కొలంబియాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి | Suspicious death of Telugu student in Columbia | Sakshi
Sakshi News home page

కొలంబియాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి

Published Sun, Sep 24 2023 4:14 AM | Last Updated on Sun, Sep 24 2023 4:01 PM

Suspicious death of Telugu student in Columbia - Sakshi

జి.కొండూరు(మైలవరం): కొలంబియాలో స్నేహి­తురాలి జన్మదిన వేడుకలకు హాజరైన తెలుగు విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు గ్రామానికి చెందిన బేతపూడి సుదీర్‌కుమా­ర్‌ అలియాస్‌ జోషి (34) టెలీ కమ్యూనికేషన్‌లో ఎంఎస్‌ చేసేందుకు 2018లో స్పెయిన్‌ వెళ్లాడు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్‌ లే డే జైన్‌లో ఎంఎస్‌లో చేరా­డు. కరోనా కారణంగా చదువు పూర్తి కాకపోవడం, సబ్జెక్ట్‌లు మిగిలిపోవడంతో అక్కడే ఉండి పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసుకుంటూ ఎంఎస్‌ పూర్తి చేసేందు­కు ప్రయత్నిస్తున్నాడు.

తనతోపాటు అదే యూనివర్సిటీలో చదువుతున్న కొలంబియాకు చెందిన యువతి జెస్సికాతో సుదీర్‌కుమార్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన తన స్నేహితురాలి జన్మదిన వేడుకల నిమి­త్తం సుదీర్‌కుమార్‌ స్పెయిన్‌ నుంచి కొలంబియా రాజధాని బోగోటో వెళ్లాడు. అక్కడి నుంచి రియో బ్లాంకోలోని స్నేహితురాలి నివాసానికి చేరుకున్నాడు. అక్కడ జన్మ­దిన వేడుకల అనంతరం ఏం జరిగిందో ఏమో కానీ ఈ నెల 19వ తేదీన మంగళవా­రం తెల్లవారుజామున కొలంబియాలోని జెస్సీకా నుంచి జి.కొండూరులోని సుదీర్‌కుమార్‌ తల్లిదండ్రులు బేతపూడి కేథరీన్, దేవదాసుకు సుదీర్‌కుమార్‌ మరణ వార్త అందింది.

తన ఇంట్లోనే సుదీర్‌కుమార్‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని జెస్సీకా తెలిపినట్లు కేథరీన్, దేవదాసు చెబుతున్నారు. స్నేహితురాలి జన్మదిన వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సైతం తమతో వాట్సాప్‌లో పంచుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జన్మదిన వేడుకలలో భాగంగా తాగిన డ్రింక్‌ వల్ల మత్తుగా ఉందని, తర్వాత మాట్లాడతా­నని తమతో చివరిగా ఫోన్‌లో మాట్లాడినట్లు చెబు­తున్నారు.

తమ కుమారుడిని జన్మదిన వేడుకల పేరుతో రప్పించి కావాలని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము ఆర్థి­కంగా ఇబ్బంది పడుతున్న క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని తమ కుమారుడి భౌతికకాయం తమకు అప్పగించేలా చూడాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement