అవధుల్లేని కళ | Sakshi Editorial On Govindan Aravindan | Sakshi
Sakshi News home page

అవధుల్లేని కళ

Published Sun, May 29 2022 11:44 PM | Last Updated on Sun, May 29 2022 11:44 PM

Sakshi Editorial On Govindan Aravindan

గోవిందుని అరవిందన్‌ సినిమాల్లోకి రాకముందు కార్టూనిస్టుగా పనిచేశారు. ఆయన కార్టూన్‌ స్ట్రిప్‌ ‘చెరియ మనుష్యారుమ్‌ వలియ లోకవుమ్‌’ (చిన్న మనుషులు పెద్ద ప్రపంచం) దశాబ్దానికి పైగా మలయాళ వారపత్రిక మాతభూమిలో వచ్చింది. దీన్ని ఆధారం చేసుకొనే తన మొదటి సినిమా ‘ఉత్తరాయణం’కు(1974) శ్రీకారం చుట్టారు. అప్పటికే నాటకరంగంలో కూడా చేస్తున్న కషి ఆయన్ని చిత్రసీమలోకి అడుగుపెట్టేలా పురిగొల్పింది. స్వాతంత్య్ర సమర కాలంలో ఒక సాధారణ యువకుడి ద్వైదీ భావాలనూ, వేర్వేరు పోరాట మార్గాలనూ, కొందరు మనుషుల అవకాశవాదాన్నీ అతిసహజంగా చిత్రించిన ఈ సినిమా మలయాళ పరిశ్రమలో కొత్తగాలిలా వీచింది. అప్పుడప్పుడే మలయాళ పరిశ్రమ ఉత్తరాదిన వీస్తున్న సమాంతర సినిమా పవనాలకు పరిచయం అవుతోంది.

మున్ముందు జి.అరవిందన్‌గా సుప్రసిద్ధం కాబోతున్న గోవిందుని అరవిందన్‌(1935–1991) తర్వాతి సినిమాగా ‘కాంచనసీత’ ప్రారంభించారు. 1977లో వచ్చిన ఈ సినిమా చూస్తే గుప్పెడు మందితో, ఏ ఆర్భాటమూ హడావుడీ లేకుండా కూడా రామాయణాన్ని తెరకెక్కించవచ్చా అన్న సంభ్రమాశ్చర్యం కలుగుతుంది. తక్కువ మాటలు, శక్తిమంతమైన ప్రతీకలు, దశ్యబలంతో ఉత్తర రామాయణాన్ని ఒక వ్యక్తిగత కవితా అభివ్యక్తిగా మలిచారు. ఇంకా దీని విశేషం ఏమిటంటే– తారలనూ, అలవాటుగా చూస్తున్న నునుపైన తెలుపు శరీరాలనూ పక్కనపెట్టి రాముడితో దగ్గరి సంబంధం ఉందని చెప్పుకొనే ‘రామచెంచు’ తెగవాళ్లతోనే ప్రధాన పాత్రలను పోషింపజేయడం! దీనివల్ల ఛాందసవాదుల నుంచి దైవదూషణ స్థాయి వ్యతిరేకతనూ ఎదుర్కొన్నారు. కానీ వెనక్కి తగ్గ లేదు. సినిమా పట్ల ఆయన దక్పథం అంత బలమైనది. అందువల్లే మలయాళంలో సమాంతర సినిమాకు దారిచూపిన మొదటి వరుస చిత్రంగా కాంచనసీత చరిత్ర కెక్కింది. ఈ సినిమా షూటింగ్‌ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో జరగడంతో తెలుగువారికి కూడా దీంతో మరింత సంబంధం ఏర్పడింది.

అరవిందన్‌ తర్వాతి సినిమా 1978లో వచ్చిన ‘థంపు’. అంటే సర్కస్‌ డేరా. దీన్ని బ్లాక్‌ అండ్‌ వైట్‌లో తీయాలని పూనుకోవడానికి బహుశా జీవితపు నలుపూ తెలుపుల్నీ అత్యంత గాఢంగా చూపాలని కావొచ్చు. ఒక ఊరికి సర్కస్‌ వాళ్లు రావడంతో మొదలై, కొన్ని రోజులు చుట్టుపక్కల వాళ్లని ఊరించి, ఊగించి, తిరిగి ఏ ఆదరణా లేని దశకు చేరుకుని కొత్త ఊరిని వెతుక్కుంటూ పోయేదాకా కథ సాగుతుంది. ఏ కళకైనా అవధులు ఉన్నాయనీ, ఆకర్షణ ఎల్లవేళలా నిలిచేది కాదనీ చాటినట్టుగా ఉంటుంది. ఒక గొప్ప కళాకారుడు మాత్రమే కళకు పరిమితులు ఉన్నాయని గుర్తించగలడు. జీవిత రంగం నుంచి అందరమూ ఎప్పుడో ఒకప్పుడు నిష్క్రమించాల్సిన వాళ్లమేనన్న కఠోర సత్యాన్ని కూడా ఇది గుర్తు చేయొచ్చు. దాదాపుగా డాక్యుమెంటరీలా సాగే ఈ సినిమా సర్కస్‌ చూస్తున్న ప్రతి ఒక్కరి, ప్రతి ఒక్క హావభావాలను పట్టుకుంటుంది. మనుషుల మీద ఎంతో ప్రేమ ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి సినిమాలు తీయగలరు.

ఒక మనిషి మానసికంగా కుప్పగూలే పరిస్థితులు ఎలా వస్తాయన్నది చూపిన చిత్రం ‘పోక్కు వెయిల్‌’(సాయంసంధ్య–1981). చాలా నెమ్మదైన కథనం. కానీ ‘తీవ్రమైన నెమ్మదితనం’ అది. అందులోంచే ఉద్వేగాన్ని ఉచ్చస్థాయికి తీసుకెళ్తారు. సినిమా అనేది గిమ్మిక్కు కాదంటారు అరవిందన్‌. దీనితో ఏకీభావం ఉన్నవాళ్లకు ఇది గొప్ప అనుభవాన్ని ఇవ్వగలుగుతుంది. స్త్రీ పురుష సంబంధాలూ, ఆకర్షణల్లోని సంక్లిష్టతనూ, తదుపరి పర్యవసనాలూ, పశ్చాత్తాపాలనూ ఎంతో సున్నితంగా ఆవిష్కరించిన ‘చిదంబరం’(1985) ఆయన మాస్టర్‌పీస్‌. మొదటి సినిమా మినహా ఈ అన్నింటికీ మున్ముందు మలయాళంలో మరో ప్రసిద్ధ దర్శకుడిగా అవతరించనున్న షాజీ ఎన్‌.కరుణ్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయడం గమనార్హం. 56 ఏళ్ల వయసులోనే అర్ధాంతరంగా కన్నుమూసిన అరవిందన్‌ ఉన్ని, కుమ్మట్టి, ఎస్తప్పన్, వస్తుహార లాంటి సినిమాలు తీయడంతోపాటు ఆరో ఓరల్, పిరవి లాంటి చిత్రాలకు సంగీత దర్శకత్వమూ వహించారు. ప్రతి సినిమాకూ ఎప్పటికప్పుడు నెరేటివ్‌ శైలిని మార్చుకుంటూ ప్రతిదాన్నీ ఒక కొత్త ప్రయోగంగా చేయడం ఆయన ప్రత్యేకత.

‘పాన్‌ ఇండియా’, ‘పాన్‌ వరల్డ్‌’ లాంటి మాటలు కేవలం వ్యాపార లెక్కలు. నిలిచిపోయే సినిమాలకు అవి కొలమానం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు దేశంలో సినిమా ప్రేమికులు అత్యంత ఆసక్తి ప్రదర్శిస్తున్న సినీ పరిశ్రమ ఏదైనా ఉందంటే, అది మలయాళ చిత్రసీమే. ఒక నిబద్ధతతో వచ్చిన చిత్రాల ఒరవడిని అద్దుకున్న జీవితపు వాస్తవికతా, కథను చూడబుద్ధేసేట్టుగా చెప్పడంలో కమర్షియల్‌ సినిమా సాధించిన ఒక వేగపు లయా... ఈ రెండింటినీ మేళవించుకొని ఇండియా మొత్తాన్నీ తమవైపు తిప్పుకొంటోంది. దాని వెనక అరవిందన్‌ లాంటి వారి స్ఫూర్తి విస్మరించలేనిది.

ప్రతి ఏడాదీ ప్రపంచ సినిమా జీవులు ఎంతో ఆసక్తి కనబరిచే ప్రతిష్ఠాత్మక కాన్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఫ్రాన్స్‌లో ముగిసింది. మే 17 నుంచి 28 వరకు జరిగిన 2022 సంవత్సరపు ఈ ఉత్సవం మిరుమిట్లు గొలిపే తారల మధ్య ఎంతో వైభవోపేతంగా జరిగింది. భారతదేశం తరఫున క్లాసిక్‌ విభాగంలో అక్కడ ప్రదర్శనకు నోచుకున్న సినిమాలు రెండే రెండు. ఒకటి, సత్యజిత్‌ రే ‘ప్రతిద్వంది’ కాగా, రెండవది జి. అరవిందన్‌ ‘థంప్‌’. (కొత్త వెర్షన్‌లో థంపును థంప్‌గా మార్చారు.) రెండు నిరాడంబర సినిమాలు ఆ ఆర్భాటపు పండుగలో ప్రదర్శన జరగడం విరోధాభాసే కావొచ్చుగానీ అదే జీవితపు తమాషా కూడా!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement