దస్తగిరితో డ్రామా! అప్రూవర్‌ వాంగ్మూలం ఉత్త కథే | CBI investigation bogus in YS Viveka murder case been exposed | Sakshi
Sakshi News home page

దస్తగిరితో డ్రామా! అప్రూవర్‌ వాంగ్మూలం ఉత్త కథే

Published Tue, Apr 18 2023 5:47 AM | Last Updated on Tue, Apr 18 2023 8:33 AM

CBI investigation bogus in YS Viveka murder case been exposed - Sakshi

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఎంత బోగస్‌ అనేది బట్టబయలైంది. ఆ చార్జ్‌షీట్‌ ఎంత కల్పితాల కట్టుకథో స్పష్టమైంది. వివేకాను హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ఇప్పించిన అవాస్తవ వాంగ్మూలం బండారం బహిర్గతమైంది. వాంగ్మూలంలో దస్తగిరి పేర్కొన్న బెంగళూరు భూ సెటిల్‌మెంట్‌ వ్యవహారం పూర్తిగా ఫేక్‌ అని సీబీఐ దర్యాప్తులోనే నిర్ధారణ కావడం గమనార్హం. వివేకాతో ఆయన స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డికి  వివాదాలున్నాయని ఓ కట్టుకథను కేంద్ర బిందువుగా చేసుకుని దాన్ని వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డితో అంటగడుతూ దస్తగిరి ద్వారా సీబీఐ నడిపించిన డ్రామా గుట్టు వీడింది.   

కొత్త బృందం.. పాత పాటే! 
‘బెంగళూరు భూసెటిల్‌మెంట్‌ వ్యవహారంలో ఎర్ర గంగిరెడ్డికి వాటా ఇవ్వకుండా వైఎస్‌ వివేకా ఎగ్గొట్టారు. దీంతో ఎర్ర గంగిరెడ్డి కక్ష పెంచుకుని వివేకాను హత్య చేయాలని నాతో చెప్పారు..!’ ఇదీ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో కీలక అంశం. ‘వివేకాను హత్య చేసిన తరువాత ఆ ఇంట్లో  భూమి పత్రాల కోసం ఎర్రగంగిరెడ్డి గాలించారు..’ అని కూడా అందులో పేర్కొన్నారు.

2019 మార్చి 14న అర్ధరాత్రి దాటిన తరువాత వైఎస్‌ వివేకాను హత్య చేశామని దస్తగిరి చెప్పినట్టు వాంగ్మూలంలో ఉంది. దస్తగిరిని ఢిల్లీకి తరలించి కొద్ది వారాలపాటు చిత్రహింసలు పెట్టి మరీ ఇప్పించిన ఈ వాంగ్మూలం మినహా సీబీఐ వద్ద ఎలాంటి ఆధారం లేదు. పాత బృందంతోపాటు తాజాగా నియమించిన సీబీఐ కొత్త బృందం కూడా ఈ ఒక్క వాంగ్మూలం ఆధారంగానే దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే ఆ వాంగ్మూలం కట్టుకథేనని స్పష్టమైంది.   

డాక్యుమెంట్లు ఫేక్‌... సెటిల్‌మెంట్‌ ఫేక్‌ 
బెంగళూరు యలహంక ప్రాంతంలోని 8.6 ఎకరాల భూమి విషయంపై వై.రాధాకృష్ణ మూర్తి, హిమాచలపతి అనే వ్యక్తుల మధ్య విభేదాలున్నాయి. ఈ విషయం తెలిసి వైఎస్‌ వివేకానందరెడ్డి తన స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డితోపాటు లక్ష్మీకర్, మరికొందరితోపాటు వై.రాధాకృష్ణమూర్తిని కలసి తాము ఆ వివాదాన్ని పరిష్కరిస్తామన్నారు. భూమి వివాదం పరిష్కరిస్తే రూ.8 కోట్లు ఇస్తానని రాధాకృష్ణమూర్తి చెప్పారు. యలహంక ఎమ్మెల్యేగా ఉన్న అప్పటి కర్ణాటక హోంమంత్రి ద్వారా ఆ భూ వివాదాన్ని పరిష్కరించేందుకు వైఎస్‌ వివేకా ప్రయత్నించారు. ఈ క్రమంలో హోంమంత్రి పోలీసు అధికారులను పిలిచి ఆ భూ వివాదంపై చర్చించడంతో రాధాకృష్ణమూర్తి ఇచ్చిన భూమి పత్రాలు ఫోర్జరీవని తేలింది.   

బెడిసికొట్టిన బ్యాంకు రుణం 
భూమి పత్రాలు ఫోర్జరీవని తెలిసినప్పటికీ వైఎస్‌ వివేకా వాటి ఆధారంగా సొమ్ము చేసుకునేందుకు రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ పీటర్‌ క్యాండీని సంప్రదించారు. ఫోర్జరీ పత్రాలను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం ఇప్పించాలని కోరారు. బ్యాంకు రుణం వస్తే అందులో 60 శాతం వివేకా, రాధాకృష్ణమూర్తి పంచుకోగా మిగిలిన 40 శాతాన్ని బ్రోకర్‌ పీటర్‌ క్యాండీ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. లీగల్‌ ఖర్చుల కోసం పీటర్‌ క్యాండీకి మల్లిశెట్టి వెంకటరమణ అనే వ్యక్తి ద్వారా వైఎస్‌ వివేకా రూ.24 లక్షలు ఇప్పించారు. అయితే ఏడాది దాటినా రుణం ఇచ్చేందుకు ఏ బ్యాంకు కూడా సమ్మతించలేదు. దీంతో తాను ఇచ్చిన రూ.24 లక్షలు తిరిగి ఇవ్వాలని వివేకా, పీటర్‌ క్యాండీని మల్లిశెట్టి వెంకటరమణ ఒత్తిడి చేశారు.

లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో 2019 ఫిబ్రవరి, మార్చిలో నాలుగు డిమాండ్‌ డ్రాఫ్ట్‌ల రూపంలో రూ.24 లక్షలు తిరిగి చెల్లించారు. చివరి డిమాండ్‌ డ్రాఫ్ట్‌ను 2019 మార్చి 12న అంటే వివేకా హత్యకు రెండు రోజుల ముందే చెల్లించారు. పీటర్‌ క్యాండీ తన వద్ద ఉన్న ఫోర్జరీ పత్రాలను సైతం రాధాకృష్ణమూర్తి కుమారుడు వెంకట ప్రసాద్‌కు తిరిగి ఇచ్చేశారు. ఇక ఆ భూమి సెటిల్‌మెంట్‌ చేయడం, బ్యాంకు రుణం తీసుకోవడం సాధ్యం కాదని తేలడంతో ఆ వ్యవహారాన్ని వదిలేశారు.

ఈ సెటిల్‌మెంట్‌ చేసేందుకు యత్నించిన వైఎస్‌ వివేకా స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డికి మొత్తం వ్యవహారం తెలుసు. అంటే బెంగళూరు భూ సెటిల్‌మెంట్‌ అన్నదే లేదని, భూమి పత్రాలు సైతం వివేకా వద్ద లేవని ఎర్ర గంగిరెడ్డికి స్పష్టంగా తెలుసు. ఇదంతా సీబీఐ దర్యాప్తులోనే వెల్లడైంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న రాధాకృష్ణమూర్తి, హిమాచలపతి, వెంకట ప్రసాద్, పీటర్‌ క్యాండీలను సీబీఐ అధికారులు విచారించి మరీ దీన్ని నిర్ధారించుకున్నారు.  

జరగని సెటిల్‌మెంట్‌.. లేని పత్రాల కోసం హత్య ఏమిటి?  
అసలు బెంగళూరు భూసెటిల్‌మెంట్‌ అనేది జరగలేదని ఎర్ర గంగిరెడ్డికి తెలుసు. అటువంటప్పుడు వైఎస్‌ వివేకా తనకు వాటా ఇవ్వలేదని కక్ష ఎందుకు పెంచుకుంటారు? అంటే ఈ కారణంతో వివేకాను హత్య చేయాలని ఎర్ర గంగిరెడ్డి తనకు చెప్పినట్లు దస్తగిరి పేర్కొనడం పూర్తిగా అవాస్తవం అని తేటతెల్లమవుతోంది. వైఎస్‌ వివేకాను హత్య చేసిన తరువాత ఆయన ఇంట్లో బెంగళూరు భూమి పత్రాల కోసం ఎర్ర గంగిరెడ్డి, తాము గాలించినట్లు దస్తగిరి చెప్పాడు. కానీ ఆ భూమి పత్రాలను అప్పటికే రాధాకృష్ణమూర్తి కుమారుడికి తిరిగి ఇచ్చిన విషయం ఎర్ర గంగిరెడ్డికి తెలుసు. దీన్నిబట్టి దస్తగిరి చెప్పింది అవాస్తవమే అని స్పష్టమవుతోంది.

ఇక బెంగళూరు భూ సెటిల్‌మెంట్‌ అన్నదే లేదని ఎర్ర గంగిరెడ్డికి తెలిసినప్పుడు ఆ కారణంతో వైఎస్‌ వివేకాను హత్య చేయమని చెప్పడంగానీ, తనకు అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి సహకారం ఉందనడం కూడా అవాస్తవం అని నిర్ధారణ అవుతోంది. అంటే అప్రూవర్‌ దస్తగిరి వాంగ్మూలం పేరిట సీబీఐ పూర్తిగా కల్పిత కథనాలను అల్లినట్లు తేలిపోతోంది. అసలు ఆ వాంగ్మూలమే అవాస్తవం అయినప్పుడు దాని ఆధారంగా భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిని విచారణ పేరిట సీబీఐ వేధించడం దురుద్దేశపూరితమేని స్పష్టమవుతోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement