పీఎన్‌బీ స్కాం : నీరవ్ భార్యకు రెడ్ కార్నర్ నోటీసు | Red Corner Notice Against Nirav Modi Wife In Money Laundering Cases | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ స్కాం : నీరవ్ భార్యకు రెడ్ కార్నర్ నోటీసు

Published Tue, Aug 25 2020 2:28 PM | Last Updated on Tue, Aug 25 2020 2:45 PM

Red Corner Notice Against Nirav Modi Wife In Money Laundering Cases - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరగాడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోడీ భార్య అమీ మోడీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. మనీలాండరింగ్ ఆరోపణలతో నమోదైన కేసులో భాగంగా దర్యాప్తు సంస్థ ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్ పోల్ ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.  (చదవండి: నీరవ్‌ మోదీ ఆస్తులు జప్తు చేసిన ఈడీ)

న్యూయార్క్ నగరంలో 30 మిలియన్ డాలర్ల విలువైన రెండు అపార్టుమెంట్ల కొనుగోలుకు సంబంధించి మోడీ అక్రమ లావాదేవీలకుపయోగించిన పలు కంపెనీలకు డైరెక్టరుగా ఉన్న అమీ పేరును తొలిసారిగా గత ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనుబంధ చార్జిషీట్‌లో జత చేసింది. తాజాగా అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్‌గా భావించే రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యింది. ఈ కుంభకోణంలో ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించక ముందే, 2018 జనవరి మొదటి వారంలో అమీ, భర్త నీరవ్ మోడీ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి లండన్ కు పారిపోయారు. 

కాగా అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా నిలిచిన 13,500 కోట్ల రూపాయల పీఎన్‌బీ స్కాంలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (48), అతని మామ, మెహుల్ చోక్సీ( 60) ప్రధాన నిందితులుగా ఉన్నారు.  ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించిన సీబీఐ, ఈడీ పలు చార్జ్ షీట్లను మోదు చేయడంతోపాటు, కుటుంబ సభ్యుల పేర్లను కూడా చేర్చింది. దర్యాప్తులో భాగంగా పలు విదేశీ, స్వదేశీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. గత ఏడాది లండన్‌లో అరెస్టయి, ప్రస్తుతం వాండ్స్‌వర్త్ జైలులో ఉన్న మోడీని దేశానికి తిరిగి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ నెల ప్రారంభంలో జరిగిన సాధారణ రిమాండ్ విచారణ అనంతరం లండ‌న్ కోర్టు మోడీని ఆగస్టు 27 వరకు రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement