బంధం బలపడుతోంది! | Sakshi Editorial On India UAE Relations getting stronger | Sakshi
Sakshi News home page

బంధం బలపడుతోంది!

Published Fri, Feb 16 2024 12:04 AM | Last Updated on Fri, Feb 16 2024 12:08 AM

Sakshi Editorial On India UAE Relations getting stronger

ప్రధానమంత్రిగా తన రెండో విడత పదవీకాలం ముగిసిపోనున్న వేళ నరేంద్ర మోదీ చేస్తున్న తుది అంతర్జాతీయ పర్యటనల్లో ఒకటి గత రెండు మూడు రోజులుగా ఆసక్తి రేపుతోంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో, ఆ వెంటనే ఖతార్‌లో సాగిన మోదీ పర్యటన ఘన విజయం సాధించిందనే చెప్పాలి. అబుదాబిలో స్వామి నారాయణ్‌ ఆలయ ప్రారంభోత్సవం, ఈ పర్యటనకు సరిగ్గా ఒక రోజు ముందే ఖతార్‌ నుంచి ఎనిమిది మంది భారత మాజీ నౌకాదళాధికారుల విడుదల, దుబాయ్‌లోని వరల్డ్‌ గవర్నమెంట్‌ సమిట్‌లో ఇతర దేశాలు చెవి ఒగ్గి మన మాట వినేలా చేయడంలో భారత విజయం... ఇవన్నీ ఛాతీ ఒకింత ఉప్పొంగే క్షణాలు.

కృత్రిమ మేధ (ఏఐ), క్రిప్టో కరెన్సీ సహా పలు అంశాలపై ప్రపంచ దేశాల మధ్య సహకారానికి పిలుపునిస్తూ, ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది సమ్మిళిత, స్వచ్ఛ, పారదర్శక, పర్యావరణ హిత ప్రభుత్వాలని భారత ప్రధాని పేర్కొనడం సైతం ఆకర్షించిందనే చెప్పాలి. వెరసి, అరబ్‌ ఎమిరేట్స్‌ అధ్యక్షుడితో భారత ప్రధానికి ఉన్న ప్రత్యేక అనుబంధం రెండు దేశాలనూ మరింత సన్నిహితం చేస్తోంది. నమ్మకమైన ఇలాంటి మిత్రదేశం చలవతో గల్ఫ్‌ ప్రాంతంలో భారత ప్రాబల్యం మరింత పెరగడం ఖాయమనిపిస్తోంది. 

తాజా పర్యటనలో భాగంగా యూఏఈ రాజధాని అబుదాబిలో ‘ఎహ్లాన్‌ మోదీ’ (మోదీకి స్వాగతం) కార్యక్రమం అట్టహాసంగా సాగింది. అక్కడి పాలకులను ప్రశంసిస్తూ, ప్రవాస భారతీ యులను ఉత్తేజపరుస్తూ ఆ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ హంగామా కానీ, ఆ మర్నాడు చేసిన భారీ హిందూ దేవాలయ ప్రారంభోత్సవం కానీ భారత్, గల్ఫ్‌సీమల మధ్య బలపడుతున్న బంధా నికి ప్రతీకలే. చెప్పాలంటే, మన దేశం దృష్టిలో పశ్చిమాసియాకు ముఖద్వారం అబుదాబి. అందుకే 2015 ఆగస్ట్‌లో మోదీ తొలిసారిగా ఈ గల్ఫ్‌దేశాన్ని సందర్శించారు.

1981లో ఇందిరా గాంధీ అనంతరం భారత ప్రధాని ఒకరు అక్కడికి వెళ్ళడం అదే తొలిసారి. మూడు దశాబ్దాల పైచిలుకు తర్వాత మొదలుపెట్టినా అప్పటి నుంచి ఈ తొమ్మిదేళ్ళలో 7 సార్లు యూఏఈ వెళ్ళారు మోదీ. విస్తృత ద్వైపాక్షిక అజెండాకూ, ఇరు దేశాల మధ్య బలమైన బంధానికీ అది బలమైన పునాది అయింది. పనిలో పనిగా యూఏఈలోని ప్రవాస భారతీయుల దీర్ఘకాలిక వాంఛకు తగ్గట్టుగా హిందూ ఆలయ నిర్మాణానికి స్థలం కోరారు. ఆ దేశం అంగీకరించింది. సంప్రదాయవాద ఇస్లామిక్‌ దేశంలో, పూర్తిగా ఆ దేశ పాలకుల అండతో, 27 ఎకరాల విశాల ప్రాంగణంలో అత్యంత భారీ హిందూ దేవాలయ నిర్మాణం జరగడం, దాని ప్రారంభోత్సవానికి భారత ప్రధాని వెళ్ళడం అనూహ్యం, అసాధారణం. 

ఇరుదేశాల మధ్య గాఢమైన బంధాన్ని పరస్పర ప్రయోజనాలు ప్రోది చేశాయి. యూఏఈలో దాదాపు 35 లక్షల మంది ప్రవాస భారతీయులున్నారని లెక్క. ఏడు దేశాల సమూహమైన యూఏఈ మన వాళ్ళకు ఉపాధి అందించే కేంద్రం. ఫలితంగా, అక్కడి నుంచి మన దేశానికి ధన ప్రవాహం సరేసరి. గల్ఫ్‌సీమకు సైతం మనం వాణిజ్యానికీ, వ్యూహాత్మకంగా నమ్మదగిన దేశమయ్యాం. వీటన్నిటి ఫలితంగా స్థానిక రాజకీయాలతో సంబంధం లేకుండా కొన్నేళ్ళుగా బంధం బలపడిందన్న మాట.

అసలు పశ్చిమాసియాలోని వివిధ శక్తిసంపన్న దేశాలతో చారిత్రకంగా మన దేశానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సున్నీల ప్రాబల్యమున్న సౌదీ అరేబియా నుంచి షియాలు చక్రం తిప్పే ఇరాన్‌ వరకు అన్నీ మనకు మిత్రదేశాలే. ఆ మధ్య కొన్నేళ్ళుగా అరబ్‌ ప్రపంచానికీ, ఇజ్రాయెల్‌కూ మధ్య సర్దుబాటు చేసే క్రమంలో పశ్చిమాసియాతో మన బంధం మరింత దృఢమవుతూ వచ్చింది. ఇక, భారత్, ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికాల మధ్య ఐ2యూ2 సాంకేతిక సహకారం నిమిత్తం 2022 జూలైలో అమెరికాతో కలసి మనం సంతకాలు చేశాం. 

ఖతార్‌ సైతం భారత్‌లో గణనీయంగా పెట్టుబడులు పెడుతోంది. అంతేకాక, భారత్‌ చేసుకొనే ద్రవీకృత సహజవాయు (ఎల్‌ఎన్‌జీ) దిగుమతుల్లో సగభాగం ఖతార్‌ చలవే. పైగా రష్యా ఇంధనంపై ఆధారపడడాన్ని తగ్గించుకొనేలా ఒప్పందాల కోసం యూరప్‌ సైతం ఈ ప్రాంతం వైపు చూస్తున్న సమయంలో... భారత్‌ – ఖతార్‌ల మధ్య దీర్ఘకాలిక ఇంధన సరఫరా ఒప్పందం సంతోషదాయక విషయం. నిజానికి, 2022లోనే ఇరుదేశాలూ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి, 100 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేర్చాలని బాస చేసుకున్నాయి.

ఇంధనం, డిజిటల్‌ లావాదేవీలు సహా పలు అంశాలపై ఒప్పందాలు కుదరడం విశేషం. ఇక,ఇండియా – మధ్యప్రాచ్యం– యూరప్‌ ఆర్థిక నడవాకు సంబంధించి ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒడంబడిక అత్యంత కీలకమైనది. చైనా చేపట్టిన ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌’కు ప్రత్యామ్నా యమని భావిస్తున్న నడవాను గత సెప్టెంబర్‌లో ఢిల్లీలో జీ20 సదస్సు వేళ ప్రకటించారు. గాజాలో యుద్ధం కారణంగా దాని భవిష్యత్తుపై ప్రస్తుతం కొంత నీలినీడలు పరుచుకున్నా ఒక్కసారి అమలైతే ప్రాంతీయ అనుసంధానాన్ని అది పెంచుతుంది. 

అబుదాబిలో దిగితే అచ్చం స్వదేశంలో ఉన్నట్టే ఉందని భారత ప్రధాని వ్యాఖ్యానించడం గమనార్హం. వినడానికి కాస్త అత్యుక్తిగా అనిపించినా, ఆ మాటల్లో వాస్తవం లేకపోలేదు. భారత్‌ – అరబ్‌ ఎమిరేట్స్‌ మధ్య సాంస్కృతికంగా, ఆర్థికంగా, భౌగోళిక రాజకీయాల పరంగా సత్సంబంధాల సంచిత ఫలితమది. ముస్లిమ్‌ మెజారిటీ దేశంలో ఒక అతి పెద్ద హిందూ ఆలయ నిర్మాణం పెరుగుతున్న ధార్మిక సహిష్ణుతకు చిహ్నమనే చెప్పాలి. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ఆయుధాలు, సైనిక టెక్నాలజీల విషయంలోనూ గల్ఫ్, భారత్‌ కలసి అడుగులు వేస్తే మంచిది. పశ్చిమ హిందూ మహా సముద్రంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. పరస్పర వ్యూహాత్మక ప్రయోజనాలూ నెరవేరుతాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement