ఆ నొప్పి నరకం : ఎండోమెట్రియోసిస్‌ అంటే ఏమిటి? పిల్లలు పుట్టరా? | cause of endometriosis causes and treatment | Sakshi
Sakshi News home page

ఆ నొప్పి నరకం : ఎండోమెట్రియోసిస్‌ అంటే ఏమిటి? పిల్లలు పుట్టరా?

Published Thu, May 16 2024 6:19 PM | Last Updated on Thu, May 16 2024 6:40 PM

cause of endometriosis  causes and treatment

ప్రముఖ బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి చెల్లెలు షమితా శెట్టి ఎండోమెట్రియోసిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తాజాగా తన సోషల్‌ మీడియాలో వెల్లడిరచింది.   చాలా బాధాకరమైన ఎండోమెట్రియోసిస్‌నునిర్లక్ష్యం చేయకండి.  దయచేసి గూగుల్‌లో ఎండోమెట్రియోసిస్‌ కోసం సెర్చ్‌ చేయండి. లక్షణాల గురించి తెలుసుకోండి అంటూ మహిళలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.  కొన్ని దేశాల్లో, అది కలిగించే నొప్పి కారణంగా ఇది వైకల్యంలో భాగంగా ప్రకటించారట. ఈ నేపథ్యంలో అసలు ఎండోమెట్రియోసిస్‌ అంటే ఏమిటి? ఇది ప్రాణాంతక వ్యాధా? ఇది మహిళల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? దీని గర్భధారణ  సమస్యలొస్తాయా?  తెలుసుకుందాం.

ఎండోమెట్రియోసిస్‌ అంటే ఏమిటి?
మహిళల గర్భాశయంలోని పొరను ఎండోమెట్రియం అంటారు. సాధారణంగా ఈ కణజాలం నెలసరి సమయంలో బయటకు వెళ్లిపోతుంది. కానీ, ఇలా వెళ్లకుండా కటి భాగంలో, అండాశయంలో, ఫాలోపియన్‌ నాళాల్లోకి చేరి,  అక్కడ పెరిగిపోతే దాన్నే ఎండోమెట్రియోసిస్‌ అంటారు.  నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌  ప్రకారం ఎండోమెట్రియం కణాలు గర్భాశయం లైనింగ్‌ వెలుపల పెరుగుతాయి. ఫలితంగా గర్భాశయం, అండాశయాలు (పెరిటోనియం), ప్రేగు, మూత్రాశయం చుట్టూ ఉన్న కణజాలంలో గాయాలు ఏర్పడతాయి. ఫలితంగా తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, వ్యంధత్వం(ఇన్‌ఫర్టిలిటీ) వంటి లక్షణాలు ఏర్పడతాయి.

ఎండోమెట్రియోసిస్‌ వ్యాధికి కారణం తెలియదు. కానీ ఎండోమెట్రియోసిస్‌ లక్షణాలు మారుతూ ఉంటాయి. కొందరు వ్యక్తులు తేలికపాటి లక్షణాలుంటే, మరికొందరిలో విపరీతమైన నొప్పి, అధిక రక్త స్రావం ఉంటాయి.  చాలామందిలో అసలు ఎలాంటి లక్షణాలు కనిపించవు.

ఎండోమెట్రియోసిస్‌ లక్షణాలు
పెల్విక్‌ విపరీతమైన నొప్పి
పీరియడ్స్‌ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి
అధిక ఋతు రక్తస్రావం లేదా పీరియడ్స్‌ మధ్యలో రక్తస్రావం
ప్రేగు కదలిక నొప్పి
మూత్రవిసర్జన సమయంలో నొప్పి
సంతానలేమి
సంతానోత్పత్తిపై ప్రభావం
సాధారణంగా ఎండోమెట్రియోసిస్‌ తీవ్రతను బట్టి గర్భధారణ సమస్యఉండకపోవచ్చు. అయితే, ఎండోమెట్రియోసిస్‌ కలిగిన మహిళలకు కొన్ని సవాళ్లు ఎదురయ్యే ముప్పు ఉంది. వీటిపై అవగాహన కలిగి ఉండాలి. గర్భం పోవడం, లేదా  నెలలు నిండకముందే ప్రసవించే ముప్పు ఉంటుంది.   నిపుణులైన గైనకాలజిస్ట్‌ పర్యవేక్షణ అవసరం.

హార్మోన్‌ థెరపీ
హార్మోన్‌లతో చికిత్స చేయడం ఒక మార్గం. బర్త్‌ కంట్రోల్‌ పిల్స్‌ లేదా గొనడోట్రోపిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌లు ఎండోమెట్రియోసిస్‌ కణాల వృద్ధిని నియంత్రణలో ఉంచుతాయి. దీంతో గర్భధారణ అవకాశాలు మెరుగవుతాయి.  మరికొందరిలో లాప్రోస్కోపిక్‌ సర్జరీ అవసరం పడుతుంది. ఆపరేషన్‌ ద్వారా ఎండోమెట్రియోసిస్‌ కణాలను సమూలంగా తొలగిస్తారు. ఎండోమెట్రియోసిస్‌ స్టేజ్‌ని నిర్ధారించుకుని తగిన చికిత్స చేసుకోవాలి.

ఎండోమెట్రియోసిస్‌కు చికిత్స ఏమిటి?
హార్మోన్‌ థెరపీ సప్లిమెంటరీ హార్మోన్లను తీసుకోవడం కొన్నిసార్లు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు .ఎండోమెట్రియోసిస్‌ పురోగతిని ఆపవచ్చు. ఎండోమెట్రియోసిస్‌ ప్రాణాంతకం కాదు.  చికిత్స చేయకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది. ఒక్కోసారి కొన్ని కేన్సర్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

నోట్‌ : లక్షణాలను గమనించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఒత్తిడిని మరింత పెంచుతుంది. వైద్యుల పర్యవేక్షణలో రోగనిర్ధారణ, సరైన సమయం చికిత్స చాలా ముఖ్యం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement