డాక్టర్‌ గీతారెడ్డి బోర: స్టార్టప్‌ దిశగా అంకురం! Dr Geeta Reddy Bora Was A Social Influencer Who Influenced Society | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ గీతారెడ్డి బోర: స్టార్టప్‌ దిశగా అంకురం!

Published Thu, Mar 7 2024 7:46 AM | Last Updated on Thu, Mar 7 2024 7:47 AM

Dr Geeta Reddy Bora Was A Social Influencer Who Influenced Society - Sakshi

టెక్నాలజీ

'సమాజం మారాలి.. సమాజంలో మార్పు రావాలి. సమాజంలో మార్పు తేవాలి. ఈ ప్రసంగాలు వింటూనే ఉంటాం. మారాలని అందరూ కోరుకుంటారు.  మార్పు కోసం ఏం చేయాలో తెలిసిన వాళ్లెందరు? సమాజం మారాలంటే ఏం చేయాలో తెలిసి ఉండాలి. ఆ మార్పు మనతోనే మొదలు... అనుకోవాలి. మార్పు దిశగా తొలి అడుగు వేయగలిగిన చొరవ ఉండాలి. అలా డిజిటల్‌ ఎరాలోకి అడుగుపెట్టారు డాక్టర్‌ గీత. తన పాదముద్రలతో అభివృద్ధి దారి చూపిస్తున్నారు.'

ఈ డిజిటల్‌ యుగంలో దాదాపుగా అందరూ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లే. ఇలాంటి డిజిటల్‌ ఎరాను ముందుగానే ఊహించి సమాజాన్ని ప్రభావితం చేసిన సోషల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ గీతాబోర. ప్రపంచదేశాలన్నీ ఒక తాటిమీదకు వచ్చి ఒకేరకమైన నైపుణ్యాలతో గ్లోబల్‌ వేదిక మీద పోటీ పడుతున్న తరుణంలో మన గ్రామీణ విద్యార్థుల్లో ఎంతమంది ఈ పోటీలో నిలవ గలుగుతున్నారనే ప్రశ్న వేసుకుని అందుకు సమాధానంగా కమ్యూనికేషన్, లాంగ్వేజ్‌ స్కిల్స్‌లో శిక్షణ అవసరాన్ని గుర్తించారామె.

క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో ప్లేస్‌మెంట్‌ దొరక్క మిగిలిపోయిన పిల్లలు బీపీవోల్లో నైట్‌ షిఫ్ట్‌ ఉద్యోగాల్లో ఉపాధిని వెతుక్కోవాల్సి రావడం, క్రమంగా నైట్‌లైఫ్‌కు అలవాటు పడిపోవడం, యువశక్తి నిరీ్వర్యం కావడంతోపాటు సమాజంలో చాపకింద నీరులా వ్యసనాలు విస్తరించడాన్ని గ్రహించారు.

అలాగే చదువుకున్న ప్రతి ఒక్కరూ పట్టా చేతపట్టుకుని ఉద్యోగం కోసం ఎదురు చూడడం కాదు సొంతంగా తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేయాలని, స్టార్టప్‌ దిశగా నడవడానికి విద్యార్థి దశలోనే ఈ ఆలోచనకు అంకురం వేయాలని ఆలోచించారు. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ఉన్నత విద్యాశాఖ సమన్వయంతో సరి్టఫికేట్‌ కోర్సుకు రూపకల్పన చేశారు. సోషల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా సమాజానికి తన కంట్రిబ్యూషన్‌ గురించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారామె.

'మన సమాజం ఉద్యోగాలు వెతుక్కునే సమాజంగానే ఉండిపోవడానికి కారణం కూడా పెద్దవాళ్లు ఎప్పటికప్పుడు యువత ఆలోచనలను చిదిమేయడమే. పెద్దవాళ్ల కంటే యువత ఒక తరం ముందు ఉంటుంది. ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఆ ఆలోచనలకు ఒక అండ దొరికితే వాళ్లు అద్భుతాలు చేస్తారు'. – డాక్టర్‌ గీతారెడ్డి బోర, ఫౌండర్, యష్మి సొల్యూషన్స్, యష్మిత ఈ టెక్నాలజీస్, చైర్‌పర్సన్, సీఐఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ, ఆంధ్రప్రదేశ్‌

‘‘నేను పుట్టింది, పెరిగింది వైజాగ్‌లో. ఎంసీఏ తర్వాత హైదరాబాద్‌లో పన్నెండేళ్లపాటు ఉన్నాను. ఇప్పుడు నా కంపెనీ వ్యవహారాలు, సామాజిక వ్యవహారాలను వైజాగ్‌ నుంచే నిర్వహిస్తున్నాను. సమాజం మారాలని వేదికలెక్కి ఉపన్యాసాలివ్వడం కాదు, విద్యావ్యవస్థను గాడిలో పెడితే, యువత ఆలోచనలను అభివృద్ధి వైపు మరలి్చనట్లయితే సమాజం దానంతట అదే మారుతుంది. సరిగ్గా నేను అదే చేస్తున్నాను. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో 41 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రసంగించి, నాలుగువందల మంది విద్యార్థులను ప్రభావితం చేయగలిగాను. వారిలో 150 మంది తమ సొంత ఆలోచనలతో ఎంటర్‌ప్రెన్యూర్‌ షిఫ్‌ వైపు అడుగులు వేస్తున్నారు.

పెద్దవాళ్లు అనుభవం పేరుతో యువత ఆలోచనలకు పరిధులు విధిస్తుంటారు. ఇది చాలా తప్పు. యువత ఆలోచనలను బయటకు చెప్పగలిగేలా వాళ్లను ్రపోత్సహించాలి. పెద్దవాళ్లు ఎప్పుడూ యువత ఆలోచనలను కార్యరూపం దాల్చడానికి తమ అనుభవం నుంచి కొన్ని సూచనలు చేయవచ్చు. అంతేతప్ప యువత ఎలాంటి ఉపాధిని వెతుక్కోవాలనే ఆలోచనలు కూడా తామే చేయాలనుకోకూడదు. ఈ అంతరాన్ని పూడ్చడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మెంటార్, రీసోర్స్‌ పర్సన్, మోటివేషనల్‌ స్పీకర్‌గా ఉన్నాను.

చైల్డ్‌ అబ్యూజ్, మహిళల పట్ల వివక్ష, మహిళల కుటుంబ, వైవాహిక పరమైన చిక్కులకు న్యాయసలహాలతో కౌన్సెలింగ్‌ ఇస్తున్నాను. మా వైజాగ్‌లో భూబకాసురుల చేతిలో చిక్కుకున్న భూమి వివరాలను, ఒరిజినల్‌ డాక్యుమెంట్‌ల ఆధారాలను ప్రభుత్వానికి తెలియచేసి, బాధితులకు అండగా నిలిచాను. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ ఉమన్‌గా సమాజానికి ఇస్తున్న సేవకుగాను ‘నారీప్రెన్యూర్‌’ గుర్తింపును అందుకున్నాను. ఇప్పుడు నా మీద మహిళల కోసం పని చేయాల్సిన బాధ్యత కూడా పెరిగింది.

గ్రామీణ మహిళలను ఆర్థిక సాధికారత వైపు నడిపించడానికి కార్యక్రమాల మీద పని చేస్తున్నాను. పరిమితమైన వనరులు, సాధారణ విద్యార్హతలు కలిగిన గ్రామీణ మహిళ తన మేధను ఉపయోగించి ఎదగడానికి అవసరమైనట్లు శిక్షణ కార్యక్రమాలను రూపొందిస్తున్నాను. ఆడవాళ్లు అభ్యుదయ కోణంలో ఆలోచించనంత కాలం సమాజం అభివృద్ధి దిశగా నడవదు. అందుకే మహిళ మారాలి, ఆమె మారితే పిల్లల ఆలోచనలు మారుతాయి. ఆ భావితరం మనం కోరుకున్న సమాజాన్ని నిర్మిస్తుంది’’ అన్నారు డాక్టర్‌ గీతారెడ్డి బోర.  – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి.

ఇవి చదవండి: వినూత్నం: రోబో టీచరమ్మ.. పిల్లలు బుద్ధిగా, సైలెంట్‌గా ఉండాల్సిందే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement