అవమానించడంతోనే పెట్రోల్‌ పోసుకున్నా  | Home Guard Ravinder spoke to the media on Wednesday | Sakshi
Sakshi News home page

అవమానించడంతోనే పెట్రోల్‌ పోసుకున్నా 

Published Thu, Sep 7 2023 2:44 AM | Last Updated on Thu, Sep 7 2023 6:11 AM

Home Guard Ravinder spoke to the media on Wednesday - Sakshi

అఫ్జల్‌గంజ్‌/సంతోష్‌నగర్‌: న్యాయంగా రావాల్సిన జీతాన్ని అడిగేందుకు వెళ్లిన తనను హోంగార్డు కార్యాలయ సిబ్బంది దూషించడంతోనే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు హోంగార్డు రవీందర్‌ తెలిపారు. చాంద్రాయణగుట్ట ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రక్షాపురం నివాసి రవీందర్‌ తనకు రావాల్సిన జీతం కోసం గోషామహల్‌లోని హోంగార్డు కార్యాలయానికి మంగళవారం వెళ్లారు. అక్కడి సిబ్బంది అసభ్య పదజాలంతో దూషించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

తీవ్రగాయాలు కాగా వైద్య చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రవీందర్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు. హోంగార్డు అంటే ప్రతి నెలా 1వ తారీఖునే జీతాలిచ్చేయాలా అని చిన్నచూపు చూశారని ఆవే దన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానం రాష్ట్రంలోని ఏ హోంగార్డుకూ జరగకూడదన్నారు.

కాగా ఉస్మానియాలో చికిత్స పొందుతున్న రవీందర్‌ను రాష్ట్ర హోంగార్డు జేఏసీ చైర్మన్‌ నారాయణ పరామర్శించారు. రవీందర్‌ భార్య సంధ్యతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అపోలో డీఆర్‌డీఓ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. రవీందర్‌కు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామన్నారు. హోంగార్డుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 16 వరకు విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.  

నిరసన తెలిపిన హోంగార్డులు..: సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం హోంగార్డులను వెంటనే పర్మనెంట్‌ చేయాలని కోరుతూ బుధవారం సాయంత్రం అపోలో డీఆర్‌డీఓ ఆసుపత్రి ఆవరణలో హోంగార్డులు ఆందోళనకు దిగారు. రవీందర్‌ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలనీ, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. 

సీఎందే బాధ్యత: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 
సాక్షి, హైదరాబాద్‌: రవీందర్‌ ఆత్మహత్యాయ త్నా నికి కేసీఆరే బాధ్యత వహించాలని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ సాక్షిగా 2017లో సీఎం కేసీఆర్‌ హోంగార్డులను పర్మనెంట్‌ చేస్తానని మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు. హోంగార్డులకు బీజేపీ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.  

సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టాలి: బండి 
అమెరికా పర్యటనలో ఉన్న ఎంపీ బండి సంజయ్‌ బుధవారం రాత్రి (భారత సమయం) హోంగార్డు కుటుంబ సభ్యులతోపాటు హోంగార్డ్‌ అసోసియేష న్‌ జేఏసీ జనరల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ వీడియోకాల్‌ చేసి మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ దృశ్యాలను వెంటనే బయటపెట్టాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement