జీవితాన్ని మలుపు తిప్పిన కెమెరా: మాయ ముక్తై | 13-year-old bride went from rag-picking to representing at UN | Sakshi
Sakshi News home page

జీవితాన్ని మలుపు తిప్పిన కెమెరా: మాయ ముక్తై

Published Fri, Jan 21 2022 11:19 PM | Last Updated on Fri, Jan 21 2022 11:20 PM

13-year-old bride went from rag-picking to representing at UN - Sakshi

చిన్న వయసులో బడిలో చదువుకునే అవకాశం రాలేదు ఆమెకు.
అయితేనేం, సమాజాన్ని చిన్న వయసులోనే లోతుగా చదివే అవకాశం వచ్చింది. అదే తన ఫిల్మ్‌మేకింగ్‌కు ముడిసరుకు, సృజనాత్మకశక్తి అయింది...

నాసిక్‌(మహారాష్ట్ర)కు  చెందిన మాయ ముక్తైకి పదమూడు సంవత్సరాల వయసులోనే పెళ్లయింది. చుట్టుపక్కల వాళ్లు చెత్త ఏరుకోవడానికి వెళుతుంటే వారితో పాటు వెళ్లేది. రోజంతా కష్టపడితే ఇరవై రూపాయలు వచ్చేవి.
నాసిక్‌లో ‘కాగడ్‌ కచ్‌ పాత్ర కష్టకారి పంచాయత్‌’ అనే శ్రమజీవుల యూనియన్‌ ఉంది. ఎవరో చెప్పడంతో ఈ యూనియన్‌లో చేరింది మాయ. ఇదే తన జీవితాన్ని  మలుపు తిప్పింది. అక్కడ ఎన్నో విషయాల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది.
సంతకం చేయడం నేర్చుకున్న రోజు ఎంత సంతోషపడిందో!

చైనాలో జరిగే యూఎన్‌ క్లైమెట్‌ ఛేంజ్‌ కాన్ఫరెన్స్‌ కోసం ‘కష్టకారి పంచాయత్‌’ యూనియన్‌ నుంచి చెత్త ఏరుకొని బతికే ముగ్గురిని ఎంపిక చేశారు. అందులో మాయ కూడా ఒకరు. చైనాలో తనను కెమెరాలు, వీడియోగ్రఫీ తెగ ఆకట్టుకున్నాయి.
చైనా నుంచి తిరిగివచ్చిన తరువాత, తనకు వీడియోమేకింగ్‌లో మెలకువలు నేర్పించాల్సిందిగా యూనియన్‌ వారిని అడిగింది. ‘అభివ్యక్తి’ అనే ఎన్జీవో సహాయంతో మాయకు వీడియోమేకింగ్‌ నేర్పించారు. ‘చెత్త ఏరుకునే వారికి కూడా మనసు ఉంటుంది. ఆత్మగౌరవం ఉంటుంది. వారి గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను కూడా వారిలో ఒకరిని కాబట్టి’ అంటూ తమ జీవితాలపై డాక్యుమెంటరీ తీయడానికి అడుగులు వేసింది. తనతో పాటు చెత్త ఏరుకునే మిత్రులు బాగా ప్రోత్సహించి ముందుకు నడిపించారు.
డాక్యుమెంటరీ కోసం ఒక డంప్‌యార్డ్‌ దగ్గర షూటింగ్‌ చేస్తుంది మాయ. ఇంతలో ఒక పోలీసు పరుగెత్తుకు వచ్చి ‘ఈ కెమెరా ఎక్కడి నుంచి దొంగిలించావు?’ అని కొట్టడం మొదలుపెట్టాడు.

 ‘అయ్యా! ఇది నా కెమెరానే’ అని ఆ పోలీసును నమ్మించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది.
అష్టకష్టాలు పడి చేసిన ఆ డాక్యుమెంటరీకి మంచి పేరు వచ్చింది. ఎన్నో అవార్డ్‌లు వచ్చాయి.
‘మాకంటూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. నా కెమెరా ద్వారా వాటిని వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాను. ఇది నా చేతిలో ఉన్న ఆయుధం. పెద్దల్లో కదలిక తేవడానికి అయిదు నిమిషాల చిత్రం చాలు’ అంటున్న మాయ ఎన్నో సమస్యలు పరిష్కారం కావడానికి కారణం అయింది. నీటి ఎద్దడి తీర్చడం, గృహవసతి కల్పించడం...మొదలైనవి మాయ సాధించిన విజయాలలో ఉన్నాయి.

‘మన సమస్యల పరిష్కారానికి ఎవరో వస్తారని ఎదురుచూడకుండా మనమే కదలాలి. మనం శక్తిహీనులం కాదు. మనకు మనమే శక్తి’ అంటున్న మాయ, సామాజిక కార్యకర్త ఆనంద్‌తో కలిసి ‘పుకార్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌’ను ప్రారంభించింది. దీని ద్వారా శ్రమజీవుల కష్టాలు, సమస్యలకు చిత్రరూపం ఇవ్వాలనుకుంటుంది.
త్వరలో యూట్యూబ్‌ చానల్‌ కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది.
‘తాను నేర్చుకున్న వీడియోమేకింగ్‌ను డబ్బు సంపాదన కోసం ఉపయోగించి ఉంటే బోలెడు డబ్బు సంపాదించి ఉండేది. అయితే ఆమె తనలాంటి పేదల సమస్యల గురించి తప్ప డబ్బు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు’ అని మాయ ముక్తైని ప్రశంసిస్తున్నారు ‘కష్టకారి పంచాయత్‌’ పెద్దలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement