సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తు కొలిక్కి Police Department Found attackers On CM YS Jagan At Vijayawada | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తు కొలిక్కి

Published Thu, Apr 18 2024 3:38 AM | Last Updated on Thu, Apr 18 2024 3:38 AM

Police Department Found attackers On CM YS Jagan At Vijayawada - Sakshi

సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసును ఛేదించిన పోలీసులు 

దాడికి పాల్పడ్డ దుండగుడి గుర్తింపు 

ఓ టీడీపీ నేతతోపాటు అదుపులో కీలక నిందితులు 

కుట్ర కోణంపై కీలక సమాచారం రాబట్టిన పోలీసులు 

విచారణలో సంచలన విషయాలు వెల్లడి! 

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పోలీసుల నివేదిక 

నేడు దర్యాప్తు వివరాలను వెల్లడించే అవకాశం  

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో పోలీసుల దర్యాప్తు కొలిక్కి వచ్చింది. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో శనివారం రాత్రి  ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి  పాల్పడ్డ దుండగుడితోపాటు సహ­కరించిన ముఠా, కీలక సూత్రధారులను పోలీ­సులు గుర్తించినట్లు సమాచారం. దాడికి పాల్పడినట్లు గుర్తించిన అనుమానితుడితోపాటు మరో ఐదుగురిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఒకరు ఉండటం గమనార్హం.

హత్యాయత్నం వెనుక కుట్ర కోణంలో సంచలన విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. అనుమానితులు, తెర వెనుక పాత్రధారులకు సంబంధించిన ఆధారాలను పక్కా శాస్త్రీయంగా విశ్లేషించారు. నేరాన్ని రుజువు చేసేందుకు హేతుబద్ధమైన ఆధారాలను సేకరించి క్రోడీకరించారు. సాంకేతికపరమైన ప్రక్రియను కూడా పాటించిన అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు గురువారం వెల్లడించే అవకాశాలున్నాయి. 

60 మందికిపైగా విచారణ 
ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. పదునైన రాయితో ఏ విధంగా హత్యాయత్నానికి పాల్పడిందీ నిర్ధారించారు. పదునైన రాయితో దాడి చేసింది ఎవరు? దుండగుడికి సహకారం అందించింది ఎవరు? అనే కీలక అంశాలను రాబట్టారు. వీడియో ఫుటేజీలు, కాల్‌ డేటా, ఇతర శాస్త్రీయ ఆధారాలతో కేసు దర్యాప్తును పోలీసులు తుది అంకానికి తెచ్చారు. దాదాపు 60 మందికిపైగా అనుమానితులను విచారించి అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేసి కేసును కొలిక్కి తెచ్చారు.

కుట్ర కోణంపై ముమ్మర దర్యాప్తు 
ఈ హత్యాయత్నం వెనుక కుట్ర కోణంపై విచారణ సందర్భంగా సంచలన విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. దుండగుడికి సహకరించినవారితోపాటు ఆ దిశగా ప్రోత్సహించిన కీలక నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతడు విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో టీడీపీ క్రియాశీలక నేత కావడం గమనార్హం. టీడీపీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని క్షుణ్నంగా విచారించడంతో సంచలన అంశాలు వెల్లడైనట్టు తెలుస్తోంది.  

అజ్ఞాతంలో సెంట్రల్‌ నేత 
తాజా పరిణామాల నేపథ్యంలో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత అజ్ఞాతంలోకి వెళ్లడం గమనార్హం. పోలీసులు దీంతో నిమిత్తం లేకుండా ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను పాటిస్తూ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. టీడీపీ నేత వెల్లడించిన విషయాలను ఇతర అంశాలతో సరిపోల్చి నిర్ధారించుకుంటున్నారు. అదుపులో ఉన్న నిందితులు వెల్లడించిన కుట్ర కోణం వాస్తవమేనని నిర్ధారించుకున్న తరువాతే తదుపరి చర్యలు చేపట్టాలన్నది పోలీసుల ఉద్దేశం. దాంతో ఆ దిశగా దర్యాప్తు వేగం పుంజుకుంది. 

ప్రధాన ఎన్నికల అధికారికి నివేదిక
ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఈ కేసు దర్యాప్తు వివరాలను పోలీసులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాకు ఎప్పటికప్పుడు నివేదిస్తు­న్నారు. దాడికి పాల్పడిన విధానం, అనుమా­నితుల నుంచి సేకరించిన సమాచారం, కుట్ర కోణాలపై కీలక సమాచారాన్ని విజయవాడ పోలీసులు ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి నివేదించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు వివరాలపై ఆయన వ్యక్తం చేసిన సందేహాలను సంతృప్తికరంగా నివృత్తి చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో సాంకేతిక వ్యవహారాలను పూర్తి చేసి కేసులో కీలక వివరాలను నేడు వెల్లడించవచ్చని భావిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement