ఆలోచన రేపుతున్న ఎంపిక | Sakshi Editorial On Nobel Prize Winners Claudia Goldin and Nargis | Sakshi
Sakshi News home page

ఆలోచన రేపుతున్న ఎంపిక

Published Thu, Oct 12 2023 12:19 AM | Last Updated on Thu, Oct 12 2023 12:19 AM

Sakshi Editorial On Nobel Prize Winners Claudia Goldin and Nargis

ఏటా ఇచ్చే పురస్కారాలు సైతం విజేతల ఎంపిక, వారు చేసిన కృషి రీత్యా విశిష్టంగా నిలుస్తాయి. రాయల్‌ స్వీడిష్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఈ ఏడాదికి గాను ఇప్పటి దాకా ప్రకటించిన పురస్కారాల్లో కొన్ని అలాంటివే! స్వెరిజెస్‌ రిక్స్‌బ్యాంక్‌ ప్రైజ్‌ అనే పేరు కన్నా ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ స్మారకార్థం ఇచ్చే ‘నోబెల్‌ పురస్కారం’గానే ప్రసిద్ధమైన ఈ గౌరవం దక్కిన ఇద్దరు మహిళల గురించి ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తి కనబరుస్తోంది.

మహిళా శ్రామికశక్తిపై విస్తృత పరిశోధన జరిపిన ఆర్థిక శాస్త్రవేత్త క్లాడియా గోల్డిన్‌కు అర్థశాస్త్రంలో నోబెల్‌ ప్రైజ్, అలాగే ఇరాన్‌లో జైలులో మగ్గుతున్న మానవ హక్కుల ఉద్యమకారిణి నర్గిస్‌ మొహమ్మదీకి నోబెల్‌ శాంతి బహుమతి దక్కడం వారు దీర్ఘకాలంగా చేస్తున్న కృషికి అతి పెద్ద అంతర్జాతీయ గుర్తింపు. ఈ ఇద్దరి ఎంపిక వేతనాల్లో స్త్రీ పురుష వ్యత్యాసం మొదలు లింగ సమానత్వం దాకా అనేక అంశాలపై మరోసారి చర్చ రేపుతోంది. 

గోల్డిన్‌ కృషికి అర్థశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం దక్కడం బాగున్నా, అందులోనూ వైచిత్రి ఉంది. ఆమె నాలుగు దశాబ్దాల కృషి అంతా శ్రామిక విపణుల్లో మహిళలు, లింగ సమానత్వం గురించి! విచిత్రం ఏమిటంటే 1969లో అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతిని స్థాపించినప్పటి నుంచి నిన్నటి వరకు ఆ పురస్కారం దక్కింది ఇద్దరంటే ఇద్దరు మహిళలకే! అదీ వేరేవాళ్ళతో కలసి! ఆ గౌరవం దక్కిన మూడో మహిళ గోల్డినే! పైగా, ఒక మహిళకు ఒంటరిగా అర్థశాస్త్రంలో నోబెల్‌ దక్కడమూ ఇదే ప్రప్రథమం. నోబెల్‌ బహుమతుల్లో లింగ అసమానత్వంపై విమర్శలు వస్తున్న వేళ లేబర్‌ మార్కెట్‌లో మహిళా విజయం లోతుపాతులు విశ్లేషించిన గోల్డిన్‌కు ఈ గౌరవం దక్కడం గమనార్హం. 

హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరైన గోల్డిన్‌ అమెరికాలోని శ్రామిక విపణినీ, అలాగే వేతనాల్లో లింగ అసమానత్వానికి కారణాలనూ నాలుగు దశాబ్దాలుగా లోతుగా అధ్యయనం చేస్తూ వచ్చారు. 200 ఏళ్ళ అమెరికా చరిత్రను లోతుగా విశ్లేషిస్తూ, చారిత్రకంగా స్త్రీ పురుషుల ఆదాయాల్లో తేడాకు ప్రధానంగా చదువు, వివిధ రకాల ఉద్యోగాలే కారణమని తేల్చారు. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి పారిశ్రామిక ఆధారిత వ్యవస్థ వైపు దేశం మారడంతో శ్రామిక విపణిలో వివాహిత స్త్రీల భాగస్వామ్యం పడిపోయిందనేది ఆమె అధ్యయన సారం.

ఆ తర్వాత 20వ శతాబ్దంలో సర్వీసుల పరిశ్రమ వృద్ధి చెందడంతో, మరింత విద్యావంతులైన మహిళలు రంగంలోకి వచ్చారు. గర్భనిరోధక విధానాల లాంటివి ఆరోగ్యరంగంలో వ్యాప్తిలోకి వచ్చాయి. తత్ఫలితంగా, శ్రామికశక్తి లోకి మహిళలు మళ్ళీ ప్రవేశించారు. కానీ, అప్పటికే తలెత్తిన అంతరం మాత్రం పూడిపోలేదు. ముఖ్యంగా, తొలిచూలుతో ఈ తేడా తలెత్తుతోందని గోల్డిన్‌ పరిశోధన.  

ఇక, మరణశిక్షకు వ్యతిరేకంగా గళం విప్పినందుకూ, దేశంలో మహిళలకు సైతం సమాన హక్కులు ఉండాలని కోరినందుకూ ఇరాన్‌లో కటకటాలు లెక్కపెడుతున్న నర్గిస్‌ పోరాటం మరో పెద్ద కథ. ఇప్పటికి ఆమె 13 సార్లు అరెస్టయి, అయిదుసార్లు దోషిగా తీర్మానమై, 31 ఏళ్ళ జైలుశిక్షను ఎదుర్కొంటోంది. 2022 నాటి డబ్యూఈఎఫ్‌ గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ నివేదికలో అట్టడుగున అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లతో పాటు నిలిచిన దేశంగా ఇరాన్‌ పేరుమోసింది.

అలాంటి దేశాల్లో నర్గిస్‌ లాంటి మహిళలు కడకు తమ ఉనికిని కాపాడుకొనేందుకు సైతం పోరాడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు క్లాడియా గోల్డిన్‌ అధ్యయనానికీ, ఇటు నర్గిస్‌ మొహమ్మదీ అలుపెరుగని పోరాటానికీ నోబెల్‌ గుర్తింపు రావడం ఆనందదాయకం. 

సరిగ్గా గోల్డిన్‌కు నోబెల్‌ ప్రకటించిననాడే మన దేశంలో వార్షిక ‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే‘ (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) విడుదలైంది. గత 2022 జూలై నుంచి ఈ 2023 జూన్‌కి సంబంధించిన ఈ సర్వే శ్రమజీవుల్లో మహిళల సంఖ్య మునుపటి కన్నా కొద్దిగా పెరిగిందని పేర్కొంది. అయితే, అది సహజ మైన పెరుగుదల కాక కరోనా తర్వాత కుటుంబ ఆదాయాలు దెబ్బతినడంతో తప్పని పరిస్థితుల్లో వచ్చిన పాలపొంగు అని విశ్లేషకుల అభిప్రాయం.

వెరసి, లోతుగా గమనిస్తే భారత్‌లోనూ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం రేటు ఇవాళ్టికీ తక్కువగానే ఉందన్నది విచారకరమైన వాస్తవం. ఇది మారాలంటే... అర్థవంతమైన ఉపాధి, అదే సమయంలో మహిళా శ్రామికశక్తి భాగస్వామ్యం పెరి గేలా విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలది. అందుకు ప్రొఫెసర్‌ గోల్డిన్‌ అధ్యయనం నుంచి భారతదేశం సైతం పాఠాలు నేర్వాలి. 

ఏ దేశమైనా సరే ఆర్థిక పురోగతి సాధించినంత మాత్రాన శ్రామిక విపణిలో లింగ వ్యత్యాసం దానంతట అది తగ్గిపోదని గోల్డిన్‌ నిరూపించారు. అలాగే, సామాజిక, వ్యవస్థాపరమైన అవ రోధాలు ఉన్నంత కాలం కేవలం స్త్రీ విద్య సైతం శ్రామికశక్తిలో లింగ అంతరాల్ని తగ్గించలేదు.

సాంప్రదాయిక సమాజాల్లో పిల్లల పెంపకమూ ఓ కీలకాంశం. విధాన నిర్ణేతలు వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. లింగ కోణం నుంచి అర్థశాస్త్ర అధ్యయనం ప్రధాన స్రవంతిలో భాగం కాదన్న భావనల్ని గోల్డిన్‌ బద్దలుకొట్టారు. అమెరికా నుంచి ఇరాన్‌ దాకా ప్రపంచంలో ప్రతి చోటా ఇవాళ్టికీ ఆడవారి పరిస్థితి ఒకేలా ఉంది. ఇవాళ పురుషుల్లో నూటికి 80 మంది ఉద్యోగాల్లో ఉంటే, ప్రపంచ మహిళా జనాభాలో కేవలం సగం మందే వేతన ఉపాధి పొందుతున్నారు. అదీ మగవాళ్ళ కన్నా తక్కువ వేతనాలకే పనిచేస్తూ, వృత్తిలో ఉన్నత శిఖరాల అధిరోహణకు అవకాశాలూ తక్కువే.

అందుకే, లింగ సమానత్వ సాధనలో ప్రపంచం ప్రయాణించాల్సిన దూరం ఇంకా ఎంతో ఉంది. ఆ దిశలో నోబెల్‌ విజేతలైన గోల్డిన్‌ అధ్యయనం, నర్గిస్‌ పోరాటం మనకు తాజా మార్గదర్శకాలు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement