సాహోరే.. టాప్‌ స్పీడ్‌ స్టార్స్‌! Electric Superbike Maker Ultraviolette Is Revving Up For Growth | Sakshi
Sakshi News home page

సాహోరే.. టాప్‌ స్పీడ్‌ స్టార్స్‌! ఆ ఇద్దరు ఎలక్ట్రిక్‌ సూపర్‌ బైక్‌ ..

Published Fri, Oct 6 2023 10:13 AM | Last Updated on Fri, Oct 6 2023 10:27 AM

Electric Superbike Maker Ultraviolette Is Revving Up For Growth - Sakshi

‘ఇమాజినేషన్‌ ఈజ్‌ మోర్‌ ఇంపార్టెంట్‌ దేన్‌ నాలెడ్జ్‌’ అంటూ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ‘ఊహాశక్తి’కి ఉండే అపారమైన శక్తి ఏమిటో చెప్పకనే చెప్పారు. ఈ ఇద్దరు మిత్రులకు ఊహాశక్తితో పాటు సాంకేతిక నైపుణ్యశక్తి కూడా ఉంది. ఈ రెండు శక్తులను సమన్వయం చేసుకుంటూ కాలేజీ రోజుల నుంచి చిన్న చిన్న ఆవిష్కరణలు చేస్తున్నారు. ఆ ప్యాషన్‌ వారిని ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా మార్చి బైక్‌ మార్కెట్‌లోకి అడుగు పెట్టేలా చేసింది. ఈవీ స్టార్టప్‌ ‘అల్ట్రావయోలెట్‌’తో స్పీడ్‌గా దూసుకుపోతున్నారు...2006లో...

బెంగళూరులోని బీఎంఎస్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌ నారాయణ్‌ సుబ్రమణ్యం, నీరజ్‌ రాజ్‌మోహన్‌లు ఐఐటీ, మద్రాస్‌ నిర్వహించిన పోటీలో ఎయిర్‌–ప్రొపెల్డ్‌ వాటర్‌ క్రాఫ్ట్‌ రూపొందించి ‘బెస్ట్‌ డిజైన్‌’ అవార్డ్‌ గెలుచుకున్నారు. ఈ పోటీలో దేశవ్యాప్తంగా ఎన్నో ఐఐటీ టీమ్‌లు పాల్గొన్నాయి. కట్‌ చేస్తే... ఈ ఇద్దరు ఎలక్ట్రిక్‌ సూపర్‌ బైక్‌ స్టార్టప్‌ ‘అల్ట్రావయోలెట్‌’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నారాయణ్, నీరజ్‌లకు స్కూలు రోజుల నుంచి ఎలక్ట్రానిక్స్, రోబోట్స్‌ అంటే ఇష్టం. కాలేజీలో చేరే నాటికి ఆ ఇష్టం మరోస్థాయికి చేరింది.

అన్నిరకాల ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, రోబోట్స్,హైడ్రోప్లెయిన్స్, ఎలక్ట్రిక్‌ సబ్‌మెరైన్‌లు తయారుచేసేవారు. దేశవ్యాప్తంగా ఎన్నో పోటీల్లో పాల్గొనేవారు. సూపర్‌బైక్‌ తయారు చేయాలనేది వారి కల. కాలేజీ చదువు పూర్తయిన తరువాత ఇద్దరి దారులు వేరయ్యాయి. పై చదువుల కోసం నీరజ్‌ కాలిఫోర్నియా, నారాయణ్‌ స్వీడన్‌ వెళ్లారు. ఆ తరువాత టాప్‌ ఆటోమోటివ్‌ కంపెనీలలో పనిచేశారు. అయితే ఇద్దరిలోనూ ఏదో అసంతృప్తి ఉండేది. వారు అనేకసార్లు మాట్లాడుకున్న తరువాత ‘ఏదైనా సాధించాలి’ అనే నిర్ణయానికి వచ్చారు.

అలా బెంగళూరు కేంద్రంగా ఈవీ స్టార్టప్‌ ‘అల్ట్రావయోలెట్‌’కు శ్రీకారం చుట్టారు. ఆటోమోటివ్, కన్జ్యూమర్‌ టెక్, ఏరో స్పేస్‌ నిపుణులతో గట్టి బృందాన్ని తయారుచేసుకున్నారు.
ఈ మిత్రద్వయం మోటర్‌ఫీల్డ్‌కు కొత్త కాబట్టి వారి టీమ్‌లో చేరడానికి తటపటాయించేవారు. అయితే  కాస్త ఆలస్యంగానైనా ప్రతిభావంతులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. అందరిలాగే తమ స్టార్టప్‌కు కరోన కష్టాలు మొదలయ్యాయి. తమ ఫస్ట్‌ ఆల్‌–ఎలక్ట్రిక్‌ పెర్‌ఫార్‌మెన్స్‌ బైక్‌ ఎఫ్‌ 77 మోడల్‌ తయారీని నిలిపివేయాల్సి వచ్చింది. పరిస్థితి మెరుగుపడుతుందనుకుంటున్న సమయంలో ‘ఎఫ్‌77’ను రీవ్యాంప్‌ చేశారు.

‘భిన్నమైన సంస్కృతులు, అభిరుచులు ఉన్న మనలాంటి దేశంలో ఈవీలతో మెప్పించడం అనేది పెద్ద సవాలు. ఈ టెక్నాలజీ గురించి చాలామంది అపోహలతో ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి మైండ్‌సెట్‌ను మార్చాలనుకున్నాం. ఈవీలో మాకు సాధ్యమైన కొత్త ఫీచర్‌లు తీసుకువచ్చాం. మా అల్ట్రావయోలెట్‌కు  ఏవియేషన్, ఏరోస్పేస్‌ సెక్టార్‌లు స్ఫూర్తి. మాకు కొత్త ఆవిష్కరణలు అంటే ఆసక్తి’ అంటున్నాడు ‘అల్ట్రావయోలెట్‌’ కో–ఫౌండర్, సీయివో నారాయణ్‌. ఇక ఇద్దరి అభిరుచుల విషయానికి వస్తే...నీరజ్‌ పుస్తకాల పురుగు. పుస్తకాలు ఎక్కువగా చదవడం ద్వారా తనకు కొత్త ఐడియాలు వస్తాయి అంటాడు.

ఇక నారాయణ్‌కు ‘క్రియేటివిటీ అండ్‌ ఫిట్‌నెస్‌’ ఇష్టమైన సబ్జెక్ట్‌. అయితే టెక్నికల్‌ స్కిల్స్‌ విషయంలో మాత్రం ఇద్దరికీ సమ ప్రతిభ ఉంది. నారాయణ్‌ ఆటోమోటివ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ డిజైన్‌లో, రాజ్‌మోహన్‌ కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్‌ నాలెడ్జ్‌లో ఎక్స్‌పర్ట్‌. ‘మేము అద్భుతాన్ని సృష్టించాలనుకున్నాం. అనుకోవడానికైతే ఎన్నైనా అనుకోవచ్చు. ఆచరణలో మాత్రం రకరకాల సవాళ్లు ఎదురొస్తుంటాయి. వాటిని తట్టుకొని నిలబడడమే అసలు సిసలు సవాలు. అలాంటి సవాలును అధిగమించి మా కలను నిజం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది’ అంటున్నాడు ‘అల్ట్రావయోలెట్‌’ ఫౌండర్‌లలో ఒకరైన నీరజ్‌.

(చదవండి: చీట్‌ ఆఫ్‌ ది డే! దొంగ డీల్స్‌!)
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement