కన్నీళ్లు తెప్పించే ఘటన.. నీవు లేక నేను లేను.. Husband Suicide with wife lost breath At BR Ambedkar Konaseema | Sakshi
Sakshi News home page

కన్నీళ్లు తెప్పించే ఘటన.. నీవు లేక నేను లేను..

Published Mon, Dec 19 2022 5:04 AM | Last Updated on Mon, Dec 19 2022 7:35 AM

Husband Suicide with wife lost breath At BR Ambedkar Konaseema - Sakshi

అమలాపురం టౌన్‌: భార్య మృతిని తట్టుకోలేని భర్త కొద్దిసేపటికే బలవన్మరణానికి పాల్పడ్డాడు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలోని కొంకాపల్లిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ విషాద ఘటన కలకలం రేపింది. పట్టణ ఇన్‌చార్జి సీఐ  వీరబాబు, స్థానికుల కథనం ప్రకారం.. కొంకాపల్లిలో భార్యాభర్తలు బోనం తులసీలక్ష్మి(45), శ్రీరామ విజయకుమార్‌(47) ఇంట్లోనే కొద్ది నిమిషాల తేడాలో మృతి చెందారు.

ఓఎన్జీసీ సబ్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న విజయకుమార్‌ ఇటీవల ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. భార్య తులసీలక్ష్మికి మూడు నెలల కిందట మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగి, అనారోగ్యంతో అవస్థలు పడుతోంది. శనివారం రాత్రి ఇద్దరూ ఇంట్లో నిద్రపోయారు. తెల్లవారుజామున తులసీలక్ష్మి బెడ్‌ రూమ్‌లో మంచంపై విగతజీవిగా ఉంది. ఆమె మరణాన్ని భర్త విజయకుమార్‌ తట్టుకోలేకపోయాడు.

అప్పటికే ఆర్థిక సమస్యలతో మానసిక ఒత్తిడికి గురవుతున్న అతనికి భార్య మృతి మరింత కుంగదీసింది. ఈ నేపథ్యంలో  మనస్తాపానికి గురై తన ఇంటి రెండో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి కుమారుడు కృష్ణ విజయవాడలో ఇంటర్‌ చదువుతున్నాడు.

తల్లిదండ్రుల మరణవార్త తెలియడంతో అతడు విజయవాడ నుంచి హుటాహుటిన వచ్చి.. అమ్మానాన్నల మృతదేహాలపై పడి ఏడ్వడం అందరినీ కలచివేసింది. తులసీలక్ష్మి తండ్రి గోవిందు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరబాబు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement