అలవాటుగా చేతిని ముందుకు సాచింది. మెడికల్‌ స్టాఫ్‌ ఆమె చేతిలో సూది గుచ్చారు. ఆమె ఒంటి నుంచి రక్తం సాచెట్‌ వైపు ప్రవహించసాగింది. అంతే. అందరూ చప్పట్లు హోరెత్తించారు.

ఎందుకంటే ఆ రోజుతో ఆమె అలా రక్తాన్ని ఇవ్వడం వందోసారి. మన దేశంలో దశాబ్దాలుగా రెడ్‌ క్రాస్‌ నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాల్లో ఇప్పటి వరకు కేవలం ఇద్దరు స్త్రీలే నూరుసార్లు రక్తం ఇచ్చారు. చేతన పారిఖ్‌ మూడో వ్యక్తి. కాలేజీ రోజుల నుంచి అమ్మమ్మ వయసు వరకూ ఆమె ఎప్పుడూ రక్తదానం చేస్తూనే ఉంది. ఇక మీదట కూడా చేస్తూనే ఉంటాను అంటోంది.

1985లో మొదటిసారి
చేతన పారిఖ్‌ అహ్మదాబాద్‌లోనే పుట్టి పెరిగింది. నగరంలోని కలుపూర్‌ కాలేజీలో చదువుకుంది. ‘అది 1985వ సంవత్సరం. మా కాలేజీకి రెడ్‌ క్రాస్‌ వాళ్లు వచ్చి రక్తం ఇమ్మని అభ్యర్థించారు. అప్పటికి రక్తదాన ఉద్యమం ఊపందుకోలేదు. చాలా అపోహలు ఉండేవి. కొద్దిమంది అబ్బాయిలు ముందుకొచ్చారు.

నేను, ఇంకో అమ్మాయి మాత్రమే రక్తం ఇచ్చాం. మా ఇంటిలో ఇది తెలిసి చాలా ఆందోళన చెందారు. రక్తం ఇవ్వడం వల్ల శరీరానికి నష్టం అనుకునేవారు ఆ రోజుల్లో. కాని రక్తం అందక చాలా మంది మరణిస్తున్నారని అప్పటికే నాకు తెలుసు. ఇది చేయదగ్గ మంచి పని అనిపించింది. అప్పటి నుంచి రక్తం ఇస్తూనే ఉన్నాను’ అంటుంది చేతన పారిఖ్‌.

కుటుంబంతో ఉద్యమం
చేతన భర్త వినిత్‌ పారిఖ్‌ సాదాసీదా డాక్టర్‌. పెళ్లయ్యాక చేతన తన భర్తను రక్తదానం వైపు ప్రోత్సహించింది. ఒక డాక్టర్‌గా రక్తదానం ఎంత అవసరమో తెలియడం వల్ల వినిత్‌ కూడా భార్య నుంచి స్ఫూర్తి పొందాడు. ఇద్దరూ కలిసి రెడ్‌ క్రాస్‌లో చేరారు. ఒకరికి చెప్పడమే కాదు తాము క్రమం తప్పకుండా రక్తదానం ఇస్తూ  స్ఫూర్తిగా నిలిచారు.

‘నా భర్త వినిత్‌ నా కంటే ముందే నూరుసార్లు రక్తం ఇచ్చినవాళ్ల లిస్ట్‌లోకి ఎక్కారు. నేను తాజాగా ఆ లిస్ట్‌లో చేరాను. మనం చేసి చూపిస్తే మిగిలినవారు అందుకుంటారు. నా కొడుకు హన్షిల్, నా కుమార్తె మేహ ఇద్దరూ డాక్టర్లే. వారు కూడా మాతో కలిసి రక్తదానం చేస్తూనే ఉంటారు. ఇద్దరూ ఇప్పటికి చెరో ముప్పైసార్లు రక్తం ఇచ్చారు. ఇలా మా కుటుంబంలోని నలుగురు సభ్యులం కలిసి మొత్తం 260 సార్లు రక్తం ఇచ్చాం. ఇన్నిసార్లు ఇచ్చిన మరో కుటుంబం లేదేమో మన దేశంలో’ అంటుంది చేతన.

పెళ్లిలో వినూత్నం
చేతన రక్తదానం కోసం ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకుంటుంది. కూతురు పెళ్లిలో ఆమె రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం విశేషం. అందులో పెళ్లికొడుకు స్వయంగా రక్తం ఇచ్చాడు. పెళ్లికి వచ్చిన బంధుజనుల్లో చాలామంది రక్తం ఇవ్వగా 58 యూనిట్ల సేకరణ జరిగింది. ‘రక్తం విలువ సరిగ్గా అది అవసరమైనప్పుడు తెలుస్తుంది. రక్తం ల్యాబ్‌లో తయారు కాదు. మనిషే ఇవ్వాలి. అందుకు మానవత్వం ఉండాలి. మన మానవత్వం నిరూపించుకోవడానికి రక్తదానానికి మించిన మార్గం లేదు’ అంటుంది చేతన.

ఒక గృహిణిగా ఉంటూనే ఆమె చేస్తున్న ఈ విశిష్ట ప్రచారం, సేవ ఒక్కరికైనా స్ఫూర్తి కలిగిస్తే అంతే చాలు.       

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement