అనంతపురం అమ్మాయి లోకాన్ని చుట్టేస్తోంది | Andhra Girl With Himalayan Ambitions Wants To Prove Point | Sakshi
Sakshi News home page

అనంతపురం అమ్మాయి లోకాన్ని చుట్టేస్తోంది

Published Thu, Feb 11 2021 12:01 AM | Last Updated on Thu, Feb 11 2021 3:38 AM

Andhra Girl With Himalayan Ambitions Wants To Prove Point - Sakshi

అనంతపురం నుంచి సమీరా ఖాన్‌ అనే అమ్మాయి హిమాలయాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే నేపాల్‌లోని అమా దబ్లమ్‌ పర్వతాన్ని అధిరోహించింది. ఎవరెస్ట్‌ను అందరిలా నేపాల్‌ వైపు నుంచి కాక టిబెట్‌ వైపు నుంచి ఎక్కడానికి ప్రయత్నిస్తోంది. సైకిల్‌ మీద దేశంలోని ఈ మూల నుంచి ఆ మూలకు తిరిగేసిన సమీరా ఖాన్‌కు తల్లిదండ్రులు లేరు. కుటుంబ మద్దతు లేకపోయినా అమ్మాయిలు తాము అనుకున్నది సాధించగలరు అని ఎవరెస్ట్‌ శిఖరం మీద నుంచి అరచి చెప్పాలని ఉందని సమీరా అంటోంది.

సమీరా ఖాన్‌ మన తెలుగమ్మాయి అయినా తెలుగువారి కంటే ఈశాన్య రాష్ట్రాల్లో చాలామందికి తెలుసు. పర్వతాలు ఎక్కాలనే సంకల్పంతో తరచూ ఆవైపే తిరుగుతుంటుంది సమీరా. నేపాల్, టిబెట్‌లకు పక్కింటికి వెళ్లినట్టు వెళుతుంటుంది. ‘పర్వతాన్ని అధిరోహించడం ఏదో సరదా కాదు నాకు. అదొక జీవన విధానం’ అంటుంది సమీరా. అనంతపురంకు చెందిన సమీరా ఖాన్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక సంస్థలో పని చేస్తోంది. కాని  టైలర్‌గా పని చేసే తండ్రి ఐదేళ్ల క్రితం మరణించాక ఆమె ఈ ప్రపంచమే తన ఇల్లు అనుకుంది. ఆమెకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు తల్లి చనిపోయింది. ఐదుమంది సంతానం లో చివరిదైన సమీరా ఇంటి నుంచి ఏ మద్దతు కోరకుండా ఒక్కదానిగా ఏదైనా సాధించాలనుకుంది.

‘నాకు సైక్లింగ్‌ అంటే చాలా ఇష్టం. దేశంలో దాదాపు వెయ్యి కిలోమీటర్లు సైకిల్‌ మీద ఒక్కదాన్నే తిరిగాను’ అంటుంది సమీరా. కాని ఆమెకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది. ‘నేను పదో క్లాసు వరకు చదువుకున్నాను. ఆ తర్వాత కుటుంబ అవసరాల కోసం బెంగళూరులో ఒక బి.పి.ఓలో పని చేశాను. ఒక్కదాన్నే ప్రపంచం చూడటం మొదలుపెట్టాక ధైర్యం వచ్చింది. సైకిల్‌ వేసుకొని ఒక్కదాన్నే చుట్టుపక్కల రాష్ట్రాలకు వెళ్లి రావడం మొదలుపెట్టాను’ అంది సమీరా ఖాన్‌. ‘2014లో కశ్మీర్‌కు వరదలు వచ్చినప్పుడు వాలెంటీర్‌గా పని చేయడానికి వెళ్లాను. ఆ సమయంలో రెండు రోజులు ట్రెక్కింగ్‌ చేశాను. ధైర్యం వచ్చింది.

ప్రతికూల పరిస్థితుల్లో ఎలా ఉండాలో అర్థమైంది. పర్వతారోహణ మీద ఆసక్తి ఏర్పడింది. నేపాల్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో దాదాపు 500 కిలోమీటర్ల ట్రెక్కింగ్‌ పూర్తి చేశాను. నా శక్తి ఇంకా పెరిగినట్టనిపించింది. నేపాల్‌లో, హిమాలయాల్లో ఉన్న నాలుగు పెద్ద పర్వతాలు ఎక్కాను. ఇక ఎవరెస్ట్‌ మిగిలింది. దానిని అందరూ సులువని నేపాల్‌ వైపుగా ఎక్కుతారు. ఏదో ఎక్కామంటే ఎక్కాం అని చెప్పడానికి ఎక్కడం ఎందుకు? నేను టిబెట్‌ వైపు నుంచి చాలా నైపుణ్యంతో సవాలుతో ఎవరెస్ట్‌ ఎక్కాలని నిర్ణయించుకున్నాను’ అంది సమీరా ఖాన్‌.


ట్రెక్కింగ్, పర్వతారోహణలో సమీరా ఖాన్‌

ఆమె ఇంతవరకూ పర్వతారోహణలో ట్రైనింగ్‌ తీసుకోలేదు. లండన్‌ వెళ్లి ట్రైనింగ్‌ తీసుకోవాలనుకుంటోంది. దానికి రెండు మూడు లక్షలు కావాలి. ఎవరెస్ట్‌ అధిరోహణకు కూడా కొన్ని లక్షల ఖర్చు ఉంది. ‘నా దగ్గర కొంత డబ్బు ఉంది. ఇంకొంత స్పాన్సర్‌షిప్‌ కావాలి. ప్రభుత్వాన్ని సంప్రదిస్తే పర్వతారోహణ ఒక క్రీడ కాదు అని చెప్పి పంపించేశారు. ఏం చేయాలి’ అంది ఈ సాహసి. ‘నాకు స్త్రీలు ఏదైనా సాధించగలరు అని చెప్పాలని ఉంది. ఈ సమాజంలో నా గొంతు వినిపించాలని ఉంది. ఎవరెస్ట్‌ అధిరోహించి, ఆ యోగ్యతతో నేను చెప్పాలనుకున్నది స్త్రీల తరఫున అరచి చెప్తాను’ అంటోంది సమీరా ఖాన్‌. ఆమె పట్టుదల చూస్తుంటే త్వరలోనే స్త్రీల తరఫున ఒక గట్టి గొంతు వింటాం.
– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement