రూ.కోట్ల విలువైన బంగారం పట్టివేత Seizure of gold worth crores of rupees | Sakshi
Sakshi News home page

రూ.కోట్ల విలువైన బంగారం పట్టివేత

Published Sat, Jun 1 2024 5:59 AM | Last Updated on Sat, Jun 1 2024 11:30 AM

Seizure of gold worth crores of rupees

నెల్లూరు జిల్లా గౌరవరం టోల్‌ప్లాజా వద్ద 2.94 కేజీల బంగారు బిస్కెట్లు స్వాధీనం

వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద మరో 1.5 కిలోల బంగారం..

కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కావలి/వెంకటాచలం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... కావలి సమీపంలోని గౌరవరం టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం వేకువజామున మూడు గంటల సమయంలో కావలి రూరల్‌ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. 

చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు అనుమానాస్పదంగా కనిపించడంతో సోదాలు నిర్వహించారు. సీట్ల కింద ఎవరికి అనుమానం రాకుండా ఏర్పాటు చేసిన సీక్రెట్‌ లాకర్లలో పెట్టి తరలిస్తున్న సుమారు రూ.2.10 కోట్ల విలువైన 2.94 కేజీల బంగారు బిస్కెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. 

బంగారం తరలిస్తున్న చెన్నైకి చెందిన మార్వాడీ వ్యాపారులు ఆశిష్‌ కుమార్, కమలేష్‌లను ప్రశ్నించగా బంగారానికి సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు.

మరో కారులో చెన్నై నుంచి తెనాలి తరలిస్తుండగా..
వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద 1.5 కిలోల బంగారాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. టోల్‌ప్లాజా వద్ద ఎస్‌ఐ నరేష్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది తనిఖీ చేపట్టారు. 

ఈ క్రమంలో చెన్నైకి చెందిన రాకేష్‌కుమార్‌ జైన్, లతాజైన్‌ దంపతులు చెన్నై వైపు నుంచి తెనాలికి టీఎన్‌ 01 బీఎస్‌3092 నంబరు కారులో వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. కారులో 1.5 కిలోల బంగారాన్ని గుర్తించారు. బంగారానికి సంబంధించి ఎలాంటి బిల్లులు చూపకపోవడంతో బంగారాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement